'రామాయణం'లో రణ్‌బీర్ ద్విపాత్రాభినయం.. సస్పెన్స్ వీడిన ఆ రెండో పాత్ర ఇదే!
అయితే ఈ ట్రైలర్ ప్రేక్షకులకు ఒక ఊహించని పెద్ద సర్‌ప్రైజ్‌ను అందించింది.
By: Sivaji Kontham | 31 July 2026 2:25 PM ISTనితీష్ తివారీ తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణం' ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. అయితే ఈ ట్రైలర్ ప్రేక్షకులకు ఒక ఊహించని పెద్ద సర్‌ప్రైజ్‌ను అందించింది. శ్రీరాముడి పాత్రలో నటించిన రణ్‌బీర్ కపూర్ ఈ చిత్రంలో మహావిష్ణువు మరొక అవతారమైన పరశురాముడి పాత్రను కూడా పోషిస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఈ డబుల్ రోల్ వార్త విన్న అభిమానులు, సినీ ప్రియులు తీవ్ర ఆశ్చర్యంతో పాటు అపారమైన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ట్రైలర్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియా వేదికగా రణ్‌బీర్ కపూర్ ద్విపాత్రాభినయంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒకే సినిమాలో మహావిష్ణువు రెండు అవతారాలైన రాముడు, పరశురాముడు పాత్రలలో రణ్‌బీర్ కనిపించడం సరికొత్త అనుభూతిని ఇస్తుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయాన్ని నటుడు రణ్‌బీర్ కపూర్ కూడా గతంలో ఒక ఇంటర్వ్యూలో ధృవీకరిస్తూ.. విష్ణుమూర్తి రెండు విభిన్న అవతారాలను ఒకే సినిమాలో పోషించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఈ ట్రైలర్‌లో రాముడి ప్రశాంతమైన, గంభీరమైన రూపాన్ని ఆవిష్కరించిన తీరు ఒకెత్తయితే పరశురాముడి ఉగ్ర రూపాన్ని చూపించిన రెండు సెకన్ల గ్లింప్స్ ప్రేక్షకుల్లో గూస్‌బంప్స్ తెప్పించింది. ఒకే నటుడు.. రెండు భిన్నమైన ఆరాలతో ఈ సన్నివేశం థియేటర్లను దేవాలయాలుగా మార్చేస్తుంది! అని నెటిజన్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ద్విపాత్రాభినయం సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్లింది.
రణ్‌బీర్ కపూర్ డబుల్ యాక్షన్‌తో పాటు ఈ ట్రైలర్‌లో చూపించిన విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీక్వెన్స్‌లకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. శాంతమూర్తి అయిన రాముడి పాత్రను.. రౌద్ర రూపమైన పరశురాముడి పాత్రను రణ్‌బీర్ తన నటనతో ఎంతవరకు సమర్థవంతంగా పండిస్తాడో చూడాలని అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ భారీ పౌరాణిక చిత్రంలో రణ్‌బీర్ కపూర్‌తో పాటు సాయి పల్లవి (సీత), యష్ (రావణాసురుడు), రవి దూబే (లక్ష్మణుడు), సన్నీ డియోల్ (హనుమంతుడు) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ట్రైలర్‌కు లభించిన అద్భుతమైన రెస్పాన్స్, రణ్‌బీర్ డబుల్ రోల్ ఆకర్షణతో `రామాయణం` చిత్రంపై భారతీయ చలనచిత్ర వర్గాల్లో బిగ్గెస్ట్ హైప్ నెలకొంది.
