ఛాలెంజింగ్ పాత్ర విషయంలో షాక్ ఇచ్చిన హీరో!
రణవీర్ సింగ్ పాత్రల మధ్య వ్యత్యాసం చూపించడంలో స్పెషలిస్ట్. పాత విజయాలను పక్కన పెట్టి ప్రతి సినిమాను ఒక కొత్త సవాల్‌గా స్వీకరించడం అభినందనీయం.
By: Srikanth Kontham | 28 April 2026 8:00 AM ISTబాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ పాత్రల పరంగా ఎలాంటి ఛాలెంజెస్ స్వీకరిస్తాడు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడు. కెరీర్ మొత్తంలో ఇప్పటి వరకూ ఎన్నో ప్రయోగాత్మక పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించారు. అలాంటి సాహసకుడు కావడంతో ధురంధర్ తో తానేంటే పాన్ ఇండియాకు చాటి చెప్పారు. మరి అతడి కెరీర్ మొత్తంలో టఫ్ రోల్ ఏది అంటే? ధురంధర్ లో పోషించిన హంజా పాత్ర అనే అంటున్నారు. హంజా అనే పాత్ర తన కెరీర్‌లోనే అత్యంత కష్టతరమైనదని పేర్కొన్నారు.
`పద్మావత్` చిత్రంలో పోషించిన క్రూరమైన అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర కంటే కూడా హంజా పాత్రను పోషించడం కష్టంగా అనిపించదన్నారు. మానసిక స్థితి - శారీరక శ్రమ పరంగా హంజా పాత్ర పెద్ద ఛాలెంజ్ అని అంటున్నాడు. ఈ పాత్రలో ఉన్న లోతు , దాని వెనుక ఉన్న ఎమోషన్స్‌ను పండించడం కోసం తాను ఎంతో కష్టపడాల్సి వచ్చిందన్నారు. ఖిల్జీ పాత్రకు ఒక రకమైన బాహ్య అరుపులు, క్రూరత్వం ఉంటే, హంజా పాత్రకు అంతర్గత సంఘర్షణ , నిశ్శబ్దంతో కూడిన తీవ్రత ఉంటుందని అది తనను నటుడిగా మరో మెట్టు ఎక్కించిందని రణవీర్ సింగ్ అభిప్రాయపడ్డారు.
అలాగే చిత్ర నిర్మాత నికుంజ్ బియాని కూడా రణవీర్ అంకితభావంపై ప్రశంసలు కురిపించారు. సెట్స్ లో రణవీర్ చూపించిన ఎనర్జీ , హంజా పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసిన తీరు ఆశ్చర్యకరంగా అనిపించిందన్నారు. ఆదిత్య ధర్ విజన్‌కు తగ్గట్టుగా రణవీర్ తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకున్నారని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన చూపించిన తెగువ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చిందని చెప్పుకొచ్చారు. రణవీర్ కెరీర్‌లో ఇప్పటి వరకు చేసిన పాత్రలకు భిన్నంగా `ధురంధర్` లో మరింత పరిణతి చెందిన నటనను చూపించాడు.
రణవీర్ సింగ్ పాత్రల మధ్య వ్యత్యాసం చూపించడంలో స్పెషలిస్ట్. పాత విజయాలను పక్కన పెట్టి ప్రతి సినిమాను ఒక కొత్త సవాల్‌గా స్వీకరించడం అభినందనీయం. ఖిల్జీ పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రణవీర్ హంజా పాత్రతో సరికొత్త ఇమేజ్ ను సృష్టించుకున్నాడు. ధురంధర్ బాక్సాఫీస్ వద్ద 3000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో రణవీర్ సింగ్ తదుపరి ప్రాజెక్ట్ పై ఆసక్తి నెలకొంది. అతడు ఎలాంటి కథని ఎంచుకుంటాడు? ఆ కథను డీల్ చేసే దర్శకుడు ఎవరు? పాన్ ఇండియాలో ఆ సినిమా ఎలా ఉండబోతుంది? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
