దీపిక అలా రణ్ వీర్ ఇలా.. అసలేం జరుగుతోంది?
అయితే ఇప్పుడు రణ్ వీర్ సింగ్ కి కూడా అలాంటి అవమానాలు ఎదురవుతుండడం చర్చగా మారింది.
By: Sivaji Kontham | 2 Oct 2025 2:00 AM ISTబాలీవుడ్ అగ్ర కథానాయిక దీపిక పదుకొనేను బ్యాక్ టు బ్యాక్ భారీ పాన్ ఇండియా చిత్రాల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. సందీప్ వంగా- స్పిరిట్ నుంచి, నాగ్ అశ్విన్ - కల్కి 2898 ఏడి నుంచి దీపికను తొలగించారు. ఆరు గంటల పనిదినం సహా పలు కండిషన్లు పెట్టడంతో దీపికతో కుదరక దర్శకనిర్మాతలు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఇప్పుడు రణ్ వీర్ సింగ్ కి కూడా అలాంటి అవమానాలు ఎదురవుతుండడం చర్చగా మారింది. కన్ఫామ్ గా నటిస్తాడు అనుకున్న ప్రాజెక్ట్ నుంచి రణ్ వీర్‌ని తొలగించడం విస్మయపరిచింది. కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డ్రీమ్ ప్రాజెక్ట్ `బైజు బావ్రా` నుంచి రణ్ వీర్ ని తొలగించి ఆ స్థానంలో రణబీర్ కపూర్ ని ఎంపిక చేసుకోవడం ఆశ్చర్యపరిచింది. ఈ ఆకస్మిక నిర్ణయం ఊహించనిది. ఈ ప్రాజెక్టుపై భన్సాలీ రెండు దశాబ్ధాలుగా పని చేస్తున్నారు. రణ్ వీర్ ప్రధాన పాత్రధారి అని కూడా భావించారు. కానీ చివరకు ఏమైందో కానీ, ఇప్పుడు రణబీర్ కపూర్ తో దీనిని ప్రారంభించారు.
రణబీర్ తో ఇటీవలే భన్సాలీ ముచ్చటించారు. ఆ వెంటనే రణబీర్ బర్త్ డే రోజున దీనిని ఖాయం చేసుకుని ప్రీ ప్రొడక్షన్ కూడా ప్రారంభించేసారని తెలుస్తోంది. ఈ చిత్రం 1955లో వచ్చిన `బైజు బావ్రా` చిత్రానికి రీమేక్ అని తెలుస్తోంది. ఇది ఇద్దరు గాయకుల చుట్టూ తిరిగే మ్యూజికల్ డ్రామా కథాంశం. సినిమా ఆద్యంతం రక్తి కట్టించే ఎలిమెంట్స్ ఉంటాయి. ఎమోషన్స్ కి కొదవేమీ ఉండదు. ఓల్డ్ క్లాసిక్ రీమేక్ కోసం భన్సాలీ చాలా కాలంగా తహతహలాడుతున్నారు. స్క్రిప్టును నేటి జెన్ జెడ్ కి కనెక్ట్ చేసేందుకు చాలా శ్రమించాడని సమాచారం. భన్సాలీ ఇప్పటికే రణబీర్ కపూర్ తో లవ్ అండ్ వార్ చిత్రం కోసం కలిసి పని చేస్తున్నారు. ఇందులో విక్కీ కౌశల్, ఆలియా భట్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వెనువెంటనే రణబీర్ కపూర్ ని భన్సాలీ లాక్ చేయడం సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు రణ్ వీర్ సింగ్ తన కెరీర్ లో అత్యంత బ్యాడ్ ఫేజ్ లో ఉన్న సమయంలో ఇంత పెద్ద అవకాశాన్ని కోల్పోవడం నిజంగా పెద్ద నిరాశ.
