జాంబీ లీకులు దేనికోసం? అన్ని ట్రయల్స్ ఫెయిల్! రణ్‌వీర్ దీనిని బ్రేక్ చేస్తాడా?
జాంబీ కథలతో సినిమాలు చేయడం రిస్కుతో కూడుకున్నది అని నిరూపిస్తూ సౌతిండియాలో తెరకెక్కిన రెండు సినిమాల ఫలితాలు చూస్తే సరిపోతుంది.
By: Sivaji Kontham | 9 Sept 2026 9:33 AM ISTజాంబీ కథలతో సినిమాలు చేయడం రిస్కుతో కూడుకున్నది అని నిరూపిస్తూ సౌతిండియాలో తెరకెక్కిన రెండు సినిమాల ఫలితాలు చూస్తే సరిపోతుంది. మొదట తమిళ హీరో జయం రవి జాంబీ మూవీలో నటించగా ఫ్లాపైంది. తర్వాత తేజ సజ్జాతో ప్రశాంత్ వర్మ చేసిన ప్రయోగం ఫర్వాలేదనిపించినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన మైలేజ్ అందుకోలేకపోయింది.. పూర్తి స్టోరీలోకి వెళితే..
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో జాంబీ కథాంశంతో సినిమాలు తీయడం ఎల్లప్పుడూ పెద్ద రిస్కుతో కూడుకున్న ప్రయోగంగానే మిగిలిపోయింది. హారర్-కామెడీ జోనర్లకు లభించినంత ఆదరణ పక్కా జాంబీ సర్వైవల్ చిత్రాలకు ఇక్కడ దక్కకపోవడమే అందుకు ప్రధాన కారణం. దక్షిణాదిలో తమిళ హీరో జయం రవితో తెరకెక్కిన మొదటి జాంబీ చిత్రం `మిరుతన్` బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ఆ తర్వాత తెలుగులో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన `జాంబీ రెడ్డి` రాయలసీమ ఫ్యాక్షనిజం మేళవింపుతో కమర్షియల్ విజయం సాధించినా.. బాక్సాఫీస్ వద్ద భారీ మైలేజ్ తెచ్చిపెట్టే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ రేంజ్‌కు మాత్రం చేరుకోలేకపోయింది.
భారతీయ సినీ చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే.. జాంబీ జోనర్లలో వచ్చిన సినిమాలు ఎక్కువగా కల్ట్ లేదా లిమిటెడ్ ఆడియన్స్ సినిమాల్లాగే మిగిలిపోయాయి. బాలీవుడ్‌లో వచ్చిన తొలి జాంబీ కామెడీ `గో గోవా గాన్` (2013) విమర్శకుల ప్రశంసలు పొంది కల్ట్ క్లాసిక్‌గా నిలిచినా.. కమర్షియల్‌గా సగటు వసూళ్లకే పరిమితమైంది. మరాఠీలో వచ్చిన `జాంబివ్లీ` పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కేవలం పరిమిత మార్కెట్‌కే పరిమితం కాగా.. నెట్‌ఫ్లిక్స్ అందించిన `బెతాళ్` వంటి ప్రాజెక్ట్‌లు థియేటర్లను వదిలి నేరుగా డిజిటల్ వేదికలనే ఆశ్రయించాల్సి వచ్చింది. సాధారణ భారతీయ ప్రేక్షకులు దెయ్యాలు, పిశాచాలు లేదా ఆధ్యాత్మిక శక్తుల కథలకే ఎక్కువ కనెక్ట్ అవ్వడం.. జాంబీ కాన్సెప్ట్‌లు వారికి ఇంకా కాస్త కొత్తగా అనిపించడమే ఈ జోనర్ వెనుకబడటానికి ప్రధాన కారణం.
దీనికి తోడు భారీ విజువల్ ఎఫెక్ట్స్ - సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్స్‌కు అవసరమైన భారీ బడ్జెట్లను ఒక ప్రయోగంపై కేటాయించడానికి మన నిర్మాతలు వెనుకాడటం కూడా ఈ జోనర్ ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారింది. అయితే ఈ వరుస విఫల యత్నాలు.. పరిమిత విజయాల రికార్డును తిరగరాస్తూ... జాంబీ కథలతో కూడా బిగ్గెస్ట్ థియేట్రికల్ బ్లాక్‌బస్టర్ కొట్టవచ్చని నిరూపించేందుకు బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ ఇప్పుడు సిద్ధమయ్యారు. జై మెహతా దర్శకత్వంలో ఆయన నటిస్తున్న`ప్రళయ్` చిత్రం ఇండియన్ సినీ హిస్టరీలోనే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ .. భారీ స్కేల్ జోంబీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోంది.
ఇటీవలే ముంబై సెట్స్ నుండి లీక్ అయిన రణ్‌వీర్ సింగ్, కళ్యాణి ప్రియదర్శన్ లీక్డ్ పిక్చర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వినాశకరమైన వాతావరణంలో గడ్డం పెంచి రఫ్ అండ్ సర్వైవల్ లుక్‌లో కనిపిస్తున్న రణ్‌వీర్ అవతారం.. అతడి వెనుక చిన్నారిని మోసుకెళ్తున్న విజువల్స్ ఈ సినిమా స్థాయి ఏంటో ముందే సూచిస్తున్నాయి. `ధురంధర్` ఫ్రాంచైజీతో బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించిన రణ్‌వీర్ స్టార్‌డమ్, మేకింగ్‌లో జై మెహతా టాలెంట్ తోడవ్వడంతో `ప్రళయ్` ప్రాజెక్ట్ భారతీయ చలనచిత్ర రంగాన సరికొత్త జాంబీ ట్రెండ్‌కు శ్రీకారం చుడుతుందని అంచనాలు వేస్తున్నారు.
ఇప్పటివరకు జాంబీ సినిమాలపై ఉన్న ప్రయోగాల ముద్రను చెరిపేసి.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ జోనర్‌ను మెయిన్‌స్ట్రీమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టే సత్తా రణ్‌వీర్‌కు ఉందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ వర్మ `జాంబీ రెడ్డి`తో వేసిన పునాదిని.. గో గోవా గాన్ తో కల్ట్ స్టాటస్ అందుకున్న రాజ్ అండ్ డీకే విజన్ తర్వాత.. రణ్‌వీర్ `ప్రళయ్`తో జాంబీ కథలను ఏ స్థాయిలో నిలబెడతాడో.. ఇండియన్ ఆడియన్స్ ఈ గ్లోబల్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌కు ఎలా బ్రహ్మరథం పడతారో వేచి చూడాలి. అయితే ఇప్పటివరకూ లీకైన విజువల్స్ చూస్తుంటే.. మునుపటి జాంబీ సినిమాలతో పోలిక కనిపిస్తోంది. అలా కాకుండా ఇందులో ఏం కొత్తదనం ఉందో.. ఎమోషన్ ఏ విధంగా వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.
