Begin typing your search above and press return to search.

టాలీవుడ్ పాన్ ఇండియా మూవీస్‌కి 'ధురంధ‌ర్ 2' షాక్‌!

యావ‌త్ ప్ర‌పంచాన్నిషేక్ చేస్తున్న బాలీవుడ్ మూవీ `ధురంధ‌ర్: ది రివేంజ్‌`. ర‌ణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ భారీ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ డ్రామాని డేరింగ్ డైరెక్ట‌ర్ ఆదిత్య‌ధ‌ర్ తెర‌కెక్కించారు.

By:  Ravindar Gorantla   |   23 March 2026 1:23 PM IST
టాలీవుడ్ పాన్ ఇండియా మూవీస్‌కి ధురంధ‌ర్ 2 షాక్‌!
X

యావ‌త్ ప్ర‌పంచాన్నిషేక్ చేస్తున్న బాలీవుడ్ మూవీ `ధురంధ‌ర్: ది రివేంజ్‌`. ర‌ణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ భారీ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ డ్రామాని డేరింగ్ డైరెక్ట‌ర్ ఆదిత్య‌ధ‌ర్ తెర‌కెక్కించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య మార్చి 19న విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల సునామీని సృష్టిస్తూ ర్యాంపేజ్ చేస్తోంది. విడుద‌లైన నాలుగు రోజుల్లోనే ఛారిత్రక వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ హిందీ సినీ చ‌రిత్ర‌లోనే స‌రికొత్త మైలు రాళ్ల‌ని అధిగ‌మిస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.240 కోట్ల‌కు పైనే రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించిన `ధురంధ‌ర్ 2` వ‌సూళ్ల ప‌రంగా ప‌లు రికార్డుల్ని అధిగ‌మించేస్తోంది.

సినిమా విడుద‌లైన నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.761 కోట్ల‌ గ్రాస్ క‌లెక్ష‌న్ల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతోంది. సినిమా రిలీజ్‌కు ముందు అంటే మార్చి 18 బుధ‌వారం ఏర్పిటు చేసిన పెయిడ్ ప్రివ్యూల ద్వారానే ఈ మూవీకి రూ. 43 కోట్లు రావ‌డం గ‌మ‌నార్హం. ఇక ఆదివారం ఒక్క రోజే దేశ వ్యాప్తంగా అత్య‌ధికంగా రూ.115 కోట్లు సాధించి స‌రికొత్త రికార్డు సృష్టించింది. అంతే కాకుండా ప‌లు క్రేజీ పాన్ ఇండియా మూవీస్ రికార్డుల్ని కూడా అధిగ‌మించి షాక్ ఇస్తోంది. టాలీవుడ్ పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్స్ కూడా ఈ జాబితాలో ఉండ‌టం షాక్‌కు గురి చేస్తోంది.

బాలీవుడ్‌లో షారుక్ ఖాన్ న‌టించిన `ప‌ఠాన్‌` మూవీ నెల‌కొల్పిన రూ.287 కోట్ల ఓపెనింగ్ వీకెండ్ రికార్డును `ధురంధ‌ర్ 2` చాలా సింపుల్‌గా అధిగ‌మించింది. అంతే కాకుండా ఓవ‌ర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా రూ.211 కోట్లు రాబ‌ట్టి అక్క‌డ ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. అంతే కాకుండా భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ఓపెనింగ్ వీకెండ్ సాధించిన రెండ‌వ సినిమాగా నిలిచింది. ఈ నేప‌థ్యంలోనే టాలీవుడ్ కు చెందిన పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్స్ `బాహుబ‌లి 2` రూ.591 కోట్లు, ఆర్ఆర్ఆర్ రూ.470 కోట్లు, క‌ల్కి 2898ఏడీ రూ.500 కోట్లు సాధించిన చిత్రాల రికార్డుల్ని సైతం బ్రేక్ చేసి ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

తాజాగా `ధురంధ‌ర్ 2` బ్రేక్ చేసిన సినిమాల‌కు ముందు `పుష్ప 2` రూ.762 కోట్ల‌తో ఫ‌స్ట్ ప్లేస్‌ని ప‌దిలం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే ప్రీమియ‌ర్స్ నుంచే రికార్డుల మోత‌కు తెర‌లేపిన `ధురంధ‌ర్ 2` ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా ప్ర‌కారం త్వ‌ర‌లోనే రూ.1000 కోట్ల మార్కుని దాటుతుంద‌ని, రానున్న రోజుల్లో రూ.2000 కోట్ల మార్కుని కూడా అవ‌లీల‌గా దాటేస్తుంద‌ని చెబుతున్నారు. `ధురంధ‌ర్ 2` స్పీడు చూస్తుంటే రికార్డు టైమ్‌లోనే రూ.1000 కోట్ల మార్కుని దాటేసి లాండ్ ర‌న్‌లో రూ.2000 కోట్ల మార్కుని క్రాస్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో విడుద‌లైన `ధురంధ‌ర్‌` సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుక‌వ‌డంతో సీక్వెల్‌గా రూపొందిన `ధురంధ‌ర్ 2`పై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు మించి సినిమా ఉండ‌టంతో ప్ర‌పంచ వ్యాప్తంగా సినీ ల‌వ‌ర్స్ సినిమాకు బ్ర‌హ్మ‌రథం ప‌డుతున్నా క‌లెక్షన్‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. దీంతో ఈ సినిమా ఊహించిన దానికి మించి వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తూ వ‌రుస‌గా రికార్డుల్ని బ్రేక్ చేస్తూ వెళుతోంది. రానున్న రోజుల్లో మ‌రెన్ని రికార్డుల్ని త‌న ఖాతాలో వేసుకుంటుందో చూడాల‌ని ట్రేడ్ వ‌ర్గాలు, సినీ ల‌వ‌ర్స్ ఆస‌క్తిగా చూస్తున్నారు.