Begin typing your search above and press return to search.

రామాయ‌ణం రిలీజ్ కు ముందే మొద‌లైన కాక‌!

బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అత్యంత ప్రతి ష్టాత్మక చిత్రం `రామాయణం`.

By:  Srikanth Kontham   |   3 Aug 2026 11:55 PM IST
రామాయ‌ణం రిలీజ్ కు ముందే మొద‌లైన కాక‌!
X

బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అత్యంత ప్రతి ష్టాత్మక చిత్రం `రామాయణం`. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి విమర్శలతో వివాదాల వలయంలో చిక్కుకుంటుంది. తాజాగా శ్రీ రామ్‌లీలా మహాసంఘ్ సినిమా విడుదలకు ముందే తమకు ప్రత్యేకంగా ప్రదర్శిం చాలని డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. శ్రీ రామ్‌లీలా మహాసంఘ్ - పురాతన ఢిల్లీకి చెందిన లవ్ కుష్ రామ్‌లీలా అధ్యక్షుడు అర్జున్ కుమార్ ఈ మేరకు చిత్రబృందానికి అధికారికంగా లేఖ రాశారు.

చిత్ర ట్రైలర్‌లో శ్రీరాముని పాత్రను చూపించిన తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్లప్పుడూ హుందాగా, ప్రశాంతంగా ఉండే శ్రీరాముని పాత్రలో ఎలాంటి భావోద్వేగాలు సరిగ్గా కనిపించలేదని పైగా శత్రువులను సంహరించేందుకు ఆగ్రహంతో ప్రతిజ్ఞ చేస్తున్నట్లు చూపించడం భారతీయ సాంప్రదాయ విలువులకు విరుద్ధంగా ఉందని ఆక్షేపించారు. గతంలో ప్రభాస్ నటించిన `ఆదిపురుష్` సినిమా సమయంలో ఎదురైన చేదు అనుభవాలను నిర్వాహకులు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ సినిమాలో శ్రీలంకను బొగ్గుతో చేసిన నల్లని లంకగా చూపించడం, పాత్రల దుస్తులు మొఘల్ కాలపు శైలిలో లెదర్‌ను పోలి ఉండటం వంటి అంశాలు కోట్ల మంది హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని పేర్కొన్నారు.

అంతటి భారీ బడ్జెట్ చిత్రం చివరకు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైందని.. అలాంటి తప్పులు రామాయణంపై తీసే ఏ చిత్రంలోనూ పునరావృతం కాకూడదన్నారు. చిత్రంలో ఏ ఒక్క సన్నివేశం .. డైలాగ్ కూడా ప్రజల మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉండకూడదనే ఉద్దేశంతోనే ముందస్తు స్క్రీనింగ్ డిమాండ్ చేస్తున్నట్లు మహాసంఘ్ స్పష్టం చేసింది. రామాయణం వంటి గొప్ప ఇతిహాసం ఆధారంగా తెరకెక్కే చిత్రాలు వరుసగా పరాజయం పాలైతే సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని.. అందుకే సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాకముందే తాము పరిశీలించాలని కోరుతున్నట్లు తెలిపారు.

ఈ డిమాండ్‌పై నిర్మాతల పీఆర్ బృందం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయ‌లేదు. అయితే మేకర్స్ కనుక ఈ ముందస్తు ప్రదర్శనకు అంగీకరించకపోతే? శ్రీ రామ్‌లీలా మహాసంఘ్ ఇతర హిందూ సంఘాలతో కలిసి ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా సినిమా హాల్స్ ముందు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విడుదల తేదీకి ముందే ఇలాంటి వివాదాలు ..నిరసన హెచ్చరికలు ఎదురుకావడం చిత్ర యూనిట్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ఇప్పటికే భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఒకవైపు వీఎఫ్ఎక్స్ పనుల కోసం .. వివాదాలకు తావు లేకుండా ఉండేందుకు మేకర్స్ అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఈ తరహా డిమాండ్లు సినిమా వ్యాపార వాతావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో చిత్ర బృందం ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.