క్రేజీ బయోపిక్ వదులుకున్న స్టార్ హీరో
బాలీవుడ్ లెజెండరీ నటుడు కిషోర్ కుమార్ జీవిత విశేషాలతో బయోపిక్ తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నారు అనురాగ్ బసు.
By: Sivaji Kontham | 1 Aug 2025 4:00 AM ISTబాలీవుడ్ లెజెండరీ నటుడు కిషోర్ కుమార్ జీవిత విశేషాలతో బయోపిక్ తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నారు అనురాగ్ బసు. అయితే ఈ ప్రాజెక్ట్ పదేళ్లుగా వాయిదా పడుతూనే ఉంది. ముఖ్యంగా ఈ సినిమాకి కథానాయకుడు సెట్టవ్వడం లేదు. పలువురు హీరోలను ఒప్పించేందుకు దర్శకుడు అనురాగ్ బసు ఇప్పటికే ప్రయత్నించారు. కానీ చివరికి రణబీర్ కపూర్ తో ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలనుకున్నాడు. రణబీర్ వైపు నుంచి ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయినా చివరి నిమిషంలో అనురాగ్ ని దురదృష్టం వరించింది.
అంతా అనూహ్యం:
రణబీర్ అనూహ్యంగా నితీష్ తివారీ `రామాయణం` ప్రాజెక్టును ఫైనల్ చేసి సెట్స్ పైకి వెళ్లిపోయాడు. దీంతో అనురాగ్ తన ప్రయత్నాలను ఆపేసారు. రామాయణం చేయాలా? కిషోర్ కుమార్ బయోపిక్ చేయాలా? ఈ రెండిటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోమంటే, రణబీర్ నిస్సందేహంగా `రామాయణం`ని ఎంపిక చేసుకున్నాడని బసు తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. రామాయణం కోసం రణబీర్ కిషోర్ కుమార్ బయోపిక్‌ను వదిలివేసినట్లు అనురాగ్ బసు వెల్లడించారు. అతడి ఎంపిక కూడా సరైనదేనని అంగీకరించారు. అయితే కిషోర్ కుమార్ బయోపిక్ అటకెక్కలేదని, రణబీర్ తో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అనురాగ్.
కలగానే మిగిలిపోయింది..!
రెండు అవకాశాలు ఒకేసారి... ఎంపిక చేసుకోవడం చాలా కష్టమేనని కూడా అనురాగ్ అన్నారు. తిరిగి మేమిద్దరం కలిసి పని చేయాలనుకున్నా దానికి సమయం పడుతుందని కూడా వ్యాఖ్యానించారు. అయితే రణబీర్ తో కలిసి తప్పనిసరిగా పని చేస్తానని కూడా అన్నారు. అనురాగ్ గతంలో రణబీర్ తో బర్ఫీ, జగ్గా జాసూస్ లాంటి చిత్రాలకు పని చేసాడు. ఈ కలయికపై అభిమానుల్లో ఉత్సాహం ఉంది. కానీ ఇది వెంటనే సాధ్యపడటం లేదు. కిషోర్ కుమార్ బయోపిక్ ని పూర్తి చేయాలన్న బసు కల వెంటనే నెరవేరడం లేదు.
అప్పటివరకూ వెయిట్ చేస్తాడా?
మరోవైపు రణబీర్ ప్రధాన పాత్రలో `రామాయణం` రెండు భాగాలుగా తెరకెక్కనుంది. మొదటి చిత్రం 2026 దీపావళికి, రెండో చిత్రం 2027 దీపావళికి విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు షెడ్యూలింగ్ చేసారు. దాని ప్రకారం.. రణబీర్ 2027 దీపావళికి కొన్ని నెలల ముందు తన కాల్షీట్లను ఇతరులకు కేటాయించగలడు. 2027 దీపావళి తర్వాత పూర్తిగా అందుబాటులోకి వస్తాడు. అప్పటికి అనురాగ్ బసు కిషోర్ కుమార్ బయోపిక్ ని వేరొక హీరోతో పూర్తి చేయకుండా వెయిట్ చేస్తాడా? అన్నది వేచి చూడాలి. లెజెండరీ గాయకుడు కిషోర్ కుమార్ పాత్ర రణబీర్ కోసం వెయిట్ చేస్తుందా? లేదా? అన్నది ఇప్పటికి సస్పెన్స్.
