Begin typing your search above and press return to search.

హైయెస్ట్ పెయిడ్ హీరో, డైరెక్టర్ ఎవరు? కచ్చితంగా షాక్ అవుతారేమో!

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ విషయం ఎప్పటికీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించే అంశమే.

By:  M Prashanth   |   25 March 2026 1:33 PM IST
హైయెస్ట్ పెయిడ్ హీరో, డైరెక్టర్ ఎవరు? కచ్చితంగా షాక్ అవుతారేమో!
X

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ విషయం ఎప్పటికీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించే అంశమే. ఎవరు ఎంత పారితోషికం తీసుకుంటున్నారు? ఎవరు టాప్‌ లో ఉన్నారు? అనే చర్చలు తరచూ సోషల్ మీడియాలోనూ, ఫ్యాన్స్ మధ్యనూ హాట్ టాపిక్‌ గా మారుతుంటాయి. స్టార్ హీరోలు, దర్శకులు తమ రెమ్యూనరేషన్ వివరాలు వెల్లడించకపోయినా, ఇండస్ట్రీ వర్గాల సమాచారం పేరుతో కొన్ని అంచనాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి.

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర స్థానంలో కొనసాగుతున్న రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, విజయ్, అజిత్ కుమార్ వంటి స్టార్ హీరోలు ఇప్పటికీ భారీ పారితోషికాలు అందుకుంటూ తమ క్రేజ్‌ ను నిలబెట్టుకుంటున్నారు. వయసు పెరిగినా వారి మార్కెట్ తగ్గలేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇక దర్శకుల విషయానికి వస్తే, ఎస్.ఎస్. రాజమౌళి పేరు ముందు వినిపిస్తుంది.

ఆయనతో పాటు సందీప్ రెడ్డి వంగా, అట్లీ, రాజ్‌కుమార్ హిరానీ వంటి దర్శకులు కూడా భారీ రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారని సమాచారం. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధికంగా పారితోషికం అందుకుంటున్న నటుడు, దర్శకుడుగా రణవీర్ సింగ్, ఆదిత్య ధర్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ధురంధర్ సిరీస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాయన్న విషయం తెలిసిందే. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ చిత్రాలు మేకర్స్‌కు గట్టి లాభాలను తీసుకువచ్చాయి. మొదటి భాగం దాదాపు రూ.1400 కోట్ల వసూళ్లు సాధించగా, రెండో భాగం రూ.2500 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశముందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ లెక్కల ప్రకారం మొత్తం ఫ్రాంచైజీ భారీ లాభాలను నమోదు చేయనుందని చెప్పాలి. ఇందులో ముఖ్యంగా రెవెన్యూ షేరింగ్ మోడల్ ఆసక్తికరంగా మారింది. ఆ ఫ్రాంచైజీలో రణవీర్ సింగ్, ఆదిత్య ధర్ చెరో 20 శాతం వాటా పొందుతున్నారని, మిగిలిన 60 శాతం హక్కులు నిర్మాణ సంస్థలకు చెందినవని సమాచారం. ఈ నేపథ్యంలో లాభాల్లో కూడా వీరికి భారీ వాటా దక్కనుంది.

అంచనాల ప్రకారం మొత్తం లాభం రూ.2500 కోట్ల వరకు ఉంటే, అందులో 20 శాతం వాటాగా ఒక్కొక్కరికి సుమారు రూ.500 కోట్లకు పైగా వచ్చే అవకాశముందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే, భారతీయ సినీ చరిత్రలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడు, దర్శకుడిగా వారిద్దరూ నిలిచే అవకాశం ఉంది. ఇలాంటి భారీ రెమ్యునరేషన్ వార్తలు అభిమానుల్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అయితే ఆ వివరాలు అధికారికంగా వచ్చినవి కావన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌ గా మారుతున్న రెవెన్యూ షేరింగ్ మోడల్, భారీ బడ్జెట్ చిత్రాల విజయాలు స్టార్ల సంపాదనను మరింత పెంచుతున్నాయని చెప్పాలి.