Begin typing your search above and press return to search.

కంటెంట్ క్రియేషన్ వర్సెస్ సినిమా పరిశ్రమ!

వినోద రంగంలో డిజిటల్ మాధ్యమాలు దూసుకుపోతున్న తరుణంలో కంటెంట్ క్రియేషన్ రంగానికి- సినిమా పరిశ్రమకు మధ్య జరుగుతున్న ఆర్థిక లావాదేవీలపై తీవ్ర చర్చ జరుగుతోంది.

By:  Srikanth Kontham   |   19 Aug 2026 6:00 PM IST
కంటెంట్ క్రియేషన్ వర్సెస్ సినిమా పరిశ్రమ!
X

వినోద రంగంలో డిజిటల్ మాధ్యమాలు దూసుకుపోతున్న తరుణంలో కంటెంట్ క్రియేషన్ రంగానికి- సినిమా పరిశ్రమకు మధ్య జరుగుతున్న ఆర్థిక లావాదేవీలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రముఖ యూట్యూబర్, పాడ్‌కాస్టర్ రణ్‌వీర్ అల్లాబాదియా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమాలలో నటించడం కంటే కంటెంట్ క్రియేషన్ రంగంలోనే ఎక్కువ సంపాదన ఉందని స్పష్టం చేశారు. బాలీవుడ్‌లో వేళ్ల మీద లెక్కపెట్టదగిన కొద్దిమంది నటులు మాత్రమే అసలైన సంపదను ఆర్జిస్తున్నారని.. మిగతా వారందరి పరిస్థితి డిజిటల్ క్రియేటర్ల కంటే భిన్నంగా ఉంటుందని తేల్చిచెప్పారు.

బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమపై బయటి ప్రపంచంలో ఎంత గ్లామర్ కనిపిస్తుందో? లోపల ఆర్థిక వాస్తవాలు వేరుగా ఉంటాయని రణ్‌వీర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అగ్రశ్రేణిలో ఉన్న ముప్పై మంది బాలీవుడ్ నటులు మాత్రమే భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారని, మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు కెరీర్ పరంగా అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారని విశ్లేషించారు. కానీ డిజిటల్ కంటెంట్ క్రియేషన్ రంగంలో మాత్రం సరైన వ్యూహాలు, నిలకడ ఉంటే ఎంతో మంది యువ సృష్టికర్తలు ఊహించని స్థాయిలో ఆర్జిస్తున్నారని తెలిపారు.

ఈ వ్యాఖ్యలు ట్రెడిషనల్ మీడియా వర్గాలను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్నాయి. సాంప్రదాయ సినిమా పరిశ్రమలో ఒక సినిమా విజయవంతం కావడానికి ఎంతో మంది శ్రమించాల్సి ఉంటుంది, పైగా పెట్టుబడి నష్టపోతే వచ్చే ఆర్థిక భారం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో క్రియేటర్లు నేరుగా తమ ప్రేక్షకులతో కనెక్ట్ అవుతూ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్నారు.

ఏజెన్సీలు, నిర్మాతల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా స్వతహాగా ఎదగడానికి డిజిటల్ రంగం అద్భుతమైన వేదికగా నిలుస్తోందని రణ్‌వీర్ ఉద్ఘాటించారు. అందుకే నేటి యువత సినిమాల వైపు కంటే కంటెంట్ క్రియేషన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతోందని అభిప్రాయపడ్డారు. అయితే బాలీవుడ్ పరిశ్రమకు ఉన్న చారిత్రక ప్రాధాన్యత దాని ద్వారా వచ్చే గ్లోబల్ రికగ్నిషన్ వేరుగా ఉంటుందని కొంద‌రు నిపుణులు వాదిస్తున్నారు.

కేవలం ఆర్థిక పరమైన అంశాలకే పరిమితం కాకుండా వెండితెరపై కనిపించే కీర్తి ప్రతిష్టలు సినిమాల ద్వారానే సాధ్యమవుతాయని పేర్కొంటున్నారు. అయినా? రణ్‌వీర్ అల్లాబాదియా లేవనెత్తిన అంశాలు మాత్రం సినీ రంగానికి, డిజిటల్ మాధ్యమాలకు మధ్య జరుగుతున్న ఆర్థిక పోటీకి అద్దం పడుతున్నాయి. భవిష్యత్తులో వినోద రంగంలో సంపాదన - కెరీర్ రూపకల్పన ఎలా మారబోతుందనేదానికి ఈ చర్చ స్పష్టమైన సంకేతంగా నిలుస్తోంది.

డిజిటల్ విప్లవం వేగవంతమైన తర్వాత కంటెంట్ క్రియేటర్లు యూట్యూబర్లుగా మాత్రమే కాకుండా, పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలకు యజమానులుగా మారుతున్నారు. సెలబ్రిటీలతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్న తీరు ఇండస్ట్రీ పెద్దలను కూడా ఆలోచింపజేస్తోంది. ఈ నేపథ్యంలో రణ్‌వీర్ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాకుండా నేటి వినోద రంగ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న మార్పులకు ప్రతిరూపంగా నిలుస్తున్నాయి.