రామాయణ తర్వాత వారణాసి... జక్కన్న బ్యాలన్స్ చేసేనా?
రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తూ ఉండగా, సీత పాత్రను సాయి పల్లవి పోషిస్తోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయింది.
By: Ramesh Palla | 28 Nov 2025 8:00 PM ISTహిందూ ఇతిహాసాలు, పురాణాలపై ఎన్నో సినిమాలు వచ్చాయి. వందల ఏళ్లుగా సినిమాలు, నాటకాల రూపంలో రామాయణం, మహాభారతం కథలను నటీనటులు చెబుతూనే ఉన్నారు. రాముడు, కృష్ణుడు అంటే ఇలా ఉంటారు అని నాటకాలు, సినిమాల ద్వారా ఒక మార్క్ క్రియేట్ చేశారు. రాముడి పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించడంతో, రాముడు అంటే ఇలాగే ఉంటాడు అని తెలుగు వారు గుర్తుంచుకునేలా చేశారు. రాముడి పాత్రను ఆ తర్వాత చాలా మంది నటులు చేశారు. అందులో కొందరు సక్సెస్ అయితే కొందరు విమర్శలు ఎదుర్కొన్నారు. బాలకృష్ణ ఈ జనరేషన్ రాముడు అని చాలా మంది అంటూ ఉంటారు. కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ రామాయణం ప్రేక్షకుల ముందుకు సినిమా రూపంలో రాబోతున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ నితేష్ తివారి దర్శకత్వంలో రామాయణ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.
రామాయణ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్
రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తూ ఉండగా, సీత పాత్రను సాయి పల్లవి పోషిస్తోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయింది. సినిమాను మూడు నాలుగు పార్ట్‌లుగా విడుదల చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే కాకుండా రామాయణ సినిమా దాదాపుగా రూ.4000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది అనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయంలో క్లారిటీ లేదు. ప్రధానంగా రామాయణ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా ఎలా కనిపిస్తాడు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. సాధారణంగానే రాముడు అంటే చాలా సింపుల్‌గా, చూడగానే ఒక కూల్ పర్సనాలిటీ అన్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నింటిలోనూ అలాగే చూపించారు, కనుక అదే కంటిన్యూ కావాల్సిందే. కనుక ఇప్పటికే లీక్ అయిన రామాయణ లుక్స్ చూస్తే రణబీర్ కపూర్ కూల్ అండ్ సింపుల్ లుక్‌లోనే కనిపించబోతున్నాడు.
వారణాసి సినిమాలో రాముడిగా మహేష్ బాబు..
రామాయణ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా కనిపించబోతున్న ఈ సమయంలోనే వారణాసి సినిమాలోనూ మహేష్ బాబు రాముడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన వారణాసి గ్లిమ్స్ వీడియోను చూస్తే మహేష్ బాబు సినిమా మొత్తం కాకున్నా కొంత మేరకు రాముడి గెటప్‌లో కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే కనుక నిజం అయితే రాముడి పాత్రలో మహేష్ బాబు ఎలా ఉంటాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు రాముడి పాత్రలో పూర్తి స్థాయిలో కనిపించబోతుండటం ఇదే మొదటి సారి కావడంతో అభిమానులతో పాటు అంతా ఆసక్తిగా సినిమా వైపు చూస్తున్నారు. మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ రాముడి పాత్రలో కనిపిస్తే చూడాలని చాలా కాలంగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ కోరిక నెరవేరబోతున్న నేపథ్యంలో అభిమానులు ఆనందంగా ఉన్నారు.
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి...
ఈ సమయంలో వారణాసి దర్శకుడు రాజమౌళికి పెద్ద సవాల్ ఎదురు కాబోతుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. 2026 నవంబర్‌లో రామాయణ మొదటి పార్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 2027లో వారణాసి సినిమా రాబోతుంది. అంటే వారణాసి సినిమా కంటే కొన్ని నెలల ముందు రామాయణ సినిమా రాబోతుంది. అంటే మొదటే రణబీర్ కపూర్ ను రాముడిగా ప్రేక్షకులు చూడబోతున్నారు. కనుక రాముడు అంటే ఇలా ఉండాలి అని కొత్తగా ప్రేక్షకులు ఒక ఊహకు, అంచనాకు వస్తారు. అలాంటి సమయంలో మహేష్ బాబును రాముడిగా చూపించడం అంటే కాస్త రిస్క్ తో కూడుకున్న పని. ఆ విధంగా రాముడిగా మహేష్ ను చూపించలేక పోతే కచ్చితంగా ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వస్తుంది. దాన్ని జక్కన్న ఎలా బ్యాలన్స్ చేస్తాడా అనేది చూడాలి. వారణాసిలో రాముడిగా మహేష్ బాబు కనిపించనుండగా, సీతగా ఎవరిని చూస్తాము అనేది సినిమా విడుదలైతే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. సినిమాలో రాముడి పాత్ర ఎంత సమయం ఉంటుంది, రాముడిగా మహేష్ బాబు ఎంత సమయం కనిపిస్తాడు అనేది కూడా కీలక విషయం.
