Begin typing your search above and press return to search.

ఈ స్టార్‌ హీరో చెప్పింది నిజం..!

సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అది కాదు అనలేని సత్యం.

By:  Ramesh Palla   |   10 Oct 2025 2:04 PM IST
ఈ స్టార్‌ హీరో చెప్పింది నిజం..!
X

సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అది కాదు అనలేని సత్యం. కొందరు నెపోటిజంను లైట్‌ తీసుకుంటే, కొందరు మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుని, ఇండస్ట్రీ మొత్తం నెపోటిజం కారణంగా నాశనం అవుతుందని అంటూ ఉంటారు. స్టార్ కిడ్స్‌ కి మాత్రమే ఆఫర్లు వస్తున్నాయి, బయట నుంచి వచ్చే వారిని ఫిల్మ్‌ మేకర్స్ కనీసం కన్సిడర్ చేయడం లేదు అనేది ఒక వర్గం వారి ఆవేదన. ఆ ఆవేదనలో అర్థం ఉంది. బయటి నుంచి వచ్చే వారిలో కనీసం సగం మంది అయినా ఇండస్ట్రీలో ఆఫర్లు దక్కించుకోలేక పోతున్నారు. కానీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ కిడ్స్ సినిమాల్లోకి రావాలి అనుకుంటే ఈజీగా ఎంట్రీ లభిస్తుంది. స్టార్ కిడ్స్ ఏమాత్రం కష్టం లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. అందుకే సామాన్యులు ఇండస్ట్రీలో నెపోటిజం గురించి తీవ్రంగా మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం.

నెపోటిజం గురించి రణబీర్‌ కపూర్‌..

స్టార్‌ కిడ్‌ అయినంత మాత్రాన ఇండస్ట్రీలో ఆఫర్లు దక్కుతాయి, ఇండస్ట్రీలో స్టార్‌డం దక్కుతుంది అనుకుంటే పొరపాటే అనేది కొందరి మాట. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి ఖచ్చితంగా నెపో కిడ్‌ ఇమేజ్‌ పని చేస్తుంది. కానీ ఆ తర్వాత నుంచి ఇండస్ట్రీలో రాణించాలన్నా, ఆ తర్వాత ఆఫర్లు దక్కించుకోవాలన్నా ఖచ్చితంగా ప్రతిభ అవసరం, సక్సెస్ కావాల్సిందే అనే విషయం చాలా మంది విషయంలో నిరూపితం అయ్యింది. తాజాగా బాలీవుడ్‌ స్టార్ హీరో రణబీర్‌ కపూర్‌ ఈ విషయమై స్పందించాడు. నెపో కిడ్‌ కావడం వల్ల ప్రయోజనాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ నెపో కిడ్‌ అయినంత మాత్రాన ఇండస్ట్రీలో స్టార్‌గా నిలదొక్కుకుంటారు అంటే మాత్రం అది అవాస్తవం అన్నాడు. కేవలం ప్రతిభ ఉన్న వారికి మాత్రమే ఇండస్ట్రీలో ఆఫర్లు వస్తాయి, ఇండస్ట్రీ నుంచి వారికి మద్దతు లభిస్తుందని రణబీర్‌ కపూర్ చెప్పుకొచ్చాడు.

బాలీవుడ్‌లో స్టార్‌ కిడ్స్‌ ఎంట్రీ కామన్‌

ఇండస్ట్రీలో పరిచయం కావడానికి నెపో కిడ్‌ ట్యాగ్‌ ఉపయోగపడుతుంది, ఆ తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తమ సొంత శక్తిని నమ్ముకుని సినిమాలు చేసుకోవాల్సిందే. అంతే కాకుండా సొంతంగా ఎదగడం కోసం సొంత ప్రతిభను ఇండస్ట్రీలో చూపించాలి, సినిమాలను సక్సెస్‌ చేసుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నంత మాత్రాన సక్సెస్‌లు రావు, ఇండస్ట్రీలో స్టార్‌ కిడ్స్ నటించిన సినిమాలని హిట్‌ అయిన సందర్భాలు లేవు. కేవలం సినిమా కంటెంట్‌ బాగుంటేనే సినిమాలు ఆడుతాయి, లేదంటే ప్రేక్షకులు తిరస్కరించిన సందర్భాలు చాలానే ఉంటాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. బాలీవుడ్‌లోనే కాకుండా అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలోనూ స్టార్‌ కిడ్స్‌ ఇదే తరహాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఉన్నారు. ఆఫర్లు రాక కెరీర్‌కి గుడ్‌ బై చెప్పిన స్టార్‌ కిడ్స్ ఎంతో మంది ఉన్నారు. అతి తక్కువ శాతం మంది మాత్రమే ఇండస్ట్రీలో విజయం సాధించడం చూస్తే నెపోటిజం పెద్దగా పని చేయడం లేదని తెలుస్తుందని రణబీర్‌ కపూర్‌ తన మాటలతో చెప్పకనే చెప్పారు.

కపూర్ ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన హీరో

కపూర్‌ ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రణబీర్‌ కపూర్‌ కి మంచి ఓపెనింగ్‌ దక్కింది. అయితే ఆ తర్వాత ఆశించిన స్థాయిలో పేరు రాలేదు, అంతే కాకుండా కొన్ని కారణాల వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా కూడా నిలదొక్కుకుని సినిమా ఇండస్ట్రీలో స్టార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌గా ఉన్నాడు. ఈయన నటించిన యానిమల్‌ సినిమా వందల కోట్ల వసూళ్లు సాధించింది. అంతే కాకుండా బ్రహ్మాస్త్ర సినిమా సైతం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈయన రామాయణ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమా కంటే ముందు ఆలియాతో కలిసి నటించిన లవ్‌ అండ్‌ వార్‌ సినిమా రాబోతుంది. ఈ రెండు సినిమాలు ఆయన స్థాయిని మరింత పెంచడం ఖాయం అని అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.