‘రావు బహదూర్' మూవీ రివ్యూ
ఘన చరిత్ర ఉన్న జమీందారు కుటుంబానికి చెందిన రామ్ దేవ్ (సత్యదేవ్).. తన ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడైన కుసుమ మరణించిన దగ్గర్నుంచి మానసిక సమస్యలతో బాధ పడుతుంటాడు.
By: Prakash Chimmala | 3 July 2026 4:10 PM ISTనటీనటులు: సత్యదేవ్ - దీప థామస్ - వికాస్ ముప్పాక - ఆనంద్ తదితరులు
సంగీతం: స్మరణ్ సాయి
ఛాయాగ్రహణం: కార్తీక్ పర్మార్
నిర్మాతలు: చింతా గోపాలకృష్ణరెడ్డి - అనురాగ్ రెడ్డి - శరత్ చంద్ర - ఈశ్వరన్ విజయ రాఘవన్
రచన - దర్శకత్వం: వెంకటేష్ మహా
కేరాఫ్ కంచరపాలెంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు వెంకటేష్ మహా, ఆ తర్వాత సొంత కథతో చేసిన సినిమా.. రావు బహదూర్. టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ఇందులో లీడ్ రోల్ చెయ్యడం.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రాన్ని సమర్పించడం..ప్రోమోలు క్రేజీగా ఉండడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ రోజే విదులైన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
ఘన చరిత్ర ఉన్న జమీందారు కుటుంబానికి చెందిన రామ్ దేవ్ (సత్యదేవ్).. తన ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడైన కుసుమ మరణించిన దగ్గర్నుంచి మానసిక సమస్యలతో బాధ పడుతుంటాడు. ఎన్నో ఏళ్ల పాటు తన గదికే అతను పరిమితమైపోతాడు. క్యాన్సర్ బారిన పడ్డాక కూడా అతను ప్రాణాలు కోల్పోకుండా తనలో మెదిలిన ఒక అనుమానం పెనుభూతమై మనోవేదన అనుభవిస్తుంటాడు. రామ్ దేవ్ పెట్టే ఇబ్బందులతో కుటుంబ సభ్యులతో పాటు పని వాళ్లూ నానా పాట్లు పడుతుంటారు. రామ్ దేవ్ ఆప్త మిత్రుడైన వైద్యుడికీ ఈ తలనొప్పి తప్పదు. రామ్ దేవ్ సమస్య పరిష్కరించడం కోసం వైద్యులు- కుటుంబ సభ్యులు ఒక వైపు ప్రయత్నం చేస్తుంటే.. ఇంకోవైపు అతను ఒక కేసులో చిక్కుంటాడు. ఇంతకీ ఆ కేసేంటి.. రామ్ దేవ్ గతమేంటి.. తన మానసిక సమస్యకు మూలమేంటి.. అతడిలో మెదిలిన అనుమానమేంటి.. చివరికి అతడి అనుమానం తీరిందా.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం - విశ్లేషణ:
అందరూ చెప్పే కథలు చెప్పకూడదు.. ఆ కథలను చెప్పే తీరులోనూ వైవిధ్యం చూపించాలి.. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాలి.. వాళ్లను ఆశ్చర్యపరచాలి అన్న తపన అభినందనీయమే. కానీ కొత్తదనం పేరుతో నరేషన్ గందరగోళంగా సాగితే.. అసలు చెప్పాలనుకున్న విషయమే అర్థం కాని పరిస్థితి తలెత్తితే.. అసలు విషయం చెప్పకుండా సాగదీస్తే.. పెట్టిన ఎఫర్ట్ కు తగ్గ ఫలితం ఉండదు. ‘రావు బహదూర్’ సినిమా ఈ కోవకే చెందుతుంది. ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహా మరోసారి భిన్నమైన.. క్రేజీగా అనిపించే కథను ఎంచుకున్నాడు. ఆ కథతో అతను ఇవ్వాలనుకున్న మెసేజ్ బాగుంది. ఈ కథకు ఇచ్చిన ముగింపు వావ్ అనిపిస్తుంది. కానీ చిన్న పాయింటు పట్టుకుని సాగదీయడం.. ముగింపు కోసం ప్రేక్షకులు ఓపిగ్గా ఎదురు చూడాల్సిన పరిస్థితి రావడం సమస్యగా మారింది. సగం సినిమా అయ్యాక కూడా ప్లాట్ పాయింట్ ఏంటో అర్థం కాని అయోమయంలో ప్రేక్షకులు ఉంటారంటే.. అది కథనంలో లోపం వల్లే. రొటీన్ కు భిన్నమైన సినిమాలు చూడాలనుకునే ప్రేక్షకులు దీంతో కనెక్ట్ అయినా సరే.. వాళ్లు కూడా ఎంతో ఓపిక చేసుకోవాల్సిన పరిస్థితి.
