Begin typing your search above and press return to search.

ర‌ణ‌వీర్ సింగ్ పై FWICE సంచ‌ల‌న నిర్ణ‌యం!

అసలు వివాదానికి వస్తే, `డాన్` సిరీస్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలనుకున్న `డాన్ 3` చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడానికి రణవీర్ సింగ్ మొదట అంగీకరించిన సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   25 May 2026 10:14 PM IST
ర‌ణ‌వీర్ సింగ్ పై FWICE సంచ‌ల‌న నిర్ణ‌యం!
X

బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌పై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) సహాయ నిరాకరణ ఉత్తర్వులను జారీ చేసింది. క్రేజీ ఫ్రాంచైజీ చిత్రం `డాన్ 3` నుంచి రణవీర్ అకస్మాత్తుగా తప్పుకోవడంపై చిత్ర ద‌ర్శ‌క‌, నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన అనంత‌రం సినీ కార్మిక సమాఖ్య ఈ కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది. తాజా ఆదేశాల ప్రకారం రణవీర్ సింగ్ వివాదంపై స్పందించి చర్చలకు వచ్చేంతవరకు ఆయనతో పరిశ్రమకు చెందిన ఏ సభ్యుడూ కలిసి పనిచేయకూడదని సంఘం నిర్ణ‌యించింది. తాజాణామంపై ఎఫ్‌డబ్ల్యూఐసీఈ అధ్యక్షుడు బి.ఎన్. తివారీ అధికారికంగా స్పందించారు.

` సహాయ నిరాకరణ నోటీసు తక్షణమే అమలుల్లోకి వస్తుందని ప్రకటించారు. రణవీర్ సింగ్ స్వయంగా ముందుకు వచ్చి అంశంపై తగిన వివరణ ఇచ్చేంతవరకు ఏ ఒక్క టెక్నీషియన్, నటుడు , సినీ కార్మికుడు అతనికి సహకరించబోరని నొక్కిచెప్పారు. చిత్ర పరిశ్రమలోని ప్రధాన భాగస్వాముల ప్రయోజనాలను, క్రమశిక్షణను కాపాడటానికే ఈ విధమైన కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ఫెడరేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.

అసలు వివాదానికి వస్తే, `డాన్` సిరీస్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలనుకున్న `డాన్ 3` చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడానికి రణవీర్ సింగ్ మొదట అంగీకరించిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న తరుణంలో ఊహించని విధంగా ప్రాజెక్ట్ నుండి వైదొలగడంతో చిత్ర నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. రణవీర్ హఠాత్తుగా తప్పుకోవడం వల్ల 45 కోట్ల రూపా యల మేర నష్టం వాటిల్లిందని సదరు నిర్మాణ సంస్థ ఆరోపించింది. ఆర్థిక నష్టమే కాకుండా చిత్రం కోసం దర్శకుడు ప‌ర్హాన్ అఖ్తర్ విలువైన డేట్స్‌ను కేటాయించడం వల్ల నటుడిగా ఇతర చిత్రాలలో నటించే అవకాశాలను కూడా కోల్పోవాల్సి వచ్చింది.

దర్శకుడిగా - నటుడిగా ఫర్హాన్ అఖ్తర్ తన సమయాన్ని ఈ ప్రాజెక్ట్ కోసమే కేటాయించి ఉండ‌టం రణవీర్ తప్పుకున్న తర్వాత వ్యక్తిగతంగా కూడా తీవ్రంగా నష్టపోయారని ఎఫ్‌డబ్ల్యూఐసీఈకి సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నీ వృత్తిపరమైన నిబద్ధతపై పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. వివాదాన్ని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి సిద్ధంగానే ఉన్నట్లు సంకేతాలిచ్చింది.

రణవీర్ సింగ్ వైపు ఉన్న వాదనలను వినడానికి వారి మధ్య మనస్పర్థలను తొలగించి ఇరుపక్షాలకు ఆమోద యోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని ఫెడరేషన్ ప్రకటనలో వెల్లడించింది. సమస్యను మరింత జటిలం చేసుకోకుండా మాట్లాడుకుంటేనే ఇండస్ట్రీ ప్రయోజనాలకు మంచిదని అభిప్రా యపడ్డారు. బాలీవుడ్ స్టార్ హీరోగా ఎంతో క్రేజ్ ఉన్న రణవీర్ సింగ్ కెరీర్‌లో ఇలాంటి పెద్ద వివాదం ఎదురుకావడం ఇదే మొదటిసారి.లీగల్ -అసోసియేషన్ వివాదం ర‌ణ‌వీర్ ఇతర ప్రాజెక్టులపై ఎలాంటి ప్ర‌భావం చూపుతుందనేది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.