Begin typing your search above and press return to search.

ధురంధర్ 2.. అది సాధ్యమేనా?

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   8 April 2026 10:21 PM IST
ధురంధర్ 2.. అది సాధ్యమేనా?
X

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఆ చిత్రం విడుదలై దాదాపు 20 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. నార్త్, సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ఆ సినిమా మంచి వసూళ్లను సాధిస్తూ ముందుకు సాగుతోంది.

మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఆ చిత్రం ప్రారంభం నుంచే మంచి టాక్‌ ను అందుకుంది. అదే ఊపును కొనసాగిస్తూ ఇప్పటివరకు దాదాపు రూ.1637 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలో సినిమా భారీ విజయాన్ని నమోదు చేసినట్లు కనిపిస్తోంది. ఫస్ట్ పార్ట్ కు మించిన విజయం సాధించిందని చెప్పాలి..

అయితే ఆ చిత్రానికి మొత్తం రూ.280 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చయినట్లు తెలుస్తోంది. ఆ పెట్టుబడిని తిరిగి రాబట్టడానికి సుమారు రూ.600 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అవసరమని అంచనా వేశారు ట్రేడ్ పండితులు. అయితే, ఇప్పటికే సినిమా ఆ మార్క్‌ను దాటి భారీ లాభాల్లోకి ప్రవేశించింది. ప్రస్తుత కలెక్షన్లను పరిశీలిస్తే, ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ఇక సినిమా విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా రూ.2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, భారతీయ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలుస్తుందని చాలా మంది భావించారు. దంగల్ మూవీ రికార్డును బ్రేక్ చేస్తుందని ఫిక్స్ అయిపోయారు. ఆ దిశగా ప్రారంభ రోజుల్లో కలెక్షన్లు కూడా అదే స్థాయిలో రావడంతో ఆ అంచనాలు మరింత బలపడ్డాయి.

అయితే ప్రస్తుతం పరిస్థితులు కొంత మారినట్లు కనిపిస్తున్నాయి. రూ.2000 కోట్ల మార్క్‌ ను అందుకోవాలంటే ఇంకా దాదాపు రూ.400 కోట్ల వరకు వసూళ్లు సాధించాల్సి ఉంది. సినిమా ఇంకా అన్ని భాషల్లో మంచి స్పందన పొందుతున్నప్పటికీ, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మరింత వేగం అవసరం ఉంది. రోజువారీ కలెక్షన్లు స్థిరంగా ఉన్నా, మొదటి రోజులంత జోష్ కనిపించడం లేదు.

ఇప్పటికీ థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీ కొనసాగుతుండటం ఆ చిత్రానికి అనుకూల అంశమని చెప్పాలి. రాబోయే రోజుల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగితే రూ.2000 కోట్ల మార్క్‌ను చేరుకునే అవకాశాలు పూర్తిగా కొట్టిపారేయలేం. అయితే, అది సాధ్యమవుతుందా లేదా అన్నది వచ్చే రోజుల్లో వచ్చే కలెక్షన్లపై ఆధారపడి ఉంటుంది. మొత్తానికి ధురంధర్ 2 ఇప్పటికే భారీ విజయాన్ని అందుకున్న సినిమా.. కానీ ముందు రోజుల్లో ఇది ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.