ఒక మనిషిలో మొదలైన అనుమానం పెనుభూతంగా మారితే ఏమవుతుందో చెప్పే ప్రయత్నం చేశాడు వెంకటేష్ మహా ఈ చిత్రంతో. సత్యదేవ్ లాంటి గొప్ప నటుడు దొరకడంతో టిపికల్ క్యారెక్టరైజేషన్ తో హీరో పాత్రను తీర్చిదిద్ది.. ప్రేక్షకులను ఎంగేజ్ చేయాలని చూశాడు. ఈ పాత్ర ఆసక్తికరంగానే అనిపిస్తుంది. సత్యదేవ్ కూడా పెర్ఫామెన్స్ అదరగొట్టేశాడు. ఐతే క్యారెక్టరైజేషన్ బాగున్నా.. దాని చుట్టూ సరైన సన్నివేశాలు రాసుకోకపోవడంతో ‘రావు బహదూర్’ ప్రేక్షకులను పూర్తిగా ఎంగేజ్ చేయలేకపోయింది. రొటీన్ కు భిన్నంగా సన్నివేశాలను కన్సీవ్ చేయాలన్న ఆలోచన బాగున్నా.. కథతో అవి ఎంత రిలేట్ అయి ఉన్నాయి.. ప్రేక్షకులను ఎంత మేర ఎంగేజ్ చేస్తాయిని చూసుకోవాల్సింది. సత్యదేవ్ పాత్ర పరిచయం.. ఆరంభంలో కొన్ని సన్నివేశాలు బాగానే అనిపించినా.. తన సమస్యేంటో చెప్పడం కోసం పెట్టిన ఎపిసోడ్లు మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. ముఖ్యంగా తన కొడుకు ఆత్మతో హీరో సంభాషించే సన్నివేశాలు.. అలాగే తమ పూర్వీకులతో కలిసి పాట పాడుకునే ఒక ఎపిసోడ్ చూశాక ప్రేక్షకులు సినిమా పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. ఇంటర్వెల్ కార్డ్ పడ్డాక కూడా.. దర్శకుడు అసలీ సినిమాతో ఏం చెప్పదలుచుకున్నాడో అర్థం కాదు. ప్లాట్ పాయింట్ మీద అవగాహన రాదు.
ద్వితీయార్ధంలో కూడా కథ ఎంతకీ ముందుకు కదలక.. పాత్రల ప్రవర్తన.. వాటి సంభాషణల్లో ఆంతర్యం అర్థం కాక.. రిపిటీటివ్ సీన్లతో ‘రావు బహదూర్’ అసహనానికి గురి చేస్తుంది. ఐతే ఫ్లాష్ బ్యాక్ మొదలయ్యాక మాత్రం సినిమాలో కదలిక వస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో హృద్యంగా సాగే సన్నివేశాలతో ‘రావు బహదూర్’లో ఎమోషన్ వర్కవుట్ అయింది. మళ్లీ వర్తమానంలోకి వచ్చాక కొంత గందరగోళం ఉన్నప్పటికీ.. ఫ్లాష్ బ్యాక్ తో మొదలైన టెంపో చివరి వరకు కొనసాగుతుంది. చివరి 20 నిమిషాల్లో మాత్రం ‘రావు బహదూర్’ వేరే లెవెల్ అనిపిస్తుంది. ఆఖర్లో వచ్చే ట్విస్టులు ఈ కథ గొప్పదనాన్ని చాటుతాయి. ఇక్కడే ఈ సినిమా తీసింది ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడనే విషయం గుర్తుకు వస్తుంది. పతాక ఘట్టం ఎంతో గమ్మత్తుగా అనిపించడంతో పాటు అక్కడ ఇచ్చిన మెసేజ్ కూడా ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. కానీ ఐతే ద్వితీయార్ధంలో ఒకట్రెండు ఎపిసోడ్లు ఎంత మంచి అనుభూతిని ఇచ్చినా.. అంతకుముందు కలిగిన అసహనాన్ని అవి ఎంత మేర మరిపిస్తాయన్నది ప్రేక్షకుల అభిరుచిని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రథమార్థమంతా ఫాస్ట్ ఫార్వర్డ్ లో సాగిపోతే బాగుండనే ఫీలింగ్ కలిగిస్తుంది ‘రావు బహదూర్’. డిఫరెంట్ మూవీస్ చూడాలనుకున్న వాళ్లు ‘రావు బహదూర్’పై ఒక లుక్కేయొచ్చు. కానీ కొంచెం ఓపిక మాత్రం అవసరం.
