Begin typing your search above and press return to search.

ఆదిపురుష్ రికార్డులను తుడిచిపెట్టిన రామాయణ!

నితేష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం `రామాయణ` బాక్సాఫీస్ వద్ద అప్పుడే సంచలనాలు సృష్టిస్తోంది.

By:  Srikanth Kontham   |   24 Oct 2026 1:00 AM IST
ఆదిపురుష్ రికార్డులను తుడిచిపెట్టిన రామాయణ!
X

నితేష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం `రామాయణ` బాక్సాఫీస్ వద్ద అప్పుడే సంచలనాలు సృష్టిస్తోంది. దసరా పర్వదినాన ప్రారంభమైన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విడుదల తేదీకి సరిగ్గా 15 రోజుల ముందే మొదలై ప్రేక్షకుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. సినిమా విడుదలకు ఇంకా 13 రోజులు సమయం ఉండగానే లక్షకు పైగా టికెట్లు అమ్ముడై రికార్డు దిశగా అడుగులు వేస్తోంది.

ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం `ఆదిపురుష్` ప్రీ-సేల్స్ రికార్డులను `రామాయణ` సులభంగా అధిగ మించింది. గతంలో రిలీజ్ అయిన `ఆదిపురుష్` కూడా భారీ ఓపెనింగ్స్ సాధించినా? ఆ తర్వాత నెగెటివ్ టాక్ కారణంగా నిలదొక్కుకోలేకపోయింది. అయితే `రామాయణ` మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఏకంగా 120 శాతానికి పైగా వృద్ధితో దూసుకుపోతోంది.

`ఆదిపురుష్` సినిమా విడుదలకు ఐదు రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించి మొదటి 24 గంటల్లో హిందీ వెర్షన్‌కు సంబంధించి 36 వేల టికెట్లతో 1.40 కోట్ల గ్రాస్ సాధించింది. కానీ `రామాయణ` మాత్రం కేవలం హిందీ వెర్షన్ ..కొన్ని కన్నడ షోలతోనే తొలి 24 గంటల్లో 65 వేలకు పైగా టికెట్లను విక్రయించి 3.13 కోట్లు కొల్లగొట్టింది. ఇది `ఆదిపురుష్` కంటే ఏకంగా 123 శాతం ఎక్కువ కావడం విశేషం.

ప్రస్తుతం `రామాయణ` అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 6.25 కోట్లకు పైగా వసూలు చేసింది. హిందీ వెర్షన్ దాదాపు 900 పైచిలుకు స్క్రీన్లలో ప్రదర్శించబడుతుండగా ప్రధాన నగరాల్లో 15 నుండి 20 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేస్తోంది. త్వరలో కన్నడ, తెలుగు, తమిళ వెర్షన్ల పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైతే యశ్ స్టార్ పవర్ తో ఈ వసూళ్లు మరింత అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది.

ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్- డీఎన్ఈజీ- యశ్ `మాన్సర్ మైండ్ క్రియేషన్స్` సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. ఇందులో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణాసురుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. ఈ చిత్ర మొదటి భాగం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

భారతీయ చలనచిత్ర చరిత్రలో నిలిచిపోయేలా రూపొందుతున్న ఈ చిత్రానికి సోనీ పిక్చర్స్ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్‌ను నిర్వహిస్తుండగా.. ధర్మ ప్రొడక్షన్స్ హిందీ మార్కెట్లో విడుదల చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లోనూ విడుదల కానున్న సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.