Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్: చివ‌రికి బాలీవుడ్ ఆక‌లి తీర్చిన ఒంట‌రి యోధుడు!

బాలీవుడ్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. కానీ కాలక్రమేణా అక్కడ దిగ్గజ హీరోలంతా వరుస వైఫల్యాలతో చతికిలబడ్డారు.

By:  Sivaji Kontham   |   21 March 2026 6:00 AM IST
ట్రెండీ టాక్:  చివ‌రికి బాలీవుడ్ ఆక‌లి తీర్చిన ఒంట‌రి యోధుడు!
X

బాలీవుడ్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. కానీ కాలక్రమేణా అక్కడ దిగ్గజ హీరోలంతా వరుస వైఫల్యాలతో చతికిలబడ్డారు. బాక్సాఫీస్ వద్ద అణాపైసా రాక నిర్మాతలు విలవిలలాడుతున్న తరుణంలో ఖాన్‌ల‌ త్రయంలో షారుఖ్ ఖాన్ ఒక్కడే పఠాన్, జవాన్ వంటి చిత్రాలతో కొంత పోరాటం సాగించాడు. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్లు చేతులెత్తేయగా, అక్షయ్ కుమార్ వరుస ప్లాపులతో చితికిపోయాడు. యువ హీరోల్లో కూడా విక్కీ కౌశల్ మినహా ఎవరూ బాక్సాఫీస్ వద్ద ఆశించిన జోష్ చూపించలేకపోయారు.

దక్షిణాది నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమాలు 1000 కోట్ల వసూళ్లతో దూసుకుపోతుంటే బాలీవుడ్ మరీ నీరసపడిపోయింది. ఇండస్ట్రీ మొత్తం ఒడిదుడుకుల్లో ఉన్న వేళ, `నేనున్నాను` అంటూ రణవీర్ సింగ్ ఒక్కడే ధైర్యంగా ముందుకు వచ్చాడు. అయితే విచిత్రమేమిటంటే ఈ రణవీరుడి విజయాన్ని గుర్తించడానికి బాలీవుడ్ క్రిటిక్స్ గానీ, పరిశ్రమలోని ఇతర దిగ్గజ హీరోలు గానీ సిద్ధంగా లేరు. అత‌డి సినిమా గురించి ప్రశంసిస్తూ ఒక్క మాట కూడా క్రిటిక్స్ రాయ‌డం లేదు. స్టార్లు రికార్డుల గురించి ప్రస్తావించకుండా అందరూ మౌనంగా ఉండిపోయారు.

ఇంతటి స్వార్థపూరిత ప్రపంచంలో తనను ఎవరూ గుర్తించకపోయినా రణవీర్ సింగ్ మౌనంగా తన విజయగాథను ముందుకు నడిపిస్తున్నాడు. `దురంధర్` చిత్రంతో బాలీవుడ్ సహా భారతీయ సినిమా చరిత్రలోని అనేక రికార్డులను ఆయన తిరగరాశాడు. పరిశ్రమ మొత్తం ఒకవైపు ఉంటే రణవీర్ తన అద్భుత‌ నటనతో బాక్సాఫీస్ స్టామినాతో మరోవైపు నిలిచి సంచలనం సృష్టించాడు. పాత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయేలా `దురంధర్` ప్రభంజనం సాగింది.

ప్రస్తుతం ఈ విజయ పరంపర `దురంధర్ 2`తో మరో స్థాయికి చేరుకుంటోంది. ఈ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల నుండి 2000 కోట్ల మధ్య వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చాలా కాలంగా హిట్లు లేక ఆకలితో అలమటిస్తున్న బాలీవుడ్‌కు ఎడారిలో ఒయాసిస్సులా రణవీర్ సింగ్ కనిపిస్తున్నాడు. విసిగిపోయిన పరిశ్రమకు ఇన్నాళ్లకు మళ్లీ జవజీవాలు వచ్చాయన్న చర్చ ముంబై వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది.

పరిశ్రమ సహకరించకపోయినా.. తోటి నటులు ప్రశంసించకుండా హైడ్ చేస్తున్నా.. ఒంటరి పోరాటం చేస్తూ రణవీర్ సింగ్ బాలీవుడ్ ఆకలి తీరుస్తున్నాడు. తనను వెలివేసినట్లు చూస్తున్న వారికి తన వసూళ్లతోనే సమాధానం చెబుతున్నాడు. మొత్తానికి బాలీవుడ్ సంక్షోభంలో ఉన్న తరుణంలో ఆ పరిశ్రమను కాపాడే నిజమైన `దురంధరుడు` తానేనని రణవీర్ నిరూపించుకున్నాడు. రణవీరుడి పోరాటం భారతీయ సినీ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోనుంది. ర‌ణ‌వీర్ సింగ్ త‌దుప‌రి రాజ‌మౌళి, ప్ర‌శాంత్ నీల్, సుకుమార్ వంటి సౌత్ ప్ర‌తిభావంతుల వైపు చూసేందుకు ఆస్కారం ఉంద‌న్న గుస‌గుసా ఇప్పుడు వేడెక్కించేస్తోంది. ర‌ణ్ వీర్ ప్ర‌తిభ‌ను మ‌ల్టీస్టార‌ర్ల రూపంలో సౌత్ ద‌ర్శ‌కులు స‌ద్వినియోగం చేస్తే, అటు ఉత్త‌రాదిన మ‌న సినిమాకి మ‌రింత అద‌నంగా మైలేజ్ పెంచుకునేందుకు ఛాన్సుంది. అన్నిటికీ కాల‌మే స‌మాధానం చెబుతుంది.