టాలీవుడ్‌లో కొత్త ప్రమోషన్ ట్రెండ్.. ఇదేనా మార్కెటింగ్?
టాలీవుడ్‌లో సినిమా ప్రమోషన్స్ రోజురోజుకీ కొత్త రూపు దాల్చుతున్నాయి. ఒకప్పుడు టీజర్లు, ట్రైలర్లు, ప్రెస్‌మీట్లు, ఇంటర్వ్యూలతో మాత్రమే ప్రమోషన్స్ ఉండేవి.
By: Sravani Lakshmi Srungarapu | 27 Jun 2026 5:43 PM ISTటాలీవుడ్‌లో సినిమా ప్రమోషన్స్ రోజురోజుకీ కొత్త రూపు దాల్చుతున్నాయి. ఒకప్పుడు టీజర్లు, ట్రైలర్లు, ప్రెస్‌మీట్లు, ఇంటర్వ్యూలతో మాత్రమే ప్రమోషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని ఆడియన్స్ కు ఇంట్రెస్ట్ రేకెత్తించే వినూత్న ప్రచార పద్ధతులు ఎక్కువవుతున్నాయి. రియల్ లైఫ్ లో ఏదో సంచలన విషయం జరిగినట్టుగా మొదట సంకేతాలు ఇవ్వడం, ఆ తర్వాత అది సినిమా లేదా వెబ్ సిరీస్ ప్రచారంలో భాగమని వెల్లడించడం ఇప్పుడు తరచూ కనిపిస్తున్న ట్రెండ్‌గా మారింది.
ఈసారి అలాంటి ప్రమోషనల్ స్ట్రాటజీతో వార్తల్లో నిలిచారు రంగస్థలం మహేష్. జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని, రంగస్థలం సినిమా తర్వాత ప్రేక్షకుల్లో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న ఆయన ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు. లైఫ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని, తాను నిజం చెప్పే వరకు ఎలాంటి ఊహాగానాలు చేయవద్దని చేసిన కామెంట్స్ అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. కొందరు ఆయన పర్సనల్ లైఫ్ లో ఏదైనా సమస్య ఎదురైందా అనే సందేహాలు కూడా వ్యక్తం చేశారు.
అయితే ఇప్పుడా సస్పెన్స్‌కు తెరపడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఛాయ్ షాట్స్ లో విడుదల కానున్న D ఫర్ డివోర్స్ అనే సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగానే ఆ వీడియో రూపొందించినట్లు మరో వీడియో ద్వారా వెల్లడించారు. ఇందులో రంగస్థలం మహేశ్, తన భార్య మధ్య తలెత్తిన విభేదాలను ప్రముఖ సైకియాట్రిస్ట్ సమక్షంలో చూపిస్తూ కథపై ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. చివర్లో వెబ్ సిరీస్‌ను చూడాలంటూ ప్రమోషన్‌ను రివీల్ చేశారు.
అయితే ఈ ప్రచార విధానంపై సోషల్ మీడియాలో మిక్డ్స్ రియాక్షన్ వ్యక్తమవుతోంది. మొదట నిజంగానే పర్సనల్ ప్రాబ్లమ్ ఎదురైందేమోనని భావించిన కొందరు నెటిజన్లు, చివరికి అది కేవలం ప్రమోషన్ మాత్రమే అని తేలడంతో నిరాశ వ్యక్తం చేశారు. పర్సనల్ ఎమోషన్స్ ను తలపించే అంశాలను ప్రచారానికి ఉపయోగించడం సరైన విధానం కాదని కొందరు అభిప్రాయపడుతుండగా, మరోవైపు ఆడియన్స్ దృష్టిని ఎట్రాక్ట్ చేయడానికి ఇది కూడా ఒక మార్కెటింగ్ టెక్నిక్‌నే అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో చిన్న సినిమాల నుంచి భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుల వరకు అందరూ విభిన్నమైన ప్రచార వ్యూహాలను అనుసరిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా కంటెంట్ రూపొందించడం, ప్రేక్షకుల్లో చర్చకు దారితీసే అంశాలను ముందుకు తేవడం, చివర్లో అసలు ఉద్దేశాన్ని వెల్లడించడం వంటి విధానాలు పెరుగుతున్నాయి. అయితే ఈ తరహా ప్రమోషన్స్ కొంతవరకు హైప్ తీసుకొచ్చినా, ప్రేక్షకుల నమ్మకాన్ని దెబ్బతీయకుండా ఉండేలా క్రియేటివిటీతో పాటూ బాధ్యత కూడా అవసరమనే అభిప్రాయం సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
