దురంధర్ వర్సెస్ బోయపాటి.. ఇది నిజమేనా?
తాజా సమాచారం మేరకు అతడు సౌత్ దర్శకులను ఆరాధిస్తున్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించనున్న `వేల్పరి`లో రణ్ వీర్ నటిస్తాడని, ఇప్పటికే కథా చర్చలు సాగుతున్నాయని కథనాలొస్తున్నాయి.
By: Sivaji Kontham | 1 Feb 2026 12:25 PM ISTరణ్ వీర్ సింగ్ స్టాటస్ ఇటీవల అమాంతం మారిపోయింది. అతడి స్టార్ స్టాటస్ ని `దురంధర్ కి ముందు దురంధర్ కి తర్వాత!`` అంటూ డివైడ్ చేయాల్సి వస్తోంది. ప్రభాస్ కి `బాహుబలి ముందు బాహుబలి తర్వాత` పరిణామాలు ఎలా మారాయో ఇప్పుడు రణ్ వీర్ సింగ్ కి కూడా దురంధర్ తర్వాత పరిణామాలు అలానే మారాయి. అందుకే ఇటీవలి కాలంలో రణ్ వీర్ పాన్ ఇండియన్ గోల్‌తో ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న పోటీబరిలో బాలీవుడ్ మోనోపలీ స్టోరీలు, రొటీన్ క్యాలిక్యులేటెడ్ దర్శకులను ఎంపిక చేసుకోవడం లేదు. ముఖ్యంగా ఇనిస్టిట్యూట్‌లలో చదువుకున్న దర్శకుల కంటే, ఇండస్ట్రీలో నలిగిపోయిన దర్శకులకే ప్రాధాన్యతనిస్తున్నాడు.
తాజా సమాచారం మేరకు అతడు సౌత్ దర్శకులను ఆరాధిస్తున్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించనున్న `వేల్పరి`లో రణ్ వీర్ నటిస్తాడని, ఇప్పటికే కథా చర్చలు సాగుతున్నాయని కథనాలొస్తున్నాయి. ఈ సినిమా తన కెరీర్ ని తిరిగి రీబూట్ చేస్తుందని శంకర్ ఆశిస్తున్నాడు. మరోవైపు టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తన స్క్రిప్టును రణ్ వీర్ కి వినిపించేందుకు ఆసక్తిగా ఉన్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. రణ్ వీర్ సింగ్ కూడా టాలీవుడ్ లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నందున ఈ కాంబో వర్కవుట్ అయ్యేందుకు ఛాన్సుందని అంచనా వేస్తున్నారు.
పరిణామాలు చూస్తుంటే అంతగా సక్సెస్ లేని బాలీవుడ్ టైపికల్ స్టోరీల కంటే కొంచెం మసాలా యాక్షన్ సినిమాలు చేసేందుకు రణ్ వీర్ ఆసక్తిగా ఉన్నాడని, ఈ తరహా జానర్ కి పాన్ ఇండియాలో రీచ్ ఉంటుందని భావిస్తున్నాడని కూడా విశ్లేషిస్తున్నారు. శంకర్, బోయపాటి లాంటి దర్శకులు ఏజ్డ్ హీరోల నుంచి కూడా అద్బుతమైన ఎనర్జీని రాబడుతున్నారు. అందుకే ఇప్పుడు ఎనర్జిటిక్ రణ్ వీర్ సింగ్ చూపులు మాస్ డైరెక్టర్లపై ఉన్నాయని తెలుస్తోంది.
మరోవైపు రణ్ వీర్ సింగ్ తన తదుపరి చిత్రాలను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు. `దురంధర్` గ్రాండ్ సక్సెస్ తర్వాత `దురంధర్ 2` సినిమాని వేగంగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే మార్చిలో రిలీజ్ డేట్ ని లాక్ చేసిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం అతడు హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ సాధిస్తే, దీనికి కొనసాగింపుగా పార్ట్ 3ని కూడా ప్రకటించే వీలుంటుందని అంచనా.
`దురంధర్` ఫ్రాంఛైజీ కంటే భిన్నంగా అతడు జోంబీ మూవీ కథాంశాన్ని కూడా ఎంచుకున్నాడు. దీనికి ప్రళయ్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసారు. లవ్ రాంజాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండూ కాకుండా తదుపరి ఎంచుకునే సినిమా కథలు అందుకు భిన్నంగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఇందులో భాగంగానే శంకర్, బోయపాటి వంటి ప్రముఖ దక్షిణాది దర్శకులతో పని చేసేందుకు ఆస్కారం ఉందని టాక్ వినిపిస్తోంది. ప్రతి సినిమా దేనికదే విభిన్నంగా ఉండాలని రణ్ వీర్ భావిస్తున్నాడు. అందుకే ఆచితూచి అతడు ఎంపికలు చేసుకుంటున్నాడని తెలిసింది. ఇక ఫర్హాన్ అక్తర్ డాన్3 లో నటించాల్సి ఉన్నా కానీ, చివరి నిమిషంలో రణ్ వీర్ ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. వరుసగా గ్యాంగ్ స్టర్ సినిమాలు లేదా స్పై తరహా సినిమాలు చేస్తున్నందున డాన్ కథతో రూపొందే సినిమాను కాదనుకున్నాడని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
