Begin typing your search above and press return to search.

జపాన్‌లో టాలీవుడ్ హీరోలదే హవా.. ఇంకెవరికీ ఛాన్స్ లేదు.. ఇదే ప్రూఫ్!

ప్రస్తుతం అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద.. ముఖ్యంగా జపాన్ దేశంలో భారతీయ సినిమాలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది.

By:  Sivaji Kontham   |   12 July 2026 4:14 PM IST
జపాన్‌లో టాలీవుడ్ హీరోలదే హవా.. ఇంకెవరికీ ఛాన్స్ లేదు.. ఇదే ప్రూఫ్!
X

ప్రస్తుతం అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద.. ముఖ్యంగా జపాన్ దేశంలో భారతీయ సినిమాలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అయితే అక్కడ కేవలం మన టాలీవుడ్ స్టార్ హీరోల హవా మాత్రమే నడుస్తోందని.. ఇతరులకు అక్కడ బ్రేక్ దక్కడం అంత సులువు కాదని మరోసారి రుజువైంది. గతంలో జపాన్ ప్రజలు `బాహుబలి` చిత్రాన్ని బ్రహ్మాండంగా ఆదరించడానికి కారణం.. అక్కడి స్థానిక జానపద కథలకు ఆ సినిమా కథాంశం చాలా దగ్గరగా ఉండటమే కాకుండా... ఆరడుగుల ఆజానుబాహుడైన ప్రభాస్ కటౌట్ జపనీయులకు బాగా కనెక్ట్ అవ్వడం. ఆ తర్వాత వచ్చిన RRR చిత్రంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా జపాన్ ప్రజల గుండెల్లో బలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. మన తెలుగు స్టార్లు జపాన్‌ను మన నైజాం ఏరియాలాగే ఒక సొంత మార్కెట్‌గా మార్చుకోవడంలో వంద శాతం సఫలమయ్యారు.

కానీ ఎందుకనో బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `ధురంధర్` జపాన్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా - పాన్ ఇండియా స్థాయిలో దాదాపు రూ. 3000 కోట్ల భారీ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించిన ఈ చిత్రం.. జపాన్ బాక్సాఫీస్ వద్ద మాత్రం అత్యంత దీనమైన ఓపెనింగ్స్‌తో పూర్తిగా తేలిపోయింది. బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో హ‌వా జ‌పాన్ లో కొన‌సాగ‌లేదు స‌రిక‌దా.. క‌నీసం డే వ‌న్ లో టాప్ 25 వ‌సూళ్ల‌ జాబితాలో కూడా చోటు దక్కకపోవడం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ట్రేడ్ వర్గాల స‌మాచారం ప్రకారం.. `ధురంధర్` చిత్రం జపాన్ వ్యాప్తంగా దాదాపు 80 స్క్రీన్స్‌లలో విడుదలైనా మొదటి రోజు ముగిసే సమయానికి కేవలం 900 కంటే తక్కువ మంది ప్రేక్షకులు మాత్రమే ఈ సినిమాను థియేటర్లలో చూశారు. జపాన్‌లో భారతీయ సినిమాలకు ఒక స్థిరమైన, భారీ మార్కెట్ ఏర్పడిన ఈ తరుణంలో ఈ స్థాయి త‌క్కువ క‌లెక్ష‌న్స్ ఊహించని షాక్ అనే చెప్పాలి. గతంలో అల్లు అర్జున్ నటించిన `పుష్ప 2` చిత్రం కూడా జపాన్‌లో భారీ అంచనాల మధ్య విడుదలై.. చివరికి టాప్ 10 జాబితాలోకి రాకుండా 14వ స్థానంతో సరిపెట్టుకోగా.. ఇప్పుడు `ధురంధర్` సైతం అదే తరహాలో నిరాశాజనకమైన ఫలితాన్ని అందుకుంది.

ఈ భారీ పరాజయానికి ప్రధాన కారణం చిత్ర యూనిట్ అనుసరించిన ప్రమోషన్ల లోపమేనని స్పష్టమవుతోంది. జపాన్ లాంటి దేశాల్లో సినిమాలను విడుదల చేసేటప్పుడు అక్కడి స్థానిక ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా వినూత్నంగా పబ్లిసిటీ చేయాల్సి ఉంటుంది. కానీ `ధురంధర్` టీమ్ అక్కడ ఎటువంటి ప్రమోషన్లు చేయకపోవడంతో పాటు, సినిమా విడుదలకు సరైన వ్యూహాన్ని అనుసరించలేదు. వీటన్నింటికీ తోడు జపాన్ మార్కెట్‌కు అసలు తగని, డల్ సీజన్‌లో చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావడం ఈ సినిమాకు అతిపెద్ద మైనస్‌గా మారింది. ఫలితంగా జపాన్‌లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన టాప్ 10 భారతీయ సినిమాల జాబితాలో నిలవాలన్న వీరి ఆశలు అడియాశలయ్యాయి.

జపాన్ బాక్సాఫీస్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే... అక్కడ ఇప్పటికీ మన టాలీవుడ్ సినిమాలే అగ్రస్థానంలో రాజ్యమేలుతున్నాయి. మొదటి రోజు అత్యధికంగా 8,230 మంది వీక్షకులతో ఎస్.ఎస్. రాజమౌళి RRR ఇప్పటికీ నంబర్ 1 స్థానంలో తిరుగులేని రికార్డుతో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో ప్రభాస్ నటించిన `సాహో` (6,510), `కల్కి 2898 AD` (3,700) చిత్రాలు ఉన్నాయి. ఈ రికార్డులను బట్టి చూస్తే జపనీయులకు తెలుగు హీరోల కటౌట్లు, ఇక్కడి ఎమోషన్లు కనెక్ట్ అయినంతగా ఇతరులు కనెక్ట్ కాలేకపోతున్నారని అర్థమవుతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన `ధురంధర్` చిత్రం శని, ఆదివారాల (ఫస్ట్ వీకెండ్) లో గనుక పుంజుకోకపోతే.. జపాన్ బాక్సాఫీస్ వద్ద దీని ప్రయాణానికి అధికారికంగా ఎండ్ కార్డ్ పడినట్లేనని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.