Begin typing your search above and press return to search.

'ధురంధర్' రణవీర్ వానిటీ వ్యాన్లు.. ఇప్పుడిదే హాట్ టాపిక్

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన తాజా చిత్రం ధురంధర్.. ఓటీటీలో కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది.

By:  M Prashanth   |   3 Feb 2026 9:46 PM IST
ధురంధర్ రణవీర్ వానిటీ వ్యాన్లు.. ఇప్పుడిదే హాట్ టాపిక్
X

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన తాజా చిత్రం ధురంధర్.. ఓటీటీలో కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. ముఖ్యంగా రణవీర్ తన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్‌ తో మరోసారి ఆకట్టుకున్నారు. సినిమా కథ, యాక్షన్ సీన్లు, ఆయన యాక్టింగ్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్న వేళ… ఊహించని విధంగా ఓ కొత్త విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారింది. అది సినిమాకు సంబంధించిన ఎండ్ క్రెడిట్స్‌ లో కనిపించిన వానిటీ వ్యాన్లు డీటైల్స్.





సాధారణంగా సినిమా ముగిసిన తర్వాత వచ్చే క్రెడిట్స్‌ ను చాలా మంది పట్టించుకోరు. కానీ ఈసారి మాత్రం కొందరు ప్రేక్షకులు జాగ్రత్తగా గమనించిన వ్యానిటీ వ్యాన్లు అంశం చర్చకు దారి తీసింది. సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత.. ఆ విషయం వెలుగులోకి వచ్చింది. రణవీర్ సింగ్ పేరు కింద ఆయనకు షూటింగ్ సమయంలో అందించిన సదుపాయాల వివరాలు ఉండటంతో అవి వైరల్ అయ్యాయి. ముఖ్యంగా వానిటీ వ్యాన్ల సంఖ్య అందరి దృష్టిని ఆకర్షించింది.

ఎండ్ క్రెడిట్స్ ప్రకారం.. సినిమాలో హమ్జా పాత్ర పోషించిన రణవీర్ సింగ్‌ కు మొత్తం మూడు వానిటీ వ్యాన్లు కేటాయించినట్లు సమాచారం. ఒకటి ఆయనకు సాధారణంగా ఉపయోగించే వానిటీ వ్యాన్ కాగా, రెండోది ఆయన స్టాఫ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారట. మూడోది అదనంగా ప్రత్యేక సదుపాయంగా ఇచ్చిన వానిటీ వ్యాన్ అని పేర్కొన్నారు. ఆ వివరాలు బయటకు రావడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మొదట ఆ విషయం రెడిట్‌ లో చర్చకు వచ్చింది. అక్కడ కొందరు యూజర్లు స్క్రీన్‌ షాట్లు షేర్ చేస్తూ.. ఒక నటుడికి మూడు వానిటీ వ్యాన్లు అవసరమా? అంటూ ప్రశ్నించారు. అక్కడి నుంచి ఎక్స్, ఇన్‌ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌ లకు ఆ చర్చ విస్తరించింది. కొందరు రణవీర్‌ ను సమర్థిస్తుంటే, మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. పెద్ద హీరోలకు కొన్ని అదనపు సదుపాయాలు ఉండటం సహజమేనని కొందరు అంటున్నారు.

భారీ షెడ్యూల్స్, మేకప్ టీమ్, సిబ్బంది అవసరాలు దృష్టిలో పెట్టుకుంటే వేర్వేరు వ్యాన్లు అవసరం కావచ్చని చెబుతున్నారు. అయితే మరోవైపు కొందరు మాత్రం ఇది అనవసర ఖర్చు అని వాదిస్తున్నారు. ఒక వానిటీ వ్యాన్ సరిపోతే, మూడు ఇవ్వడం వల్ల ప్రొడక్షన్ ఖర్చులు పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి డిమాండ్లు కామన్ అయితే నిర్మాతలపై ఆర్థిక భారం పడే అవకాశం ఉందని అంటున్నారు.

ఇప్పటికే భారీ బడ్జెట్‌ లతో సినిమాలు తెరకెక్కుతున్న నేపథ్యంలో ఇలాంటి అదనపు ఖర్చులు పెరిగితే లాభాలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న, మీడియం రేంజ్ నిర్మాతలకు ఇది కష్టంగా మారొచ్చని అంటున్నారు. ఇప్పటివరకు ఆ విషయంపై రణవీర్ గానీ, సినిమా యూనిట్ గానీ రెస్పాండ్ అవ్వలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరేం జరుగుతుందో వేచి చూడాలి.