Begin typing your search above and press return to search.

ప్రశంసలు వచ్చినా.. బాక్సాఫీస్ రిపోర్ట్ ఎలా ఉందంటే?

ట్రేడ్ పండితుల అంచనాల ప్రకారం, విడుదలైన 11 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.13.60 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

By:  M Prashanth   |   14 July 2026 7:33 PM IST
ప్రశంసలు వచ్చినా.. బాక్సాఫీస్ రిపోర్ట్ ఎలా ఉందంటే?
X

సినిమా బాగుందని ప్రశంసలు రావడం ఒక ఎత్తయితే.. అదే సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడటం మరో ఎత్తు. ఇటీవల విడుదలైన రావు బహుదూర్ విషయంలో ఇదే పరిస్థితి కనిపించింది. నటుడు సత్యదేవ్ మరోసారి తన యాక్టింగ్ తో ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించినా.. ఆ ప్రశంసలు థియేటర్ల వద్ద భారీ వసూళ్లుగా మాత్రం మారలేకపోయాయి. మంచి కథ, భిన్నమైన నేపథ్యం, ప్రశంసలు అందుకున్న నటన ఉన్నప్పటికీ.. బాక్సాఫీస్ ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సత్యదేవ్, దర్శకుడు వెంకటేష్ మహా కాంబినేషన్‌ పై మొదటి నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో.. రావు బహుదూర్ పై కూడా సినీ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఆ సినిమాను జూలై 3న విడుదల చేయగా.. మొదటి రోజు నుంచే మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సత్యదేవ్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. క్లైమాక్స్, ఎమోషన్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు.

అయితే స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగడం, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కమర్షియల్ అంశాలు తక్కువగా ఉండటం సినిమాపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. మొదటి వీకెండ్‌లో ఓపెనింగ్స్ ఆశాజనకంగా ఉన్నా.. ఆ తర్వాత వీక్‌డేస్‌లో కలెక్షన్లు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో సినిమా బాక్సాఫీస్ ప్రయాణం ఆశించినంతగా సాగలేదు.

ట్రేడ్ పండితుల అంచనాల ప్రకారం, విడుదలైన 11 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.13.60 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి మంచి వసూళ్లు వచ్చినప్పటికీ.. మొత్తం షేర్ మాత్రం సుమారు రూ.6.30 కోట్ల వద్దే ఆగిపోయింది. థియేట్రికల్ బిజినెస్‌ ను దృష్టిలో పెట్టుకుంటే బ్రేక్ ఈవె న్‌కు ఇంకా రూ.2 కోట్లకు పైగా షేర్ అవసరమని, కానీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను చూస్తే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేనని భావిస్తున్నారు.

అయితే థియేటర్లలో రిజల్ట్ నిరాశపరిచినా.. సినిమాకు విడుదలకు ముందే ఇతర హక్కుల రూపంలో మంచి వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సమర్పించిన ఆ చిత్రానికి ఓటీటీ, ఓవర్సీస్ హక్కుల ద్వారా పెట్టుబడిలో పెద్ద భాగం తిరిగి వచ్చినట్లు సమాచారం. దీంతో నిర్మాతలకు థియేట్రికల్ ఫలితం మాత్రమే ప్రధాన నిరాశగా మిగిలిందని వినికిడి.

ఇదిలా ఉండగా, అదే సమయంలో వచ్చిన కొత్త సినిమాల ప్రభావం కూడా రావు బహుదూర్ పై పడింది. దీంతో మొదటి వారానికే సినిమా వేగం తగ్గిపోయింది. 1968 నుంచి 1991 మధ్యకాలంలో సాగే కథతో రూపొందిన రావు బహుదూర్ లో సత్యదేవ్ తన నటనతో మరోసారి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకుడు వెంకటేష్ మహా తనదైన శైలిలో కథను చెప్పారు. విమర్శకుల ప్రశంసలు, సినీ ప్రముఖుల అభినందనలు అందుకున్నా.. ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ఆదరణ రాకపోవడంతో ఆ సినిమా కంటెంట్‌ కు ప్రశంసలు.. కానీ బాక్సాఫీస్ వద్ద లిమిటెడ్ రిజల్ట్ అనే కోవలో చేరిపోయిందని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.