Begin typing your search above and press return to search.

తెగేదాకా లాగుతాడా! డాన్ 3 వివాదంలో ర‌ణ్‌వీర్ నెక్ట్స్ స్టెప్ ఏంటి?

రణ్‌వీర్ ఆకస్మిక నిష్క్రమణ కారణంగా తాము భారీగా ఆర్థిక నష్టాలను చవిచూశామని ఆరోపిస్తూ చిత్ర నిర్మాతలు ఫర్హాన్ అఖ్తర్, రితేష్ సిధ్వానీ సంబంధిత అధికారులను ఆశ్రయించారు.

By:  Sivaji Kontham   |   27 May 2026 12:23 PM IST
తెగేదాకా లాగుతాడా! డాన్ 3 వివాదంలో ర‌ణ్‌వీర్ నెక్ట్స్ స్టెప్ ఏంటి?
X

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రతిష్టాత్మక చిత్రం `డాన్ 3` ప్రాజెక్ట్ నుండి అకస్మాత్తుగా తప్పుకోవడం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద చట్టపరమైన..అలాగే వృత్తిపరమైన వివాదానికి దారితీసింది. రణ్‌వీర్ ఆకస్మిక నిష్క్రమణ కారణంగా తాము భారీగా ఆర్థిక నష్టాలను చవిచూశామని ఆరోపిస్తూ చిత్ర నిర్మాతలు ఫర్హాన్ అఖ్తర్, రితేష్ సిధ్వానీ సంబంధిత అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్‌డ‌బ్ల్యూఐసిఇ) రణ్‌వీర్ సింగ్‌కు వ్యతిరేకంగా `స్వ‌చ్ఛందంగా ఎవ‌రూ సహకరించకూడదు` అంటూ ఒక వివాదాస్పద ఆదేశాన్ని జారీ చేసింది. ఈ పరిణామం ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీసింది.

ఈ వ్యవహారంపై ప్రముఖ లీగల్ నిపుణుడు అమీత్ నాయక్ స్పందిస్తూ.. ఎఫ్‌డబ్ల్యూఐసీఈ విధించిన ఇటువంటి నిషేధం పూర్తిగా చట్టవిరుద్ధమని.. దీనిని అమలు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఒక వ్యక్తిపై ఇలాంటి ఆంక్షలు విధించే అధికారం ఏ ప్రైవేట్ సంస్థకూ లేదని లాయ‌ర్ స్పష్టం చేశారు. ఎఫ్‌డబ్ల్యూఐసీఈ తీసుకున్న ఈ నిర్ణయం అధికార దుర్వినియోగం కిందికే వస్తుందని.. ఎందుకంటే ఈ సంస్థకు ఎలాంటి చట్టబద్ధమైన అధికారం లేదని ఆయన వేలెత్తి చూపుతూ.. ఈ ఆదేశానికి చట్టపరమైన చెల్లుబాటు ఉండదని.. దీనిని న్యాయస్థానాల్లో చాలా సులభంగా సవాలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు.

మరోవైపు ఎఫ్‌డబ్ల్యూఐసీఈ పదే పదే నోటీసులు జారీ చేసినా రణ్‌వీర్ సింగ్ మొదట్లో స్పందించలేదు. అయితే తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ.. ఇది పూర్తిగా ఇరు పక్షాల మధ్య ఉన్న ఒప్పందానికి సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. ఇటువంటి వ్యాపార, చట్టపరమైన విభేదాలను సరైన చట్టపరమైన ఫోరమ్‌లు.. న్యాయపరమైన ప్రక్రియల ద్వారానే పరిష్కరించుకోవాలి తప్ప.. ఇలాంటి ఏకపక్ష ఆంక్షల ద్వారా కాదని రణ్‌వీర్ పేర్కొన్నారు.

ఈ వివాదంపై సోషల్ మీడియా వేదికల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్‌డబ్ల్యూఐసీఈ జారీ చేసిన ఈ ఆదేశాల వల్ల రణ్‌వీర్ సింగ్ కెరీర్‌కు ఎలాంటి నష్టం వాటిల్లబోదని మెజారిటీ నెటిజన్లు భావిస్తున్నారు. ఒకవేళ దేశీయంగా ఇబ్బందులు ఎదురైనా.. అంతర్జాతీయ షూటింగ్‌ల విషయంలో ఈ ఆంక్షలను సులభంగా దాటవేయవచ్చని కొందరు గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో ఈ వ్యవహారంలో రణ్‌వీర్ సింగ్ వెనక్కి తగ్గకుండా సదరు సంస్థపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఒక వర్గం నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా తుది నిర్ణయానికి వచ్చే ముందు రెండు వైపులా వాదనలను వినాలని మరికొందరు సూచిస్తున్నారు.

ప్రస్తుతం ఈ అంతర్గత పోరు బాలీవుడ్‌లో మరింత పెద్దదిగా మారుతోంది. రణ్‌వీర్ సింగ్ కెరీర్ ఎదుగుద‌ల కంబ్యాక్ ఇప్పుడే మొద‌లైంది గ‌నుక అత‌డు త‌న‌ వ్యాపార పరిధిని దృష్టిలో ఉంచుకుని.. ఈ సమస్యను అంత దూరం తీసుకెళ్లకుండా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడమే మంచిదని ఇండస్ట్రీలోని మరికొందరు పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఈ గొడవను ఇక్కడితో సెటిల్ చేసుకోవడం రణ్‌వీర్‌కు పెద్ద కష్టమేమీ కాదని వారు చెబుతున్నారు. ఇప్పుడు ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందనేది ఇరు వర్గాలు ముందు ముందు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంది.