'దురంధర్' కంటే ముందే అలాంటి ఛాన్స్ మిస్
ఆ సమయంలో రణ్ వీర్ వద్దకే తొలిగా స్క్రిప్టు తీసుకెళ్లి వినిపించాడు సందీప్. కానీ కథానాయకుడి పాత్రలో నెగెటివ్ షేడ్, డార్క్ కోణం తనకు నచ్చలేదని అన్నాడు.
By: Sivaji Kontham | 4 Jan 2026 5:00 AM ISTకొందరికి దురదృష్టం నీడలా వెంటాడుతుంది. అదృష్టం గుమ్మం దాకా వచ్చినా ఒడిసిపట్టుకోలేరు. పెరట్లోంచే దానిని తరిమేస్తారు. అలా తన వెంటపడబోయిన అదృష్టాన్ని రణ్ వీర్ సింగ్ తన్ని తరిమేసాడు. ఈ విషయాన్ని అతడు అంగీకరించినా, అంగీకరించకపోయినా కానీ `దురంధర్` కంటే చాలా ముందే రణ్ వీర్ సింగ్ అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాల్సింది. ఇటీవలి కాలంలో డజను ఫ్లాపులతో పూర్తిగా డీలా పడిపోయిన రణ్ వీర్ ని చివరిగా ఆదిత్యాధర్ `దురంధర్` ఆదుకుంది కానీ, ఒకవేళ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయి ఉంటే అతడి పరిస్థితి ఎలా ఉండేదో ఊహించలేము.
దురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అతడి దాహార్తిని తీర్చింది. అయితే రణ్ వీర్ కంటే ఆదిత్యాధర్ కే ఎక్కువ పేరొచ్చింది. అతడిని ప్రతి ఒక్కరూ పొగిడేస్తున్నారు. ఆర్జీవీ లాంటి గొప్ప దర్శకుడు ఆదిత్యాధర్ గురించి చెప్పినంతగా రణ్ వీర్ గురించి చెప్పలేదు. అయితే దురంధర్ కంటే చాలా ముందే రణ్ వీర్ ఓ సినిమాకి అంగీకరించి ఉంటే, అతడి దశ దిశ తిరిగిపోయి ఉండేదే. అదే అర్జున్ రెడ్డి రీమేక్.
నిజానికి తెలుగులో అర్జున్ రెడ్డి బంపర్ హిట్టు కొట్టాక, దానిని బాలీవుడ్ లో రీమేక్ చేయాల్సిందిగా సందీప్ వంగాకు చాలా ఆఫర్లు వచ్చాయి. ఆ సమయంలో రణ్ వీర్ వద్దకే తొలిగా స్క్రిప్టు తీసుకెళ్లి వినిపించాడు సందీప్. కానీ కథానాయకుడి పాత్రలో నెగెటివ్ షేడ్, డార్క్ కోణం తనకు నచ్చలేదని అన్నాడు. అలా ఆ ప్రాజెక్ట్ షాహిద్ కపూర్ వద్దకు వెళ్లింది. షాహిద్ ని పూర్తిగా నమ్మి ఈ సినిమాలో నటించాల్సిందిగా కోరాడు సందీప్ వంగా. అప్పటికి అతడు పెద్ద స్టార్ కాదు. కెరీర్ లో 100కోట్ల క్లబ్ లేనే లేదు. 65 కోట్ల రేంజులోనే ఉన్నాడు. ఈ కుర్రాడితో సినిమా ఏంటి? అని సందీప్ వంగాను అదోలా చూసారుట. రణ్ వీర్ సింగ్ అయితే బావుంటుందని కూడా కొందరు సూచించారు. కానీ చివరికి సందీప్ వంగా మాత్రం షాహిద్ నే నమ్మాడు.
అతడి నమ్మకం నిజమైంది. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ పేరుతో విడుదలై బంపర్ హిట్ కొట్టింది. షాహిద్ కెరీర్ లో తొలి 100 కోట్ల క్లబ్ సినిమా సాధ్యమైంది. ఈ చిత్రం ఏకంగా 275 కోట్లు వసూలు చేయడం ఒక సంచలనం. నిజానికి రణ్ వీర్ కి దురంధర్ వచ్చే వరకూ ఆ స్థాయి హిట్టు అన్నదే లేదు. చివరికి షాహిద్ సోలో హీరోగా అతిపెద్ద హిట్టు కొట్టాడు. ఆ తర్వాత అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
