Begin typing your search above and press return to search.

కోట్లలో డ‌బ్బు ఇవ్వాల‌ని స్టార్ హీరోకి గ్యాంగ్‌స్ట‌ర్ బెదిరింపులు

జనవరి 31 అర్ధరాత్రి సమయంలో రోహిత్ శెట్టి ఇంటిపై దుండగులు ఐదు రౌండ్ల కాల్పులు జరిపి ప‌రారైన సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   10 Feb 2026 10:32 PM IST
కోట్లలో డ‌బ్బు ఇవ్వాల‌ని స్టార్ హీరోకి గ్యాంగ్‌స్ట‌ర్ బెదిరింపులు
X

బాలీవుడ్ స్టార్ల‌కు బెదిరింపులు అదిలింపులు ఎక్కువ‌య్యాయి. ముఖ్యంగా గ్యాంగ్ స్ట‌ర్ల నుంచి బెదిరింపులు బెంబేలెత్తిస్తున్నాయి. అంత‌ర్జాతీయ గ్యాంగ్ స్ట‌ర్ దావూద్ ఇబ్ర‌హీం ప్ర‌భావం అంత‌గా లేదు.. ముంబై ప్ర‌శాంతంగా ఉంది! అనుకుంటున్న త‌రుణంలో పంజాబీ గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్, అత‌డి అనుచ‌రులు ద‌డ పుట్టిస్తున్నారు. బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్ప‌టికే స‌ల్మాన్ ఖాన్, రోహిత్ శెట్టి లాంటి ప్ర‌ముఖుల‌కు చంపేస్తామంటూ సీరియ‌స్ వార్నింగులు ఇచ్చింది. స‌ల్మాన్ స్నేహితుడు ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీని దారుణంగా తుపాకీతో కాల్చి చంపి శాంపిల్ చూపించిన విధానం సినిమాని మించిపోయింది.

ఇటీవ‌ల స‌ల్మాన్ ఖాన్ స్నేహితుడిగా భావించే స్టార్ డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టికి కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సీరియ‌స్ గా వార్నింగ్ ఇవ్వ‌డం క‌ల‌క‌లం రేపింది. అన‌వ‌స‌రంగా మా విష‌యాల‌కు అడ్డు త‌గులుతున్నాడు! అంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. అత‌డి ఇంటిపైకి తుపాకీతో కాల్పులు జ‌రిపించారు.. అచ్చం స‌ల్మాన్ ఇంటి బాల్క‌నీపైకి కాల్పులు జ‌రిపిన‌ట్టే.. ఇక్క‌డా సీన్ భ‌య‌పెట్టింది.

ఇదిలా ఉంటే, ఇప్పుడు దురంధ‌ర్ న‌టుడు ర‌ణ్ వీర్ సింగ్ కి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బెదిరింపులు ఎదుర‌వ్వ‌డం మ‌రోసారి క‌ల‌క‌లం రేపింది. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..10 ఫిబ్రవరి 2026 న రణవీర్ సింగ్‌కు ప్రాణహాని త‌ల‌పెడ‌తామ‌ని బెదిరింపులు వచ్చాయి. రణవీర్ సింగ్ కు ఒక వాట్సాప్ వాయిస్ నోట్ వచ్చింది. అందులో గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను కోట్లలో డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అంతేకాదు.. బెదిరించిన వ్య‌క్తి తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవాడినని చెప్పుకున్నాడు. ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న వెంటనే ముంబై పోలీసులు రణవీర్ సింగ్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం పోలీసులు ఆ వాయిస్ నోట్ ఎక్కడి నుండి వచ్చిందో కనిపెట్టే పనిలో ఉన్నారు. డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టిని బెదిరించిన కొద్దిరోజుల‌కే ఈ బెదిరింపులు రావ‌డంతో గ్యాంగ్ స్ట‌ర్ యాక్టివిటీస్ పై చాలా సందేహాలు నెల‌కొన్నాయి. ఇందులో నిజంగా బిష్ణోయ్ గ్యాంగ్ ప్ర‌మేయం ఉందా? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.

రోహిత్ శెట్టి కేసులో ఏం జ‌రిగింది?

జనవరి 31 అర్ధరాత్రి సమయంలో రోహిత్ శెట్టి ఇంటిపై దుండగులు ఐదు రౌండ్ల కాల్పులు జరిపి ప‌రారైన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇప్ప‌టికే పురోగ‌తి సాధించారు. ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధాన నిందితుడు ఆశారాం ఫసలేకు బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ర‌ణ్ వీర్ కి ఎందుకు ఈ బెదిరింపులు?

రణవీర్ సింగ్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత విజయవంతమైన దశలో ఉన్నారు. అత‌డు ఇప్పుడు పాన్ ఇండియ‌న్ స్టార్. 100-150 కోట్ల మేర పారితోషికం అందుకుంటున్నాడు. `ధురంధర్` సినిమా ప్రపంచవ్యాప్తంగా 1,300 కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీంతో అత‌డు త‌న పారితోషికాన్ని పెంచేసాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు దురంధ‌ర్ సీక్వెల్ మార్చి 19న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటం, రణవీర్ ఆర్థికంగా మంచి స్థితిలో ఉండటమే ఇలాంటి వసూళ్ల బెదిరింపులకు కారణమని కొందరు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ముంబై పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.