'ధురంధర్' తుఫాన్ కు బ్రేక్? అయినా తక్కువేం కాదు!
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో నటించిన ధురంధర్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 3 Jan 2026 4:25 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో నటించిన ధురంధర్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కంప్లీట్ యాక్షన్ డ్రామాగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఆ సినిమా 2025 డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అయింది. విడుదలైన ఫస్ట్ షోకే పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో వసూళ్లు రాబట్టింది.
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేసింది. 2025లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. సెన్సార్ సర్టిఫికెట్ ఏ అందుకుని రూ.1000 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన తొలి చిత్రంగా ధురంధర్ అరుదైన రికార్డు క్రియేట్ చేసింది.
రణవీర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా కూడా నిలిచింది. అయితే 26 రోజులుగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ధురంధర్ మూవీ వసూళ్లు.. ఇప్పుడు కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తోంది. రిలీజ్ అయినప్పుడు మొదలైన సినిమా వసూళ్ల తుఫానుకు చిన్న బ్రేక్ పడినట్లు ఉంది. ఎందుకంటే విడుదలైన నాలుగో శుక్రవారం అంటే.. జనవరి 2వ తేదీన సినిమా రిలీజ్ అయిన నుంచి ఇప్పటి వరకు అతి తక్కువ ఒక్కరోజు వసూళ్లు నమోదు చేసింది.
ఇండస్ట్రీ ట్రాకర్ సాక్‌నిల్క్ గణాంకాల ప్రకారం, శుక్రవారం ధురంధర్ మూవీ ఆక్యుపెన్సీ 18 శాతంగా నమోదైంది. భారత్ లో రూ.8.75 కోట్లు వసూలు చేసింది. అవి కూడా తక్కువేం కాకపోయినప్పటికీ.. సినిమా ఓవరాల్ రన్ లో కాస్త తక్కువ నెంబర్ అంతే.. దీంతో ఇప్పటివరకు భారత్ లో ధురంధర్ నెట్ కలెక్షన్లు రూ.747.75 కోట్లకు చేరాయి.
అయితే ధురంధర్ మూవీ రూ.1000 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టి.. పఠాన్ (రూ.1069.85 కోట్లు), జవాన్ (రూ.1163.62 కోట్లు) లైఫ్ టైమ్ వసూళ్లను డామినేట్ చేసింది. ఇండియన్ సినిమాల్లో ఆరో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. ధురంధర్ కన్నా ముందు కేజీఎఫ్ చాప్టర్ 2, ఆర్ఆర్ఆర్, పుష్ప 2: ది రూల్, బాహుబలి 2, దంగల్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నాయి.
వాటిలో మరికొన్ని సినిమాలను ధురంధర్ అధగమిస్తుందని కొందరు సినీ ప్రియులు అంచనా వేశారు. కానీ అది జరిగేలా లేదు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ధురందర్ 2.. ఈ ఏడాది మార్చి 19వ తేదీ విడుదలవనుంది. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ మూవీ ఎలా ఉంటుందో, ఎంతటి హిట్ అవుతుందో, ఎన్ని కోట్ల వసూళ్లు సాధిస్తుందో చూడాలి.
