Begin typing your search above and press return to search.

లలిత్ మోదీ బయోపిక్!

తన జీవితంలో ఎప్పుడైనా ఒక అద్భుతమైన పాత్ర చేయాలనుకుంటే? అది ఐపీఎల్ కమిషనర్‌గా లలిత్ మోదీ పాత్రేనని రణ్‌వీర్ తనతో అన్నట్లు మోదీ పేర్కొన్నారు.

By:  Srikanth Kontham   |   5 Jun 2026 3:00 PM IST
లలిత్ మోదీ బయోపిక్!
X

పరిశ్రమలో బయోపిక్‌ల హవా నిరంతరం కొనసాగుతూనే ఉంది. క్రీడలు, రాజకీయం ..వివాదాస్పద నేపథ్యం ఉన్న వ్యక్తుల జీవిత కథలను వెండితెరపై ఆవిష్కరించేందుకు దర్శకులు, నటీనటులు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటారు. ఈ నేప‌థ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ జీవితం ఆధారంగా భారీ బయోపిక్ రూపకల్పన జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు శరవేగంగా సాగుతుండటం అంతర్జాతీయ మీడియాలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి లలిత్ మోదీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలను పంచుకున్నారు. బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ తన పాత్రను పోషించడానికి ఆసక్తి కనబరిచారని వెల్లడించారు. రెండేళ్ల క్రితం రణ్‌వీర్ సింగ్ స్వయంగా లండన్ వచ్చి తనను కలిశారని మోదీ గుర్తు చేసుకున్నారు.

తన జీవితంలో ఎప్పుడైనా ఒక అద్భుతమైన పాత్ర చేయాలనుకుంటే? అది ఐపీఎల్ కమిషనర్‌గా లలిత్ మోదీ పాత్రేనని రణ్‌వీర్ తనతో అన్నట్లు మోదీ పేర్కొన్నారు. అయితే ఈ భేటీ వెనుక ఓ ఆసక్తికర కుటుంబ నేపథ్యం కూడా ఉంది. ఆ సమయానికి లలిత్ మోదీకి రణ్‌వీర్ సింగ్‌తో వ్యక్తిగత పరిచయం లేదు. కానీ రణ్‌వీర్ భార్య, స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణే మోదీకి ఎంతో కాలంగా బాగా తెలుసు. ఒకరోజు అనుకోకుండా రణ్‌వీర్ నుండి ఫోన్ రావడం, ఆయన లండన్ వచ్చి మోదీతో గంటల తరబడి చర్చలు జరపడం ఇండస్ట్రీ వర్గాల్లో అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. తన ప్రయాణాన్ని వెండితెరపై ప్రతిబింబించేందుకు రణ్‌వీర్ చూపిన ఉత్సాహం మోదీని ఎంతగానో ఆకట్టుకుంది.

ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ క్రేజ్ ఆకాశాన్ని తాకుతోంది. ఇటీవల విడుదలైన `ధురంధర్` వంటి భారీ చిత్రాలతో బాక్సా ఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించారు. లలిత్ మోదీ సైతం రణ్‌వీర్ నటనను, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌ను విపరీతంగా ప్రశంసించారు. అయితే రణ్‌వీర్ ఇప్పుడు అత్యున్నత స్థాయి స్టార్‌గా ఎదిగినందున బయోపిక్ కోసం ఆయనకు సమయం దొరుకుతుందా లేదా అనే సందేహాన్ని కూడా మోదీ వ్యక్తం చేశారు. స్క్రిప్ట్ పూర్తయ్యాక నటీనటుల ఎంపికపై స్పష్టత వస్తుందని తెలిపారు. క్రికెట్ సామ్రాజ్యం స్థాపించడమే కాకుండా లలిత్ మోదీ జీవితంలో ఎన్నో అనూహ్యమైన మలుపులు, సంచలనాలున్నాయి.

అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం నుండి ఎదురైన బెదిరింపులు, రాత్రికి రాత్రే భారత్‌ను వీడాల్సి రావడం వంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఆయన జీవితంలో భాగమే. సినిమా స్క్రిప్ట్‌లో వాస్తవ సంఘటనలను కూడా చేర్చుతున్నట్లు తెలుస్తోంది. అందువల్ల బయోపిక్ కేవలం క్రీడా నిర్వాహకుడి కథలా కాకుండా ఒక హై-స్టేక్స్ పొలిటికల్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందే అవకాశం ఉంది.