బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!
అలాంటి కృత్రిమమైన, అనుకరణ పేర్లు తనను తాను ఓ దేశీయ చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితం చేసినట్లు అనిపిస్తాయని రణ్‌బీర్ అభిప్రాయపడ్డారు.
By: Srikanth Kontham | 3 Nov 2026 1:53 PM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా సూచించడానికి ఉపయోగించే బాలీవుడ్ అనే పదంపై నటుడు రణ్‌బీర్ కపూర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం హిందీ చిత్ర పరిశ్రమకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న భాషల సినిమాలను ఒకే గాటన కట్టే ఈ పదంపై రణబీర్ అసంతృప్తి వెళ్లగక్కారు. హాలీవుడ్ పేరుకు డెరివేటివ్‌గా పుట్టుకొచ్చిన ఈ పదాన్ని తాను ఇష్టపడనని కేవలం ఒక ప్రాంతీయ పరిశ్రమకు చెందిన స్టూడియో స్టార్‌గా కాకుండా భారతీయ సినిమా ప్రతినిధిగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నట్లు రణబీర్ స్పష్టం చేశారు.
ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం `రామాయణం` ప్రమోషన్లలో భాగంగా లండన్ వెళ్లిన రణ్‌బీర్ కపూర్.. ప్రముఖ బ్రిటిష్ మీడియా సంస్థ ఐటీవీ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయ చిత్రాలను పశ్చిమ దేశాల్లో వర్ణించడానికి సాధారణంగా వాడే బాలీవుడ్ అనే అంబ్రెల్లా పదంపై మీకు ఎందుకు ఆసక్తి లేదనే ప్రశ్న ఎదురైనప్పుడు రణ్‌బీర్ ఈ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆ పదం కేవలం ముంబైని అప్పట్లో బాంబేగా పిలవడం వల్ల హాలీవుడ్‌ను అనుకరిస్తూ వచ్చిందేనని టాలీవుడ్ వంటి పేర్లు కూడా అలానే పుట్టాయని గుర్తుచేశారు.
అలాంటి కృత్రిమమైన, అనుకరణ పేర్లు తనను తాను ఓ దేశీయ చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితం చేసినట్లు అనిపిస్తాయని రణ్‌బీర్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఎన్నో రకాల సంస్కృతులు, భాషలు, విభిన్న రాష్ట్రాలు ఉన్నప్పటికీ మనమందరం కళను సృష్టించాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. కళకు ఎల్లలు, సరిహద్దులు ఉండవని, బలమైన రూట్స్ ఉన్న సంస్కృతి ఆధారంగా కథలను తెరకెకిస్తే ప్రపంచం మొత్తం దానికి కనెక్ట్ అవుతుందని ఉద్ఘాటించారు. కొరియన్ సినిమాలు `క్రౌచింగ్ టైగర్`, `హిడెన్ డ్రాగన్` వంటి చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించడాన్ని ఈ సందర్భంగా ఉదాహరణగా పేర్కొన్నారు.
గ్లోబల్ ఆడియెన్స్‌ను గుడ్డిగా ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో కాకుండా మన మూలాలను, స్థానిక సంస్కృతిని అత్యంత ప్రామాణికంగా చెప్పడమే ముఖ్యం అని రణ్‌బీర్ నొక్కిచెప్పారు. భారతీయ చలనచిత్ర రంగం కేవలం ఒక్క నగరానికో ఒక్క భాషకో పరిమితం కాదని ఇది దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహించే పెద్ద శక్తి అని వెల్లడించారు. గ్లోబల్ మీడియా వేదికలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చనీయాంశంగా మారాయి.
