వర్మ కల్ట్ క్లాసిక్ తో డీసీ పోలిక!
మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు రంజిత్ శంకర్ తాజాగా చర్చనీయాంశంగా మారారు.
By: Srikanth Kontham | 11 Aug 2026 1:28 PM ISTమలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు రంజిత్ శంకర్ తాజాగా చర్చనీయాంశంగా మారారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ మాస్టర్‌పీస్ `సత్య` చిత్రంతో ఇటీవల విడుదలైన `డీసీ` సినిమాను పోల్చడం హాట్ టాపిక్ గా మారింది. ముప్పై ఏళ్ల క్రితం సాధారణ సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో `సత్య` సినిమా చూస్తున్నప్పుడు కలిగిన అదే తీవ్రమైన భావోద్వేగ అనుభూతిని `డీసీ` వీక్షిస్తున్నప్పుడు
అనుభవించినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ అరుదైన ప్రశంసతో `డీసీ` సినిమాపై ప్రేక్షకుల్లో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. వర్మ తెరకెక్కించిన `సత్య` చిత్రం భారతీయ గ్యాంగ్‌స్టర్ చిత్రాల శైలినే పూర్తిగా మార్చేసిన సరికొత్త సంచలనం. ముంబై అండర్‌వరల్డ్ నేపధ్యంలో నడిచే ఆ కథ, క్యారెక్టరైజేషన్లు, రియలిస్టిక్ మేకింగ్ విధానం ఆనాటి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సరిగ్గా అదే తరహాలో `డీసీ` చిత్రం కూడా ప్రేక్షకులను తన కథలో లీనం చేసుకునేలా చేయడంలో గ్రిప్పింగ్ నేరేషన్‌తో కట్టిపడేయడంలో సఫలమైందని రంజిత్ శంకర్ కొనియాడారు. వినోదాన్ని పంచ డమే కాకుండా సినిమా ముగిసిన తర్వాత కూడా ఆలోచింపజేసే ఆత్మశోధన లాంటి అనుభూతిని ఈ రెండు సినిమాలు ఇస్తాయని అభిప్రాయపడ్డారు.
ఒక క్రియేటివ్ డైరెక్టర్‌గా ఎంతో అనుభవమున్న రంజిత్ శంకర్ స్వయంగా ఒక సినిమాను మరో దిగ్గజ చిత్రంతో పోల్చడం సాధారణమైన విషయం కాదు. `సత్య` సినిమా సృష్టించిన సంచలనాలు, ఆ కాలంలో థియేటర్లలో కనిపించిన రెస్పాన్స్ ఆయన మనసులో చెరగని ముద్ర వేసాయని దీని ద్వారా స్పష్టమవుతోంది. దశాబ్దాలు గడిచినా అలాంటి రా ఏజ్ అండ్ రస్టిక్ మేకింగ్ మ్యాజిక్‌ను `డీసీ` చిత్రంలో చూసానని పేర్కొనడం ఆ సినిమా సాంకేతిక, సృజనాత్మక విలువలకు నిదర్శనంగా నిలుస్తోంది.
ఈ పోలిక కేవలం ప్రశంసకు మాత్రమే పరిమితం కాలేదు. సినిమా మేకింగ్‌లో డెప్త్ ఎంత ముఖ్యమో మరోసారి రుజువు చేసింది. భారీ బడ్జెట్లు, హంగుల కంటే కూడా బలమైన కథ, దానికి తగిన పాత్రల చిత్రణ, నిజాయితీతో కూడిన దర్శకత్వ ప్రతిభ సినిమాను ఏ స్థాయికి తీసుకెళ్లగలవో `సత్య` .. `డీసీ` చిత్రాలు నిరూపిస్తున్నాయి. కోలీవుడ్ నుంచి వస్తున్న ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు ఇతర భాషల సినీ ప్రముఖులను కూడా ఆకట్టుకుంటుండటం దక్షిణాది చిత్ర పరిశ్రమ ఐక్యతకు, కంటెంట్ ఆధారిత విజయాలకు ప్రతీకగా మారుతోంది.
ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో `డీసీ` సినిమా గురించిన చర్చ జోరుగా సాగుతోంది. సాధారణ సినీ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలోని క్రిటిక్స్ కూడా ఈ చిత్రాలపై విశ్లేషణలు ప్రారంభించారు. ఒక క్లాసిక్ సినిమా కలిగించిన జ్ఞాపకాలను మరో కొత్త సినిమా తట్టిలేపడం అంటే ఆ చిత్రం ఎంతటి బలమైన ప్రభావాన్ని చూపిందో అర్థం చేసుకోవచ్చు. ఈ తరహా రివ్యూలు సినిమా బాక్సాఫీస్ ప్రయాణానికి లాంగ్ రన్‌లో ఎంతగానో దోహదపడతాయి.
మొత్తానికి రామ్ గోపాల్ వర్మ సృష్టించిన ట్రెండ్‌ను స్ఫూర్తిగా తీసుకుంటూ వస్తున్న ఆధునిక చిత్రాలు ప్రేక్షకులను ఏ విధంగా కట్టిపడేస్తున్నాయో `డీసీ` మరోసారి నిరూపించింది. సీనియర్ దర్శకుల నుంచి ఇలాంటి ప్రశంసలు దక్కడం చిత్ర యూనిట్‌కు నైతిక స్థైర్యాన్ని ఇవ్వడమే కాకుండా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
