AI క్లిప్‌లతో ఛీప్ అయిపోయిన 4000 కోట్ల 'రామాయణం'
రణబీర్ కపూర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మైథలాజికల్ మూవీ `రామాయణ: పార్ట్ 1` గురించిన ప్రతి అప్ డేట్ జెట్ స్పీడ్ తో దూసుకెళుతున్నాయి.
By: Sivaji Kontham | 3 July 2026 5:00 AM ISTరణబీర్ కపూర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మైథలాజికల్ మూవీ `రామాయణ: పార్ట్ 1` గురించిన ప్రతి అప్ డేట్ జెట్ స్పీడ్ తో దూసుకెళుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన ఒక యుద్ధ సన్నివేశం ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కేవలం 11 సెకన్ల నిడివి గల ఈ క్లిప్‌లో రణబీర్ కపూర్ శ్రీరాముడి అవతారంలో శత్రువులతో పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. ఒరిజినల్ ట్రైలర్ నుండే ఈ సీన్ లీక్ అయిందని కొందరు ఫ్యాన్స్ హడావుడి చేస్తుంటే.. మెజారిటీ నెటిజన్లు మాత్రం ఇది ఒరిజినల్ సినిమా క్లిప్ కాదని... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా క్రియేట్ చేసిన ఫేక్ వీడియో అని కొట్టిపారేస్తున్నారు. ఒకవేళ నిజంగానే లీక్ అయితే మేకర్స్ కాపీరైట్ స్ట్రైక్స్‌తో వెంటనే తొలగించేవారు కదా అని ప్రశ్నిస్తున్నారు.
ఈ లీక్ వివాదం నడుస్తుండగానే... ఇటీవల `రామాయణ` షూటింగ్ సెట్స్‌ను సందర్శించిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ ధ్రువ్ పర్షిత్ చేసిన కామెంట్స్ ఈ సినిమా గ్రాఫిక్స్ (VFX) - ప్రమోషన్ స్ట్రాటజీపై సరికొత్త చర్చకు దారితీశాయి. దర్శకుడు నితీష్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా, రణబీర్ కపూర్, యష్‌లను కలవడానికి వెళ్లిన ధ్రువ్.. సినిమా విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించాడు. తాను చూసిన కొన్ని పూర్తికాని సీన్స్ కూడా హాలీవుడ్ విజువల్ వండర్ `అవతార్` సినిమా రేంజ్‌లో ఉన్నాయని... క్యారెక్టర్ డిజైన్స్, రామాయణ ప్రపంచం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం ఖాయమని కొనియాడాడు.
అయితే ధ్రువ్ కామెంట్ ఒకటి నెట్టింట తీవ్ర దుమారం రేపింది. చిత్ర యూనిట్‌కు చెందిన ఒక విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్‌తో తాను మాట్లాడానని.. మేకర్స్ కావాలనే `రామాయణ` ఫస్ట్ గ్లింప్స్‌లో నాణ్యత లేని విజువల్స్‌ను రిలీజ్ చేశారని అతడు పేర్కొన్నాడు. వారి వద్ద అంతకంటే మెరుగైన విజువల్స్ ఉన్నా ఇంటర్నెట్‌లో వచ్చే విమర్శలు, నెగెటివ్ డిస్కషన్స్ ద్వారా సినిమాకు ఉచిత పబ్లిసిటీ దక్కుతుందనే ఉద్దేశంతోనే అలా చేశారని ధ్రువ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సినిమా హైప్ కోసం మేకర్స్ ఇంతటి మైండ్ గేమ్ ఆడుతున్నారా! అంటూ కామెంట్ చేయగా, అది కాస్తా వైరల్‌గా మారింది.
ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీయడంతో... కంటెంట్ క్రియేటర్ ధ్రువ్ వెంటనే అలర్ట్ అయి తన పాత కామెంట్‌ను డిలీట్ చేసి.. కొత్తగా క్లారిటీ ఇచ్చాడు. సవరించిన స్టేట్‌మెంట్‌లో.. కావాలనే తక్కువ క్వాలిటీ వీడియో రిలీజ్ చేశారనే మాటను వెనక్కి తీసుకున్నాడు. సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పనులు చాలా వేగంగా, అద్భుతంగా జరుగుతున్నాయని.. తాము సెట్స్‌కు వెళ్లినప్పుడు చూసిన కొన్ని ఇన్‌కంప్లీట్ సీన్స్ ఇప్పటికే పూర్తి అయిపోయి ఉంటాయని సర్ది చెప్పాడు. భారతీయ నేపథ్యానికి సరిపోయేలా ఒక అందమైన ఫాంటసీ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారని...ఇది థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని అతడు చెప్పాడు.
మొదటి టీజర్ విడుదలైనప్పుడు విఎఫ్ఎక్స్ - సిజిఐ పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చిన మాట నిజమే. అయితే ఈ లోపాలు ఉన్న సీన్లను మేకర్స్ కావాలనే ప్రమోషన్స్ కోసం వదిలారా లేదా అనేది అధికారికంగా నిర్ధారణ కాలేదు. నితీష్ తివారీ దర్శకత్వంలో దాదాపు 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రణబీర్ కపూర్ (రాముడు), సాయి పల్లవి (సీత), రాకింగ్ స్టార్ యష్ (రావణాసురుడు), సన్నీ డియోల్ (హనుమంతుడు) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. `రామాయణ: పార్ట్ 1` 2025 దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
