రణ్‌బీర్ కెరీర్‌లో కొత్త గేమ్.. భారీ సినిమాలే టార్గెట్‌గా బిగ్ ప్లాన్!
ఒక సినిమా పూర్తయ్యేలోపే మరో భారీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టుకోవడం చూస్తుంటే, రణ్‌బీర్ తన కెరీర్‌ను చాలా క్లియర్ ప్లానింగ్‌తో ముందుకు తీసుకెళ్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
By: Sravani Lakshmi Srungarapu | 20 Aug 2026 12:19 PM ISTబాలీవుడ్‌లో ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ కెరీర్ ఒక ఇంట్రెస్టింగ్ ఫేజ్‌లోకి వెళ్తోంది. గత కొంతకాలంగా విభిన్న కథలు, భారీ స్కేల్ ఉన్న ప్రాజెక్టులను ఎంచుకుంటున్న ఈ స్టార్ హీరో.. ఇప్పుడు వరుసగా క్రేజీ కాంబినేషన్లతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఒక సినిమా పూర్తయ్యేలోపే మరో భారీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టుకోవడం చూస్తుంటే, రణ్‌బీర్ తన కెరీర్‌ను చాలా క్లియర్ ప్లానింగ్‌తో ముందుకు తీసుకెళ్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం రణ్‌బీర్ చేతిలో ఉన్న ప్రాజెక్టులను పరిశీలిస్తే.. ఒక్కో సినిమా ఒక్కో ప్రత్యేక ప్రపంచాన్ని పరిచయం చేయబోతోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో రెండు భాగాలు కలిగిన మైథలాజికల్ ఎపిక్ రామాయణలో నటిస్తున్న విషయం తెలిసిందే. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ అండ్ వార్ ఒక విభిన్నమైన కథా నేపథ్యాన్ని కలిగి ఉండగా, సందీప్ రెడ్డి వంగా రూపొందించనున్న యానిమల్ పార్క్ పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. వీటికి తోడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న బ్రహ్మాస్త్ర2 కూడా అతని లైనప్‌లో చేరుతోంది. దీన్ని బట్టి చూస్తుంటే రణ్‌బీర్ ఇప్పుడు ఎక్కువగా ఫ్రాంచైజ్ సినిమాలపై ఫోకస్ చేసినట్టు అనిపిస్తోంది.
ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. రణ్‌బీర్ కేవలం వరుస సినిమాలు చేయడం మాత్రమే కాకుండా, ఒక్కో ప్రాజెక్ట్‌తో తన మార్కెట్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే భారీ ఫ్రాంచైజీలు, స్టార్ డైరెక్టర్లతో కలిసి పనిచేస్తున్న ఆయన.. ఫ్యూచర్‌లో తనను ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరోగా కాకుండా, భారీ సినిమాల ముఖచిత్రంగా నిలబెట్టే దిశగా అడుగులు వేస్తున్నారనే డిస్కషన్ మొదలైంది.
ఇక బ్రహ్మాస్త్ర2 విషయంలో మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో దీపికా పదుకొణె కీలక పాత్రలో కనిపించే అవకాశాలపై డిస్కషన్ జరుగుతోంది. అమృత పాత్ర కోసం ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. అదే నిజమైతే రణ్‌బీర్, దీపిక కాంబినేషన్‌కు మరోసారి భారీ స్థాయిలో క్రేజ్ రావడం ఖాయం. ఆల్రెడీ బ్రహ్మాస్త్రలో రణ్‌బీర్- అలియా భట్ కాంబినేషన్ కొనసాగుతుండగా, దీపిక చేరిక సినిమాపై అంచనాలను మరింత పెంచే అంశంగా మారొచ్చు.
మరోవైపు రణ్‌బీర్ ఒకేసారి ఇంతటి భారీ ప్రాజెక్టులను ఎలా బ్యాలెన్స్ చేస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. షూటింగ్ షెడ్యూల్స్, క్యారెక్టర్ల కోసం అవసరమైన మేకోవర్స్, డైరెక్టర్ల డిమాండ్లు.. ఇలా ప్రతి సినిమాకు స్పెషల్ కమిట్‌మెంట్ అవసరం. అయినప్పటికీ ఈ లైనప్ చూస్తుంటే రణ్‌బీర్ కెరీర్‌ను కేవలం సినిమాల నెంబర్‌తో కాకుండా.. వాటి స్థాయి, కాంబినేషన్, ఫ్రాంచైజీ విలువ ఆధారంగా నిర్మించుకునే ప్రయత్నంలో ఉన్నట్టు స్పష్టమవుతోంది.
