ఆకతాయి హీరోలో అనూహ్య మార్పులు.. కారణం తెలిస్తే షాక్!
ఈ పాత్ర కోసం రణబీర్ కపూర్ తన జీవనశైలిని పూర్తిగా మార్చుకున్నారు. శ్రీరాముడి పాత్రకు న్యాయం చేయాలంటే కేవలం నటన సరిపోదని.. మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆ పాత్రతో అనుసంధానం కావాలని ఆయన నమ్ముతున్నారు.
By: Sivaji Kontham | 3 April 2026 1:00 AM ISTగతం గతః .. వర్తమానంలో మనం ఏమిటి? అనేదే ముఖ్యం! భారతీయ చలనచిత్ర రంగంలో అగ్ర కథానాయకుడిగా వెలుగుతున్న రణబీర్ కపూర్ జీవితంలో ఇప్పుడు ఒక అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు అఫైర్ల ఎంపరర్‌గా, ఆకతాయి హీరోగా ముద్రపడిన రణబీర్ ఇప్పుడు పురాణ పురుషుడు శ్రీరాముడి పాత్రలో నటించడం పెను మార్పునకు కారణమైంది. ఆయన ఆధ్యాత్మికత బాట పట్టారు. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `రామాయణ` చిత్రం రణబీర్ వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చివేసిందని చెప్పాలి. కేవలం మేకప్ వేసుకుని కెమెరా ముందుకు రావడం మాత్రమే కాకుండా.. ఆ పాత్రలోని పవిత్రతను కాపాడటం తన బాధ్యతగా ఆయన భావిస్తున్నారు.
ఈ పాత్ర కోసం రణబీర్ కపూర్ తన జీవనశైలిని పూర్తిగా మార్చుకున్నారు. శ్రీరాముడి పాత్రకు న్యాయం చేయాలంటే కేవలం నటన సరిపోదని.. మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆ పాత్రతో అనుసంధానం కావాలని ఆయన నమ్ముతున్నారు. ఇందులో భాగంగానే అతడు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటూ అత్యంత క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని గడుపుతున్నారు. కోట్లాది మంది ఆరాధించే దేవుడి పాత్రను పోషిస్తున్నప్పుడు.. ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తన ప్రథమ `ధర్మం` అని స్పష్టం చేశారు.
నిజానికి రణబీర్‌లో ఈ మార్పునకు బీజం ఆయన వివాహంతోనే పడింది. ఆలియా భట్‌ను పెళ్లాడి తండ్రి అయిన తర్వాత అతడిలో పరిణతి కనిపిస్తోందని అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే `రామాయణం` ప్రాజెక్ట్ ఆ మార్పును మరింత ముందుకు తీసుకెళ్లింది. తన వృత్తిని అత్యంత నిజాయితీతో.. సత్యంతో నిర్వహించడమే తన అసలైన ధర్మమని రణబీర్ పేర్కొనడం గమనార్హం. షూటింగ్ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ.. రాముడిలోని శాంత గుణాన్ని అలవర్చుకోవడానికి అతడు నిరంతరం ప్రయత్నిస్తున్నారు.
రణబీర్ తన అంకితభావాన్ని చాటుకుంటూ.. ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం తన పూర్తి సమయాన్ని, శక్తిని కేటాయిస్తున్నారు. భారతీయ సంస్కృతిలో భాగమైన రామాయణాన్ని నేటి తరానికి అందించడం ఒక గొప్ప బాధ్యతగా ఆయన స్వీకరించారు. అతడు ఈ పాత్రకు తగడు! అని ప్రముఖ నటుడు ఒకరు గతంలో విమర్శించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ఈ పాత్రకు సరిపోనని తొలుత భావించినట్టు రణబీర్ స్వయంగా తెలిపారు. కానీ చివరకు దానిని ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. విమర్శలపై సానుకూలంగా స్పందిస్తూ.. తన పని ద్వారానే సమాధానం చెప్పడం తన పద్ధతి అని అతడు వెల్లడించారు. సెట్స్‌పై నిరాడంబరంగా ఉంటూ.. దర్శకుడు నితేష్ తివారీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన కర్తవ్యంగా అతడు పని చేస్తున్నారు.
అంతిమంగా సినిమా పూర్తయిన తర్వాత ప్రతి ప్రేక్షకుడు తనలో రాముడిని చూసుకునేలా నటించడమే తన లక్ష్యమని రణబీర్ కపూర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రామాయణ కథ నుండి రాముడి జీవితం నుండి మంచి విషయాలను నేర్చుకుని వాటిని ఆచరించడం తన వ్యక్తిగత ధర్మమని ఆయన వివరించారు. ఒకప్పటి ఆకతాయి హీరోలో కనిపిస్తున్న ఈ సాత్విక మార్పు చూసి చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులు కూడా ఆశ్చర్యపోతూ రణబీర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ మార్పు కేవలం సినిమాకే కాకుండా అతడి వ్యక్తిగత జీవితానికి కూడా ఒక మంచి మలుపుగా నిలవనుంది.
