జపాన్‌లో ప్రభాస్ - ఎన్టీఆర్ రేంజు చూపిస్తాడా?
10 జూలై 2026న విడుదల కాబోతున్న ఈ చిత్రం.. మన టాలీవుడ్ హీరోల స్థాయిలో అక్కడ పట్టు సాధిస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
By: Sivaji Kontham | 29 April 2026 11:47 PM ISTజపాన్ బాక్సాఫీస్ వద్ద భారతీయ సినిమాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఒకప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ వేసిన బాటలో ఇటీవల కాలంలో `బాహుబలి`తో ప్రభాస్, `ఆర్ఆర్ఆర్`తో ఎన్టీఆర్ -రామ్ చరణ్ అక్కడ అనూహ్యమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. అదే బాటలో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన `ధురంధర్ 2` జపాన్ మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. 10 జూలై 2026న విడుదల కాబోతున్న ఈ చిత్రం.. మన టాలీవుడ్ హీరోల స్థాయిలో అక్కడ పట్టు సాధిస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
జపాన్ ప్రేక్షకుల అభిరుచి చాలా భిన్నంగా ఉంటుంది. కేవలం భారీ బడ్జెట్ లేదా యాక్షన్ ఉంటే వారు సినిమాలను ఆదరించరు. `బాహుబలి`లోని పురాతన గాథలు, జపాన్ సంస్కృతికి దగ్గరగా ఉండటం వల్ల ప్రభాస్‌ను వారు ఓన్ చేసుకున్నారు. అలాగే ఎన్టీఆర్, చరణ్‌ల ప్రతిభకు `ఆర్ఆర్ఆర్` సమయంలో వారు ఫిదా అయ్యారు. అయితే ఇటీవల మన దేశంలో సంచలనం సృష్టించిన దేవర, కల్కి 2898 AD, పుష్ప 2 వంటి చిత్రాలు జపాన్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. ఈ నేపథ్యంలో రణవీర్ సింగ్ నటించిన ఈ `స్పై యూనివర్స్` కాన్సెప్ట్ వారికి ఎంతవరకు కనెక్ట్ అవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన `ధురంధర్ 2` కేవలం కమర్షియల్ హంగులతోనే కాకుండా.. ఒక సరికొత్త జోనర్‌తో ప్రేక్షకులను పలకరించబోతోంది. జపాన్ మార్కెట్‌లో సక్సెస్ కావాలంటే కేవలం స్కేల్ మాత్రమే సరిపోదు.. భావోద్వేగపూరితమైన అనుబంధం .. వినూత్నమైన కథనం ఉండాలి. ఒకవేళ ఈ సినిమా అక్కడి నేటివిటీకి దగ్గరగా ఉండి... పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే రణవీర్ సింగ్ కూడా ప్రభాస్, ఎన్టీఆర్ తరహాలో గ్లోబల్ స్టార్‌గా ఎదిగే అవకాశం ఉంటుంది.
ట్రేడ్ వర్గాల విశ్లేషణ ప్రకారం.. `ధురంధర్ 2`ఒక ఆసక్తికర పోటీదారుగా కనిపిస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 3000 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం,.. జపాన్‌లో కూడా అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తే బాలీవుడ్‌కు ఒక కొత్త మార్కెట్ తెరుచుకున్నట్లవుతుంది. అయితే గత కొన్ని చిత్రాల పరాజయాలను దృష్టిలో ఉంచుకుంటే... జపాన్ కోటను బద్దలు కొట్టడం అంత సులభం కాదని అర్థమవుతోంది. రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్ వంటి భారీ తారాగణం ఉండటం సినిమాకు ప్లస్ పాయింట్.
మొత్తానికి రణ్ వీర్ జపాన్ ప్రేక్షకుల మనసు గెలుచుకుని ప్రభాస్, ఎన్టీఆర్ సాధించిన ఘనతను అందుకుంటాడా? లేక ఇటీవల విఫలమైన భారీ చిత్రాల జాబితాలో దురంధర్ 2 చేరుతుందా? అన్నది చూడాలి. జూలై 10న విడుదల కానున్న ఈ సినిమా ఫలితంపైనే రణవీర్ సింగ్ అంతర్జాతీయ ఇమేజ్ ఆధారపడి ఉంది. ఈ స్పై యాక్షన్ డ్రామాను జపనీయులకు నచ్చుతుందా లేదా తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
