దైవాన్ని కించపరుస్తూ కామెంట్.. క్షమాపణలు చెప్పిన హీరో!
సెలబ్రిటీలు అప్పుడప్పుడు చేసే కామెంట్లు సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకతను కలిగిస్తూ ఉంటాయి.
By: Madhu Reddy | 2 Dec 2025 1:16 PM ISTసెలబ్రిటీలు అప్పుడప్పుడు చేసే కామెంట్లు సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకతను కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇతరులను కించపరిచేలా చేసే కామెంట్లు అసహనానికి గురైయ్యేలా చేస్తూ ఉంటాయనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా మతాలను, సాంప్రదాయాలను, విశ్వాసాలను హేళన చేస్తూ చేసే కామెంట్ల కారణంగా హిందూ సంఘాలు కూడా మండిపడుతుంటాయి. ఈ క్రమంలోనే ఒక హీరో చేసిన కామెంట్లు హిందూ సంఘాలు మండిపాటుకు గురవడమే కాకుండా ఆయనపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. మరి ఆయన ఎవరు? ఏం చేశారు? అసలు ఏం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం
ఆయన ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్. తాజాగా ఈయనపై హిందూ జన జాగృతి సమితి కంప్లైంట్ చేసింది. ముఖ్యంగా ఆయన చేసిన కామెంట్లు హిందువుల మనోభావాలు దెబ్బతీశాయని తమ ఫిర్యాదులో పేర్కొంది. మరి రణ్ వీర్ సింగ్ ఏం చేశారు అనే విషయానికి వస్తే.. ఈమధ్య గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలలో రణ్ వీర్ సింగ్ పాల్గొని సందడి చేశారు. అయితే అక్కడ ఆయన కాంతార గురించి మాట్లాడారు. రిషబ్ శెట్టి అద్భుతంగా నటించారు అని చెప్పిన రణ్ వీర్ సింగ్.. హీరో పాత్రలోకి దెయ్యం ప్రవేశించినప్పుడు వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయని వ్యాఖ్యానించడమే కాకుండా కాంతార సినిమాలో భారీ పాపులర్ అయిన డైలాగు "ఓ.." అనే శబ్దాన్ని స్టేజ్ పై ఇమిటేట్ చేసి చూపించారు. ఇక్కడ కామెడీగా చూపించడంతో కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో రణ్ వీర్ వెంటనే క్షమాపణలు చెప్పాలి అంటూ పోస్ట్లు పెడుతూ ఉండడం గమనార్హం.. ఏది ఏమైనా అత్యంత పవిత్రంగా భావించే పంజుర్లీ దైవాన్ని రణ్ వీర్ సింగ్ అవమానపరిచారు అని.. దేవుడు పూనితే దెయ్యం పూనిందని హేళన చేస్తూ కామెంట్లు చేసారు అంటూ కన్నడిగులు మండపడుతున్నారు.
దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన రణవీర్ సింగ్ కన్నడిగులకు క్షమాపణలు చెబుతూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకు వచ్చారు. "ఈ సినిమాలో రిషబ్ చాలా అద్భుతమైన నటనను కనబరిచారు. ఆయన నటనను హైలెట్ చేయడమే నా ఉద్దేశం. నటుడికి నటుడుకి.. ఆ ప్రత్యేక సన్నివేశాన్ని, అతను చేసిన విధంగా ప్రదర్శించడానికి ఎంత టాలెంట్ అవసరమో నాకు తెలుసు. రిషబ్ శెట్టి అంటే నాకు చాలా అభిమానం. మన దేశంలోని ప్రతి సంస్కృతి, సాంప్రదాయం అలాగే నమ్మకాన్ని నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. నేను ఎవరి మనోభావాలను కించపరచలేదు. ఒకవేళ ఎవరి మనోభావాలనైనా గాయపరిచి ఉంటే.. నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను" అంటూ రణవీర్ సింగ్ క్షమాపణలు కోరారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాంతార సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ కన్నడ హీరో కం డైరెక్టర్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇది. చిన్న సినిమాగా ప్రాంతీయంగా విడుదలై.. ఆ తర్వాత పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా కన్నడ సినీ పరిశ్రమకు ఊహించని పాపులారిటీని అందించింది ఈ సినిమా. కర్ణాటకలోని ఒక మారుమూల ప్రాంతంలో అత్యంత పవిత్రంగా భావించే పంజూర్లి దైవాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం రిషబ్ శెట్టికి ఊహించని క్రేజ్ ను అందించింది. అంతేకాదు ఈ సినిమాకి ప్రీక్వెల్ గా వచ్చిన కాంతార 2 చిత్రం కూడా సరికొత్త సంచలనాలు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
