ఖాన్‌ల త్రయం రీప్లేస్‌మెంట్ ఛాన్స్ ఈ ఇద్దరిలో ఎవరికి?
అయితే ఈ సినిమా ప్రారంభంలోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటేనే ఆశించినది జరుగుతుంది. నెగెటివ్ టాక్ అస్సలు రాకూడదు.
By: Sivaji Kontham | 30 Oct 2026 3:00 PM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ పరంగా గత మూడు దశాబ్దాలుగా షారూఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ అనే త్రయం ఏకచ్ఛత్రాధిపత్యం కొనసాగించింది. పాన్ ఇండియన్ ట్రెండ్ ఒక్కసారిగా అంతా మార్చేయక ముందు మల్టీప్లెక్స్‌లు, ఓటీటీ విప్లవాలు .. మారిన ప్రేక్షకుల అభిరుచులను తట్టుకుని నిలబడిన ఈ దిగ్గజాల స్థానాన్ని ఇప్పుడు రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్ అనే నవతరం హీరోలు సవాల్ చేస్తున్నారని అభిమానులు నమ్ముతున్నారు. దశాబ్దాలుగా హిందీ హీరోలకు అందని ద్రాక్షగా మిగిలిన దక్షిణాది మార్కెట్‌ను `దురంధర్` ఫ్రాంచైజీతో రణ్‌వీర్, `యానిమల్` చిత్రంతో రణ్‌బీర్ కొల్లగొట్టారు. ఆ ఇద్దరూ హిందీ సినిమా బాక్సాఫీస్ సమీకరణాలను పూర్తిగా మార్చివేశారు.
రాక్‌స్టార్, సంజు, యానిమల్ వంటి వైవిధ్యమైన చిత్రాలతో కేవలం అర్బన్ మల్టీప్లెక్స్ హీరోగానే కాకుండా.. మాస్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించి భారీ ఓపెనింగ్స్ సాధించగల సత్తా ఉన్న స్టార్‌గా రణ్‌బీర్ నిరూపించుకున్నారు. షారూఖ్ గ్లోబల్ రొమాంటిక్ ఇమేజ్ లేదా సల్మాన్ మాస్ ఇమేజ్‌లకు భిన్నంగా జోనర్లకతీతంగా ప్రయోగాలు చేస్తూ అతడు ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా `యానిమల్` తెచ్చిన ఊపుతో ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక పాన్-ఇండియా చిత్రం `రామాయణం`పై రణ్‌బీర్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా ప్రారంభంలోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటేనే ఆశించినది జరుగుతుంది. నెగెటివ్ టాక్ అస్సలు రాకూడదు.
షారూఖ్‌కు అంతర్జాతీయ క్రేజ్, అమీర్‌కు చైనా మార్కెట్ విజయం, సల్మాన్‌కు మాస్ హిట్లు ఉన్నప్పటికీ... ఖాన్ ల త్రయం ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో ఒక భారీ పౌరాణిక ఫ్రాంచైజీని నిర్మించకపోవడం రణబీర్‌కి కలిసొచ్చే అంశం. రణ్‌వీర్, రణ్‌బీర్‌లు కేవలం నటుడి ఇమేజ్ చుట్టూ తిరిగే సినిమాలే కాకుండా ఐపీ (IP) ఆధారిత బ్రాండ్.. బలమైన కథల చుట్టూ నడిచే కొత్త సినిమా విధానానికి తెరలేపారన్న చర్చ జరుగుతోంది. ఐమాక్స్ వంటి ప్రీమియం ఫార్మాట్‌లు, బహుభాషా విడుదలలతో వీరి సినిమాలను గ్లోబల్ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
అయితే ఈ భారీ ప్రాజెక్ట్‌ల విజయానికి కేవలం రికార్డు కలెక్షన్లు మాత్రమే కొలమానాలు కావు. వీక్‌డేస్ స్టెబిలిటీ, భారతీయ డయాస్పోరాను దాటి వచ్చే గ్లోబల్ ఆడియన్స్ కలెక్షన్స్.. డిస్ట్రిబ్యూటర్ల ప్రాఫిటబిలిటీ అత్యంత ముఖ్యం. రామాయణం వంటి భారీ చిత్రాల విషయంలో కేవలం నటన, విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే కాకుండా కథలోని ఆత్మను ఎంతగా సాధారణ ప్రజలు కూడా నమ్మేలా చూపారనే దానిపైనే అసలు సిసలు విజయం ఆధారపడి ఉంటుంది. అంతేకాదు.. పెద్ద హైప్ తో వచ్చే `రామాయణం` తర్వాత రణ్‌బీర్ నటించే సాధారణ, ఫ్రాంచైజీయేతర సినిమా సాధించే విజయమే అతడి నిజమైన సొంత బాక్సాఫీస్ స్టామినాను స్పష్టం చేస్తుంది.
ఈ పరిణామాలన్నీ ఖాన్‌లు దశాబ్దాలుగా సంపాదించుకున్న గుర్తింపును లేదా వారి లెగసీని ఒక్కసారిగా చెరిపివేయలేవు. కానీ ఖాన్‌లను ఓడించడం లేదా రీప్లేస్ చేయడం కంటే ఒక భారతీయ నటుడు అంతర్జాతీయంగా ఏ స్థాయికి చేరగలడనేది ఇక్కడ అసలు ప్రశ్న. పాత సూపర్ స్టార్ల ర్యాంకింగ్స్‌ను అధిగమించడంతో పాటు, తమకంటూ ఒక సరికొత్త గ్లోబల్ సూపర్‌స్టార్‌డమ్ కేటగిరీని సృష్టించుకోవడంలో రణ్‌వీర్, రణ్‌బీర్‌లు భిన్నంగా ప్రయత్నిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఏదైనా పాన్ ఇండియా విజయం దక్కిన తర్వాత దానిని సుదీర్ఘ కాలం నిలబెట్టుకుని సత్తా చాటాల్సిన బాధ్యత వీరిపై ఉంది.
