Begin typing your search above and press return to search.

య‌ష్ గురించి ర‌ణ‌బీర్ చెప్పిన మాట‌లు వింటే క‌ళ్ల నీళ్లు తిరుగుతాయి!

ప్రతిష్టాత్మక `రామాయణం` సినిమా ప్రీరిలీజ్ వేడుకలో రాముడి పాత్రధారి, ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ చేసిన భావోద్వేగ ప్రసంగం ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసింది.

By:  Sivaji Kontham   |   19 Oct 2026 10:59 PM IST
య‌ష్ గురించి ర‌ణ‌బీర్ చెప్పిన మాట‌లు వింటే క‌ళ్ల నీళ్లు తిరుగుతాయి!
X

ప్రతిష్టాత్మక `రామాయణం` సినిమా ప్రీరిలీజ్ వేడుకలో రాముడి పాత్రధారి, ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ చేసిన భావోద్వేగ ప్రసంగం ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసింది. ప్రభు శ్రీరాముడి పాత్రలో నటించడం తనకొక అద్భుతమైన భావోద్వేగ ప్రయాణమని.. ఇది ధైర్యం, కరుణ, క్షమాగుణం .. సరైన మార్గాన్ని ఎంచుకోవడంలోని గొప్పతనాన్ని తనకు నేర్పిందని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాను కేవలం ఒక చిత్రంగా చూడకుండా, మన తల్లిదండ్రులు.. తాతముత్తాతలు నేర్పిన విలువలను, మనలోని మంచిని గుర్తుచేసుకునే ఒక గొప్ప అనుభూతిగా భావించాలని ఆయన కోరారు.

ఈ భారీ ప్రాజెక్ట్ వెనుక ఉన్న వ్యక్తుల కృషిని కొనియాడుతూ రణ్‌బీర్ కపూర్ ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. తన చిన్ననాటి మిత్రుడు, విజనరీ అయిన నిర్మాత నమిత్ మల్హోత్రా పడిన కష్టాన్ని, ఆయన సాధించిన విజయాలను గుర్తుచేసుకుంటూ ఆయనతో కలిసి ఈ ప్రయాణంలో ఉండటం గర్వకారణమని తెలిపారు. అలాగే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న మాంత్రికుడు, కెప్టెన్ అయిన నితీష్ తివారీ ఈ ప్రపంచంలోనే అత్యంత సమర్థుడైన దర్శకుడని కొనియాడుతూ.. ఆయనతో పనిచేయడం పై సంతోషం వ్యక్తం చేశారు.

ఇదే వేదికపై తోటి నటీనటుల ప్రతిభను రణ్‌బీర్ అభినందించారు. రకుల్ ప్రీత్ సింగ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తుందని, రవి దూబే టాలెంట్ సాటిలేనిదని చెబుతూ తనకు సోదరుడిలాంటివాడని పేర్కొన్నారు. ముఖ్యంగా సాయిపల్లవి సెట్‌లోకి అడుగుపెట్టిన మొదటి రోజే సీతామాతకు తగిన గాంభీర్యాన్ని, దైవత్వాన్ని ఈ చిత్రానికి తెచ్చిపెట్టారని ఆమె ఎనర్జీని, టాలెంట్‌ను ప్రశంసించారు.

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ గురించి మాట్లాడుతూ రణ్‌బీర్ భావోద్వేగానికి గురయ్యారు. యశ్ ఒక గొప్ప ఫ్యామిలీ మ్యాన్ అని.. తన కుటుంబాన్ని, పిల్లలను వదిలిపెట్టి సొంతూరికి దూరంగా ఉంటూ `టాక్సిక్`, `రామాయణం` సినిమాల కోసం నిరంతరం శ్రమించార‌ని తెలిపారు. ఆయనలా కష్టపడే వ్యక్తిని తాను ఎప్పుడూ చూడలేదని.. ఆయనకంటూ ప్రత్యేక స్థానం ఉందని కొనియాడారు. అలాగే నిర్మాత దిల్ రాజుతో ఇది తన మూడో సహకారమని, విభిన్న భాషల సినిమాలకు ఆయన ఇస్తున్న సపోర్ట్ ఎంతో గొప్పదని తెలిపారు.

చివరగా తెలుగు ప్రేక్షకులకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ రణ్‌బీర్ ప్రసంగాన్ని ముగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే సోదరసోదరీమణులు తనను, తన పనిని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు చెబుతూ.. భవిష్యత్తులోనూ బిగ్ స్క్రీన్‌పై అద్భుతమైన సినిమా అనుభూతిని అందించడానికి నిరంతరం కష్టపడతానని మాటిచ్చారు. హైదరాబాద్ ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమ అమూల్యమని పేర్కొంటూ.. అందరికీ `జై శ్రీరామ్` చెబుతూ తన ప్రసంగాన్ని ముగించారు.