Begin typing your search above and press return to search.

పారితోషికంలో ఇండియ‌న్ టాప్ హీరో అత‌డే!

స్టార్ హీరోల‌ పారితోషికాలు నిరంత‌రం హాట్ టాపిక్ గానే మారుతుంటాయి. సినిమా బడ్జెట్లతో సమానంగా ఉండే రెమ్యునరేషన్లు ఇప్పుడు ఏకంగా వందల కోట్ల మైలురాళ్లను దాటేస్తున్నాయి.

By:  Srikanth Kontham   |   22 Jun 2026 9:41 AM IST
పారితోషికంలో ఇండియ‌న్ టాప్ హీరో అత‌డే!
X

స్టార్ హీరోల‌ పారితోషికాలు నిరంత‌రం హాట్ టాపిక్ గానే మారుతుంటాయి. సినిమా బడ్జెట్లతో సమానంగా ఉండే రెమ్యునరేషన్లు ఇప్పుడు ఏకంగా వందల కోట్ల మైలురాళ్లను దాటేస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఒకే ఒక్క ప్రాజెక్ట్ ద్వారా ఏకంగా 325 కోట్ల భారీ మొత్తాన్ని సొంతం చేసుకుని భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా అవతరించారు. దీంతో ర‌ణ‌వీర్ సింగ్ సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ఇండస్ట్రీలోని అగ్ర స్టార్లందరి రికార్డులను బ్రేక్ చేసిన‌ట్లు అయింది.

రణవీర్ సింగ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం `ధురంధర్` సాధించిన సంచలన విజయమే ఈ రికార్డు స్థాయి పారితోషికానికి ప్ర‌ధాన‌ కారణం. రెండు భాగాలుగా విడుదలైన ఈ ఫ్రాంచైజీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 3200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. భారతదేశంలోనే 1900 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టి ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది. ఈ సినిమా సాధించిన అసాధారణ విజయమే రణవీర్‌కు ఇంతటి భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

అయితే రణవీర్ సింగ్ ఈ చిత్రానికి ఎలాంటి ముందస్తు అడ్వాన్స్ తీసుకోకపోవడం గమనార్హం. సాధారణంగా పెద్ద హీరోలు డిమాండ్ చేసే ఫ్లాట్ ఫీజుకు బదులుగా.. ఆయన ఈ సినిమా లాభాల్లో వాటా మోడల్‌ను ఎంచుకున్నారు. అంతేకాదు నిర్మాణ సమయంలో సినిమా బడ్జెట్ పరిమితి దాటినప్పుడు ఆయన స్వయంగా తన సొంత నిధులను కూడా పెట్టుబడిగా పెట్టారు. ఈ వ్యూహాత్మక నిర్ణయం వల్ల సినిమా విజ‌యం అనంత‌రం ర‌ణ‌వీర్ లాభాల వాటా ఊహించని స్థాయికి పెరిగింది.

ట్రేడ్ అంచనాల ప్రకారం థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ షేర్, బాక్సాఫీస్ బోనస్‌లతో పాటు డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ వంటి నాన్-థియేట్రికల్ ఆదాయ మార్గాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే రణవీర్ వాటా 325 కోట్లకు చేరింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన మొత్తం లాభాల్లో సింహభాగం జియో స్టూడియోస్, ఆదిత్య ధార్‌కు చెందిన బి62 స్టూడియోస్‌కు ద‌క్కినా? నటీనటుల పరంగా రణవీర్ అందుకున్న వాటా మాత్రం రికార్డు. భారతీయ సినీ చరిత్రలో ఒకే ప్రాజెక్టుకు గానూ ఒక నటుడు పొందిన అత్యధిక మొత్తం ఇదే కావడం విశేషం.

ఈ క్రేజీ నెంబర్‌తో రణవీర్ సింగ్ దేశంలోని అగ్ర నటుల రికార్డులను వెనక్కి నెట్టారు. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ `జైలర్` సినిమాకు గానూ 250 కోట్లకు పైగా అందుకోగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప 2` చిత్రానికి, రెబల్ స్టార్ ప్రభాస్ `కల్కి 2898 ఏడీ` చిత్రానికి ఒక్కొక్కరు 200 కోట్లకు పైగా పారితోషికం అందుకున్న‌ట్లు ట్రేడ్ వర్గాల అంచనా. బాలీవుడ్ విషయానికి వస్తే 2023లో షారుఖ్ ఖాన్ బ్లాక్‌బస్టర్ హిట్లు `పఠాన్`, `జ‌వాన్` చిత్రాల ద్వారా ఒక్కో సినిమాకు 200 కోట్ల చొప్పున ఆర్జించారు. తాజాగా రణవీర్ సింగ్ వీళ్లంద‌ర్నీ దాటుకుని పారితోషికంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.