రణ్‌వీర్‌ని బ్యాన్ చేసే హక్కు ఎవరికీ లేదు!?
అయితే ఎఫ్‌డబ్ల్యూఐసీఈ చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ ఈ ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పూర్తిగా ఖండించారు.
By: Sivaji Kontham | 28 May 2026 6:40 PM ISTఫర్హాన్ అక్తర్ `డాన్ 3` చుట్టూ గత కొన్ని రోజులుగా ఒక పెద్ద వివాదం నడుస్తోంది. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) రణ్‌వీర్ సింగ్‌ను చిత్ర పరిశ్రమ నుండి పూర్తిగా ``నిషేధించింది`` అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే ఈ వివాదంపై ఎఫ్‌డబ్ల్యూఐసీఈ తాజాగా అధికారికంగా స్పందిస్తూ తీవ్రతను తగ్గించింది. రణ్‌వీర్ సింగ్ `డాన్ 3` వివాదాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారని సంస్థ స్పష్టం చేసింది.
ఈ వివాదానికి అసలు కారణం రణ్‌వీర్ సింగ్ అకస్మాత్తుగా `డాన్ 3` ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడమే. ఈ సినిమా షూటింగ్ కోసం యూనిట్ విదేశాలకు బయలుదేరడానికి కేవలం మూడు వారాల ముందు అతడు ఈ నిర్ణయం తీసుకున్నారని ఫర్హాన్ వాదిస్తున్నారు. తాము సెట్స్ కి వెళ్లక ముందే ఈ ప్రాజెక్టుపై 45కోట్లు పైగా పెట్టుబడి పెట్టామని, రణ్ వీర్ తప్పుడు నిర్ణయంతో దానిని తాము నష్టపోవాల్సి వచ్చిందని నిర్మాత ఫర్హాన్ వాదిస్తూ ఎఫ్‌డబ్ల్యూఐసీఈకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అతడికి మూడు నోటీసులు.. మూడు రిమైండర్లు పంపినా స్పందన రాకపోవడంతో అతడిపై నిషేధం విధించారనే ప్రచారం సాగింది.
అయితే ఎఫ్‌డబ్ల్యూఐసీఈ చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ ఈ ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పూర్తిగా ఖండించారు. రణ్‌వీర్ సింగ్‌పై విధించింది `నిషేధం` కాదని.. అది కేవలం `సహకరించకూడదనే ఆదేశం` మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ రకమైన ఆదేశం వల్ల పరిశ్రమలోని కార్మికులు, సాంకేతిక నిపుణులు సదరు నటుడితో పని చేయాలా వద్దా అనేది వారి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కానీ పూర్తి నిషేధం విధిస్తే మాత్రం ఇండస్ట్రీలో ఎవరూ ఆయనతో కలిసి పనిచేయడానికి వీలుండదు. కాబట్టి ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉందని ఆయన వివరించారు.
ఎఫ్‌డబ్ల్యూఐసీఈ ఇచ్చిన ఈ తాజా వివరణతో బాలీవుడ్ వర్గాల్లో చర్చల సరళి పూర్తిగా మారిపోయింది. రణ్‌వీర్ కెరియర్ క్లోజ్ అయిపోయిందంటూ సాగిన ప్రచారాలకు బ్రేక్ పడింది. ఈ వివాదంపై రణ్‌వీర్ సింగ్ స్పందిస్తూ.. వృత్తిపరమైన విషయాలను ఎప్పుడైనా పరస్పర గౌరవంతో గౌరవప్రదమైన రీతిలో పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు. నిర్మాతలు, నటుల మధ్య ఉండే కాంట్రాక్ట్ వివాదాలను పరిష్కరించడానికి ఎఫ్‌డబ్ల్యూఐసీఈ సరైన వేదిక కాదని అతడి బృందం వాదించింది. గతంలో కూడా రణ్‌వీర్ `కాంతార` చిత్రానికి సంబంధించిన ఒక వివాదంలో చిక్కుకుని అధికారిక క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఎఫ్‌డబ్ల్యూఐసీఈ వివరణ తర్వాత ఈ వ్యవహారం ఎంతవరకు సద్ధుమణుగుతుంది? రణ్‌వీర్ తదుపరి చిత్రాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇండస్ట్రీ వర్గాలు ఆయనకు మద్దతుగా నిలిస్తే ఈ సమస్య త్వరగానే ముగిసిపోతుంది. మరోవైపు రణ్‌వీర్ సింగ్ తప్పుకోవడంతో `డాన్ 3` చిత్రబృందం ఈ ప్రతిష్టాత్మక పాత్ర కోసం బాలీవుడ్‌లోని ఇతర స్టార్ హీరోల ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా ఈ సరికొత్త వివాదం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా నిలిచింది.
