ఆ మిరుమిట్ల నెక్లెస్‌లో రాణి గారి కుమార్తె పేరు
ఉత్తమ నటులుగా షారూఖ్, విక్రాంత్ మాస్సే వేదికపై సందడి చేయగా, ఉత్తమ కథానాయికగా రాణీ ముఖర్జీ సందడి అంతా ఇంతా కాదు.
By: Sivaji Kontham | 24 Sept 2025 10:44 AM IST71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో మెరుపులు మిరిమిట్ల గురించి తెలిసిందే. ఉత్తమ నటులుగా షారూఖ్, విక్రాంత్ మాస్సే వేదికపై సందడి చేయగా, ఉత్తమ కథానాయికగా రాణీ ముఖర్జీ సందడి అంతా ఇంతా కాదు. మిసెస్ ఛటర్జీ vs నార్వే చిత్రంలో తన పాత్రకు గాను ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నప్పుడు రాణి ముఖర్జీ ఎంతో ఎగ్జయిటింగ్ గా కనిపించారు.
ఇక ఈ వేదిక కోసం రాణీజీ ధరించిన సబ్యసాచి చీర గురించి, తను ధరించిన స్పెషల్ నెక్లెస్ గురించి అహూతులు ముచ్చటించుకున్నారు. ముఖ్యంగా రాణీజీ ధరించిన కస్టమైజ్డ్ జ్యువెలరీ నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించడంలో విఫలం కాలేదు. అయితే రాణీజీ తన కుమార్తె `అదిర` పేరున్న కస్టమైజ్డ్ నెక్లెస్ ధరించి కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక అవార్డు వేడుకలో ఈ తరహాలో కనిపించడం నిజంగా రాణీజీకే చెల్లింది అంటూ కితాబిచ్చేస్తున్నారు. రాణీ ముఖర్జీ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ నుండి గోధుమ రంగు చీరను ఎంపిక చేసుకుంది. ఈ చీర అందమైన హస్తకళకు నివాళి. దీనికి ఎంబ్రాయిడరీ ఉన్న బంగారు అంచు ప్రత్యేక ఆకర్షణ. సబ్యసాచి చీరకు తగ్గట్టుగా డిజైనర్ బ్లౌజ్ ని కూడా రాణీజీ ధరించారు. జాతీయ చలనచిత్ర అవార్డులలో ఈ నెక్లెస్ ధరించడం సినిమా థీమ్ ని కూడా ఎలివేట్ చేసింది.. అదే సమయంలో తన బిడ్డపై తల్లి ప్రేమను కూడా హైలైట్ చేసింది.
అధికారుల కారణంగా దూరమైన తన పిల్లల కస్టడీ కోసం పోరాడే ఒక మహిళ కథతో మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే సినిమా తెరకెక్కింది.. నార్వేజియన్ అధికారుల నుంచి తన పిల్లల కస్టడీ కోసం పోరాడే శ్రీమతి ఛటర్జీ (రాణి ముఖర్జీ) ప్రయాణం ఎలా సాగింది? అనేదే ఈ చిత్రం. రాణీజీ అసాధారణ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు కురిసాయి. ఇప్పుడు ఉత్తమ నటిగా జాతీయ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా అందుకోవడం గొప్ప గౌరవాన్నిచ్చింది.