నటీనటులు:
సత్యదేవ్ నటన గురించి ‘రావు బహదూర్’ టీం అంత గొప్పగా చెప్పడంలో అతిశయోక్తేమీ లేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎవరితోనూ పోల్చలేని విధంగా.. ఇంకెవరినీ ఆ పాత్రలో ఊహించుకోలేని విధంగా అద్భుతమైన ఒరిజినల్ పెర్ఫామెన్స్ ఇచ్చాడతను. ఇప్పటికే ఎన్నో మంచి పాత్రలు చేసినా.. రామ్ దేవ్ పాత్ర అతడి కెరీర్లో ఒక మైలురాయిలా నిలుస్తుంది. సినిమా ఎలా ఉన్నప్పటికీ.. తన నటనతో-హావభావాలతో ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేశాడు సత్యదేవ్. చాలా వరకు తన భుజాల మీద సినిమాను మోశాడు. సత్యదేవ్ జోడీగా మలయాళ అమ్మాయి దీప థామస్ చక్కగా నటించింది. గొప్ప అందగత్తెలా కనిపించకపోయినా.. తన నటనతో ఆమె ప్రేక్షకుల దృష్టిని ఆమె ఆకర్షిస్తుంది. హీరో స్నేహితుడైన వైద్యుడి పాత్రలో వికాస్ ముప్పాక కూడా చాలా బాగా నటించాడు. సినిమా అయ్యాక గుర్తుండే పాత్రల్లో ఇదొకటి. సీనియర్ నటుడు ఆనంద్ క్యామియో తరహా పాత్ర చేశాడు. ఆయన నటనకేమీ వంకలు పెట్టడానికి లేదు. మిగతా ఆర్టిస్టులంతా పెద్దగా పేరు లేని వాళ్లే అయినా.. అందరూ బాగానే చేశారు.
సాంకేతిక వర్గం: టెక్నికల్ గా ‘రావు బహదూర్’లో ఉన్నత ప్రమాణాలు కనిపిస్తాయి. సాంకేతిక నిపుణులంతా దర్శకుడి అభిరుచికి తగ్గట్లు పని చేశారు. స్మరణ్ సాయి నేపథ్య సంగీతం ఎప్పుడూ తెలుగు సినిమాల్లో వినిపించే సౌండ్లకు భిన్నంగా సాగుతుంది. బీజీఎంతోనూ కథను నరేట్ చేసే ప్రయత్నం జరిగింది. కార్తీక్ పర్మార్ ఛాయాగ్రహణం కూడా భిన్నంగా సాగింది. సినిమాకు వింటేజ్ లుక్ తీసుకురావడంలో తన కెమెరా పనితనం కీలక పాత్ర పోషించింది. ఆర్ట్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. వెంకటేష్ మహా.. మరోసారి తాను భిన్నమైన రచయితను-దర్శకుడిని అని చాటాడు. ఈ సినిమాతో అతను చెప్పాలనుకున్న పాయింట్ భలేగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలను రాసిన.. తీసిన తీరు దర్శకుడిగా తన అభిరుచిని చాటుతుంది. తన కథ విశేషమైందే. కానీ దాన్ని నరేట్ చేసిన తీరులో కొన్ని సమస్యలున్నాయి. థ్రిల్లర్ సినిమాల తరహాలో మొత్తం భారాన్ని ట్విస్టుతో ముడిపడ్డ క్లైమాక్స్ మీద మోపేసిన మహా.. అంతకుముందు బోర్ కొట్టించాడు.
చివరగా: రావు బహుదూర్.. కథ క్రేజీ.. కథనం నెమ్మది
రేటింగ్ - 2.5/5
