Begin typing your search above and press return to search.

రావణుడి గురించి యశ్ చేసిన రీసెర్చ్ ఏంటి..!

ఇక శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న రణబీర్ కపూర్ కూడా తన అనుభవాలను పంచుకున్నారు. శ్రీరాముడి పాత్ర తనకు దక్కడం జీవితంలో గొప్ప అవకాశమని అన్నారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   31 Oct 2026 2:49 PM IST
రావణుడి గురించి యశ్ చేసిన రీసెర్చ్ ఏంటి..!
X

రామాయణం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు రణబీర్ కపూర్, యశ్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ యాంకర్ సుమతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాయణం కథ, రావణుడి పాత్ర, శ్రీరాముడి గొప్పతనం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ ఇంటర్వ్యూలో సుమ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి రామాయణాన్ని ఎన్నో రకాలుగా వింటూ వచ్చామని అన్నారు. రావణుడికి పది తలలు ఉన్నాయని చెప్పినప్పుడు చిన్నతనంలో వాటిని నిజంగానే పది తలలుగా ఊహించుకునేవాళ్లమని తెలిపారు. అయితే ఆ పది తలలు పది రకాల నైపుణ్యాలకు ప్రతీకగా భావించవచ్చని చెబుతుంటారని గుర్తు చేశారు. రావణుడి పాత్ర కోసం యశ్ కూడా ఏమైనా ప్రత్యేకంగా పరిశోధనలు చేశారా? ఆయన గురించి కొత్త విషయాలు తెలుసుకున్నారా? అని సుమ ప్రశ్నించారు.

దీనికి యశ్ సరదాగా స్పందిస్తూ "ముందుగా ఏం చేయకూడదో తెలుసుకున్నాను" అని అన్నారు. ఆ తర్వాత రామాయణం కథ గొప్పతనం గురించి యశ్ మాట్లాడుతూ, ఈ ఇతిహాసాన్ని మన దేశంలో ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో రకాలుగా చెబుతారని అన్నారు.

"రామాయణంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో కోణంలో ఈ కథను చూస్తారు. రాముడి కోణంలోనే కాకుండా రావణుడి కోణంలో కూడా ఆలోచించవచ్చు. ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అదే రామాయణం గొప్పతనం" అని యశ్ వివరించారు.

ఇక శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న రణబీర్ కపూర్ కూడా తన అనుభవాలను పంచుకున్నారు. శ్రీరాముడి పాత్ర తనకు దక్కడం జీవితంలో గొప్ప అవకాశమని అన్నారు.

"శ్రీరాముడి పాత్ర నాకు దక్కడం నిజంగా జీవితకాలపు గొప్ప అవకాశం" అని రణబీర్ తెలిపారు.

శ్రీరాముడు ఒక మంచి అన్నయ్యగా, మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి స్నేహితుడిగా ఎలా ఉండాలో చూపించే గొప్ప వ్యక్తి అని రణబీర్ అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా, "ఎలాన్ మస్క్ ఇప్పుడు ఫ్లయింగ్ కారును కనిపెడితే.. భారత్‌లో 5,000 ఏళ్ల క్రితమే ఎగిరే వాహనాలు ఉన్నాయని చెబుతారు" అంటూ రామాయణంలోని పుష్పక విమానం గురించి ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు.

నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం నవంబర్ 5న విడుదల కానుంది.