ఆ పాత్ర రావడం నా అదృష్టం
భారతీయ సినీ పరిశ్రమ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించే ప్రయత్నంలో ఉంది.
By: Sravani Lakshmi Srungarapu | 31 March 2026 4:51 PM ISTభారతీయ సినీ పరిశ్రమ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించే ప్రయత్నంలో ఉంది. బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న మహత్తర ప్రాజెక్ట్ రామాయణ ఇప్పటికే భారీ హైప్‌ను సృష్టించింది. సుమారు ₹4000 కోట్ల అంచనా వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమా, ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయిలో కొత్త ప్రమాణాలకు తీసుకెళ్తుందా అనే ప్రశ్న ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకున్న ప్రొడక్షన్ వ్యాల్యూస్, అలాగే అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఐమాక్స్ ఫార్మాట్ లో సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించడం.. ఈ ప్రాజెక్టు సత్తాను గ్లోబల్ లెవెల్ లో తెలియచేస్తున్నాయి.
ఏప్రిల్ 2న రామాయణ టీజర్
ఈ హైప్ మధ్య, ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి సందర్భంగా టీజర్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సుమారు 2 నిమిషాల 38 సెకన్ల నిడివితో ఉండబోయే ఈ గ్లింప్స్‌లో ప్రధాన పాత్రల పరిచయం మెయిన్ ఎట్రాక్షన్ గా ఉండనుంది. ముఖ్యంగా రాముడు, సీత, రావణుడు, హనుమంతుడు పాత్రల విజువల్ ట్రీట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచనుంది. పౌరాణిక ఇతిహాసాన్ని ఆధునిక టెక్నాలజీతో ఎలా ఆవిష్కరించబోతున్నారు అనే ఆసక్తి ఇప్పుడు సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
రామాయణలో భారీ క్యాస్టింగ్
క్యాస్టింగ్ పరంగా కూడా ఈ సినిమా భారీ చర్చకు దారి తీసింది. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రాముడిగా కనిపించనుండగా, నేచురల్ పెర్ఫార్మర్ సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తోంది. ఇక యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు. ఈ క్యాస్టింగ్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టార్ పవర్‌ను గ్లోబల్ రీచ్‌తో మేళవించే ప్రయత్నంగా దీన్ని చూడవచ్చు.
ఆ పాత్ర రావడం అదృష్టం
ఈ సినిమా గురించి రణబీర్ కపూర్ రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన దృష్టిలో రాముడు కేవలం పురాణ పాత్ర కాదు, శతాబ్దాలుగా కోట్లాది మందికి మార్గదర్శకుడు. మర్యాద పురుషోత్తముడుగా ఆయన ప్రతిపాదించిన విలువలు ధర్మం, కరుణ, ధైర్యం.. లాంటి మంచి గుణాలన్నీ ఆయనలో ఉన్నాయని, ఆ పాత్ర తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు రణ్‌బీర్ చెప్పుకొచ్చారు.
అయితే, ఈ భారీ ప్రాజెక్ట్ వెనుక ఉన్న అసలు ప్రశ్న బిజినెస్ కోణంలోనే ఉంది. ₹4000 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా విడుదల చేయాలన్న ప్లాన్ పెద్ద రిస్క్‌గా కనిపిస్తున్నప్పటికీ, అదే సమయంలో భారీ రివార్డ్ అవకాశాన్ని కూడా సూచిస్తోంది. బాహుబలి సిరీస్ సెట్ చేసిన రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేయగలదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్, సక్సెస్ అయితే ఇండియన్ సినిమాకు కొత్త దిశను చూపే అవకాశముంది.
