రామాయణ టీజర్‌కు ఫిదా అయిన సీతమ్మ… యూటర్న్ తీసుకున్న దీపిక
బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ చర్చ కొనసాగుతోంది.
By: Sravani Lakshmi Srungarapu | 3 April 2026 5:00 PM ISTబాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా టీజర్ రిలీజైన తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపిస్తున్న ఈ విజువల్ ఎపిక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ఈ టీజర్‌పై స్పందించిన ప్రముఖ నటి దీపికా చిఖ్లియా వ్యాఖ్యలు ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారాయి.
రామాయణ టీజర్ పై ప్రశంసలు
1980వ దశకంలో రామాయణ్ సీరియల్‌లో సీత పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆమె, తొలుత కొత్త రామాయణాల నిర్మాణంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజా టీజర్ చూసిన తర్వాత ఆమె తన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకోవడం గమనార్హం. ఆమె రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రామాయణ టీజర్‌లోని గ్రాండియర్‌ను ప్రశంసించారు. టీజర్ చాలా అద్భుతంగా ఉందని, విజువల్స్ చాలా రిచ్‌గా కనిపిస్తున్నాయని, ఈ సినిమాను ఎంతో శ్రద్ధతో రూపొందించినట్లు అనిపిస్తోందని, ఈ సినిమాను చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. గతంలో రామాయణ కథను పదే పదే తెరపైకి తీసుకురావడాన్ని వ్యతిరేకించిన ఆమె నుంచి వచ్చిన ఈ పాజిటివ్ రెస్పాన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
కథా సారాంశం దెబ్బతింటుందని విమర్శలు
గతంలో దీపికా చిఖ్లియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రామాయణాన్ని మళ్లీ మళ్లీ తెరకెక్కించడం వల్ల అందులోని కథా సారాంశం దెబ్బతింటోందంటూ విమర్శించారు. ముఖ్యంగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాపై కూడా ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు రామాయణ డైరెక్టర్ నితేష్ తివారీ చూపించిన విజన్, టీజర్‌లో కనిపించిన టెక్నికల్ క్వాలిటీ ఆమె అభిప్రాయాన్ని మార్చినట్లుగా తెలుస్తోంది.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను నితేష్ తివారీ కేవలం సినిమాగా కాకుండా ఒక ఎమోషనల్ జర్నీగా మలుస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్‌ను అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్న DNEG సంస్థ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. మ్యూజిక్ పరంగా కూడా రామాయణ సినిమా భారీ స్థాయిలో ఉండనుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తో పాటూ, ప్రపంచ ప్రసిద్ధ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ కలిసి రామాయణకు సంగీతం అందిస్తున్నారు.
నితేష్ ఏడేళ్ల కష్టం
టీజర్ లాంచ్ సందర్భంగా నితేష్ తివారీ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ కోసం తాను ఏడు సంవత్సరాలుగా కష్టపడుతున్నానని వెల్లడించారు. నిర్మాత నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ మనం రామాయణాన్ని ఎంచుకోమని, రామాయణమే మనల్ని ఎంచుకుంటుందని చెప్పడం ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న నమ్మకాన్ని స్పష్టం చేస్తోంది. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్, అగ్ర తారాగణం, అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ టీమ్ అన్నీ కలిపి విమర్శకులను సైతం మెప్పిస్తూ ప్రశంసల్ని అందుకుంటూ ఇండియన్ సినీ హిస్టరీలో ఓ మైలురాయిగా నిలవాలనే లక్ష్యంతో తెరకెక్కుతుంది.
