Begin typing your search above and press return to search.

బాయ్‌కాట్ 'రామాయ‌ణం': ర‌ణ‌బీర్‌పైనే కుట్ర చేస్తున్నారా?

బాలీవుడ్‌లో కపూర్ల నటవారసుడిగా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రణ్‌బీర్ కపూర్‌పై ఒక సెక్షన్ ఎప్పుడూ నెగెటివ్ ప్రచారం సాగిస్తూనే ఉంటుంది.

By:  Sivaji Kontham   |   2 Aug 2026 1:36 PM IST
బాయ్‌కాట్ రామాయ‌ణం: ర‌ణ‌బీర్‌పైనే కుట్ర చేస్తున్నారా?
X

బాలీవుడ్‌లో కపూర్ల నటవారసుడిగా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రణ్‌బీర్ కపూర్‌పై ఒక సెక్షన్ ఎప్పుడూ నెగెటివ్ ప్రచారం సాగిస్తూనే ఉంటుంది. కేవలం రణ్‌బీర్ పైనే కాకుండా.. హిందీ చిత్ర పరిశ్రమలో అగ్ర నటీనటులను లక్ష్యంగా చేసుకుని జరిగే ఆన్‌లైన్ కుట్రలు, దుష్ప్రచారాలపై గతంలోనూ ఎన్నో డిబేట్లు నడిచాయి. గ్లామర్ తో త‌ళుకులీనే కలర్‌ఫుల్ చిత్ర పరిశ్రమలో ఇలాంటి విమర్శలు.. టార్గెటెడ్ నెగెటివిటీ సర్వసాధారణంగా మారడంతో.. వీటికి ఎలా ఎదురొడ్డి నిలవాలో.. ఎలా స్పందించాలో నటీనటులు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రస్తుతం నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ `రామాయణం`ని రణ్‌బీర్ కపూర్‌ని టార్గెట్ చేస్తూ పక్కా ప్రణాళికతో కుట్ర జరుగుతోందని అభిమానులు సూటిగా ఆరోపిస్తున్నారు. `రామాయ‌ణ‌` ట్రైలర్ విడుదలైన నాటి నుంచే సోషల్ మీడియాలో ఒక వర్గం ఉద్దేశపూర్వకంగా ప్రతికూలతను ప్ర‌చారం చేస్తోందనేది అభిమానుల అభిప్రాయం. శాంత స్వరూపుడైన శ్రీరాముడి పాత్రకు రణ్‌బీర్ అసలు సెట్ కాడని.. అత‌డి వ్యక్తిగత ప్రవర్తన సరిగ్గా లేదని విమర్శలు మొదలయ్యాయి. చివరకు `శక్తిమాన్` ఫేమ్ ముకేష్ ఖన్నా సైతం రణ్‌బీర్ ఎంపికపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకున్న ఒక చిన్న సంఘటన ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. రణ్‌బీర్ కపూర్ - ఆలియా భట్ దంపతులు వెళ్తున్న సమయంలో కొందరు అభిమానులు `జై శ్రీరామ్` అని నినాదాలు చేయగా.. వారు కనీసమాత్రంగా కూడా స్పందించకుండా వెళ్లిపోయారని ఒక వీడియో వైరల్ అయింది. దీనిని ఆసరాగా చేసుకుని శ్రీరాముడి నామాన్ని కనీసం పలకరించలేని రణ్‌బీర్ ఈ పవిత్రమైన పాత్రకు ఏమాత్రం సరిపోడని నెటిజన్లు విరుచుకుపడ్డారు. అంతేకాకుండా.. సోషల్ మీడియాలో ఏకంగా `బాయ్‌కాట్ రామాయణం` అంటూ హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేయడం ప్రారంభించారు.

అయితే ఈ విమర్శలపై రణ్‌బీర్ అభిమానులు, తటస్థ ప్రేక్షకులు గట్టిగానే ఎదురుదాడి చేస్తున్నారు. తెరపై ఒక పాత్ర పోషించినంత మాత్రాన నిజ జీవితంలోనూ ప్రతిచోటా ఆ పాత్రలాగే ప్రవర్తించాలనడం మూర్ఖత్వమని వారు వాదిస్తున్నారు. కావాలనే రణ్‌బీర్‌ను టార్గెట్ చేస్తూ..భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న `రామాయణం` చిత్రంపై నెగెటివిటీ పెంచడానికే ఈ చిన్న ఎయిర్‌పోర్ట్ వీడియోను వైరల్ చేసి రచ్చ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆన్‌లైన్ వేదికలపై ఎలాంటి ప్రతికూల విమర్శలు వచ్చినా ఖాతరు చేయకుండా రణ్‌బీర్ కపూర్, దర్శకుడు నితీష్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా తమను తాము నమ్ముకుని షూటింగ్ పనుల్లో నిమగ్నమయ్యారు.

ప్రస్తుతానికైతే ఈ వైరల్ వీడియో లేదా బాయ్‌కాట్ ట్రెండ్‌పై రణ్‌బీర్ కపూర్ కానీ..ఆలియా భట్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనం పాటిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న ఈ నెగెటివ్ ప్రచారాన్ని తట్టుకుని ఈ వివాదం నుండి చిత్రబృందం ఎలా బయటపడుతుందనేది ఆసక్తికరంగా మారింది. మునుముందు రణ్‌బీర్ ఈ వివాదంపై ఏ విధంగా స్పందిస్తారో.. ఈ అనవసర నెగెటివిటీని దాటుకుని `రామాయణం` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే. ఇక టాలీవుడ్, బాలీవుడ్ అనే స‌రిహ‌ద్దులు చెరిగిపోయి మ‌న‌మంతా `భార‌తీయ సినిమా`గా ఒకే తాటిపైకి వ‌చ్చి సినిమాల‌ను తీస్తున్నాం గ‌నుక `వార‌ణాసి`కి ఇచ్చిన‌ట్టే `రామాయ‌ణం`కి కూడా పాజిటివ్ నోట్ ఇవ్వాల‌నే వాద‌న కూడా టాలీవుడ్ స‌ర్కిల్స్ లో బ‌లంగా వినిపిస్తోంది. హీరోయిజానికి ప‌ట్టంగ‌ట్ట‌కుండా కంటెంట్ ని న‌మ్మి టాలీవుడ్ సినిమాల‌ను నేడు ఉత్త‌రాదిన ఆద‌రిస్తున్న‌ప్పుడు ద‌క్షిణాదిన కూడా బాలీవుడ్ హీరోల సినిమాల‌ను ఆద‌రిస్తే త‌ప్పేమీ కాద‌నేది ఒక వాద‌న‌.