లైంగిక వేధింపుల కేసులో స్టార్ డైరెక్టర్ కు భారీ షాక్.. అసలేం జరిగిందంటే?
మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన 'హేమ కమిటీ నివేదిక' తర్వాత ఒక్కో వివాదం బయటకు వస్తూనే ఉంది.
By: Madhu Reddy | 4 April 2026 11:27 PM ISTమలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన 'హేమ కమిటీ నివేదిక' తర్వాత ఒక్కో వివాదం బయటకు వస్తూనే ఉంది. తాజాగా ప్రముఖ దర్శకుడు, నటుడు రంజిత్ బాలకృష్ణన్ లైంగిక వేధింపుల కేసులో అరెస్టవ్వడం మాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోంది. ఒక యువ నటి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకోగా, కేరళ ఫిల్మ్ ఫెడరేషన్ ఆయనపై వేటు వేసింది. మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ ఉన్న ఒక స్టార్ దర్శకుడు ఇలాంటి ఆరోపణలతో అరెస్టవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
షూటింగ్ సెట్‌లో అనుచిత ప్రవర్తన.. డైరెక్టర్ అరెస్ట్:
ప్రముఖ మలయాళ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్‌ను కేరళ పోలీసులు కొచ్చిలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఒక సినిమా షూటింగ్ సెట్‌లో రంజిత్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఒక యువ నటి ఫిర్యాదు చేయడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఇక బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, ప్రాథమిక విచారణ నిమిత్తం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. హేమ కమిటీ నివేదిక వచ్చినప్పటి నుండి ఇండస్ట్రీలోని మహిళా కళాకారులు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయాల గురించి గళమెత్తుతుండటం గమనార్హం.
ఫిల్మ్ ఫెడరేషన్ భారీ షాక్.. సస్పెన్షన్ వేటు:
రంజిత్ అరెస్ట్ వార్త తెలియగానే ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ తక్షణమే స్పందించింది. ఆయన్ను ఫెడరేషన్ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చింది. ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి. ఉన్నికృష్ణన్ మాట్లాడుతూ.. తమ సభ్యులపై ఇలాంటి తీవ్రమైన లైంగిక ఆరోపణలు వచ్చినప్పుడు ఒక పద్ధతి ప్రకారం చర్యలు తీసుకుంటామని, అంతర్గత విచారణ పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇక ఒక పెద్ద దర్శకుడిపై ఇలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
పాత వివాదాలు.. చలనచిత్ర అకాడమీ పదవికి దూరం:
రంజిత్‌పై లైంగిక ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది ఆగస్టులో బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రా కూడా ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పట్లో ఆ గొడవ పెద్దది కావడంతో రంజిత్ తన కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ ఆరోపణలను ఆయన ఖండించినప్పటికీ, వరుసగా ఫిర్యాదులు వస్తుండటంతో ఆయన చిక్కుల్లో పడ్డట్లయింది. ఇక ఇప్పుడు తాజాగా మరో నటి చేసిన కంప్లైంట్‌తో పోలీసులు రంగంలోకి దిగడంతో ఆయన కెరీర్‌కు పెద్ద దెబ్బ తగిలినట్లయింది.
మూడు నేషనల్ అవార్డులు.. అద్భుతమైన కెరీర్:
రచయితగా, దర్శకుడిగా, నటుడిగా రంజిత్ బాలకృష్ణన్‌కు మలయాళంలో మంచి గుర్తింపు ఉంది. దాదాపు 35 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన, మూడు జాతీయ అవార్డులను కూడా అందుకున్నారు. మన తెలుగు ప్రేక్షకులకు కూడా 'అయ్యప్పనుమ్ కోషియుమ్', 'తలవన్' వంటి సినిమాల ద్వారా ఆయన సుపరిచితులే. ఇంతటి గొప్ప నేపథ్యం ఉన్న వ్యక్తిపై ఇలాంటి వేధింపుల కేసులు రావడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇక చట్టం తన పని తాను చేసుకుపోతుందని, విచారణలో నిజానిజాలు బయటపడతాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక సినీ రంగంలో మహిళల భద్రతపై మరోసారి పెద్ద చర్చకు ఈ ఘటన దారితీసింది.
