బాలీవుడ్ ఫ్యూచర్ ఆ హీరో చేతిలోనే ఉందా?
ఒకప్పుడు బాలీవుడ్‌లో నంబర్ వన్ హీరో అనే డిస్కషన్ రాగానే సహజంగానే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ పేర్లే ముందుగా వినిపించేవి.
By: Sravani Lakshmi Srungarapu | 6 July 2026 11:58 AM ISTఒకప్పుడు బాలీవుడ్‌లో నంబర్ వన్ హీరో అనే డిస్కషన్ రాగానే సహజంగానే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ పేర్లే ముందుగా వినిపించేవి. కానీ గత కొంతకాలంగా పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా యానిమల్ మూవీ సక్సెస్ తర్వాత రణబీర్ కపూర్ కెరీర్ కొత్త దశలోకి అడుగుపెట్టింది. ఇప్పుడతని చేతిలో ఉన్న ప్రాజెక్టుల పరిమాణం, వాటిపై ఉన్న అంచనాలు చూస్తే రాబోయే మూడు సంవత్సరాలు బాలీవుడ్ దిశనే మార్చే అవకాశం ఉందనే విశ్లేషణలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రణబీర్ సెలెక్ట్ చేసుకున్న సినిమాలు చూస్తే అవి కేవలం స్టార్ హీరో సినిమాలుగా కాకుండా, వందల కోట్ల పెట్టుబడులతో రూపొందుతున్న భారీ ప్రాజెక్టులుగా కనిపిస్తున్నాయి. పురాణ నేపథ్యం, యాక్షన్, ఫ్రాంచైజీ ఎంటర్‌టైనర్లు, విజువల్ స్పెక్టకల్స్... ఇలా విభిన్న జానర్లలో రణ్‌బీర్ ఒకేసారి సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ డెసిషన్ రణ్‌బీర్ కెరీర్ కు అతి పెద్ద బలమయ్యే అవకాశాలుండగా, అదే సమయంలో అదే అతని కెరీర్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ కూడా అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తుండటంతో ఒక్క సినిమా నిరాశపరిచినా దాని ఎఫెక్ట్ తరువాతి ప్రాజెక్టుల మార్కెట్‌పైనా పడే అవకాశం ఉంటుంది. కానీ అదే సమయంలో ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధిస్తే, రణబీర్‌ను బాలీవుడ్‌లో మోస్ట్ వాల్యుబుల్ స్టార్‌గా నిలబెట్టే అవకాశాన్ని కూడా ఎవరూ కొట్టిపారేయలేరు. మరో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, అతని కెరీర్ క్రమంగా ఫ్రాంచైజీల చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. సీక్వెల్స్, భారీ బ్రాండ్లుగా మారుతున్న కథలే ఇప్పుడు ప్రధానంగా అతని లైనప్‌లో చోటు దక్కించుకుంటున్నాయి. ఒకప్పుడు ఒరిజినల్ కథలే స్టార్‌డమ్‌కు కొలమానంగా భావించిన బాలీవుడ్‌లో ఇప్పుడు ఫ్రాంచైజీ కల్చర్ మరింత బలపడుతోందని దీన్ని బట్టి అర్థమవుతోంది.
అలాగే ఈ సినిమాలన్నీ కేవలం హిందీ ఆడియన్స్ ను మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని భాషల మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందుతున్నాయి. అందుకే రణబీర్ కూడా పాన్ ఇండియా బ్రాండ్‌గా తన స్థానాన్ని మరింత బలపరుచుకునే ప్రయత్నంలో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకే సమయంలో నార్త్ మార్కెట్‌తో పాటు సౌత్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునే ప్లానింగ్ అతని సినిమాల ఎంపికల్లో కనిపిస్తోంది. ఈ సక్సెస్‌ల వెనుక మరో కీలక కారణం డైరెక్టర్ల నమ్మకం కూడా. విభిన్న శైలులకు చెందిన ప్రముఖ దర్శకులు వరుసగా రణబీర్‌తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడం అతని నటనపై ఇండస్ట్రీలో ఏర్పడిన విశ్వాసాన్ని సూచిస్తోంది. ఒకప్పుడు లవ్ స్టోరీలకు కేరాఫ్ హీరోగా గుర్తింపు పొందిన రణ్‌బీర్ ఇప్పుడు యాక్షన్, మైథాలజీ, భారీ విజువల్ డ్రామాలకు కూడా సూటయ్యే హీరోగా తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకున్నారు.
అందుకే ఇప్పుడు బాలీవుడ్‌లో మరో ఆసక్తికర ప్రశ్న వినిపిస్తోంది. రాబోయే బాక్సాఫీస్ వసూళ్లు, థియేట్రికల్ మార్కెట్, ఓటీటీ వ్యాపారం, ఇంటర్నేషనల్ రిలీజులు... ఈ భారీ అంచనాలన్నీ ఒకే హీరో సినిమాల చుట్టూ తిరుగుతున్నాయా? అది పూర్తిగా నిజమని చెప్పడం తొందరపాటే అయినప్పటికీ, ప్రస్తుతం ఇండస్ట్రీ ఆశలలో రణబీర్ పేరు అత్యంత బలంగా వినిపిస్తున్న విషయం మాత్రం వాస్తవం. దానికి కారణం అతని లైనప్. ప్రస్తుతం రామాయణ తో పాటూ లవ్ అండ్ వార్ చేస్తున్న రణ్‌బీర్, వాటి తర్వాత బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్ కు సీక్వెల్ గా యానిమల్ పార్క్, బ్రహ్మాస్త్ర2 చేయనున్నారు. మొత్తంగా చూస్తే 2026 నుంచి 2028 వరకు ఉండే కాలం రణబీర్ కపూర్ కెరీర్‌కే కాదు, బాలీవుడ్ కమర్షియల్ మార్కెట్‌కు కూడా కీలక పరీక్షగా మారే అవకాశముంది. ఈ జర్నీ సక్సెస్ అయితే, న్యూ ఏజ్ సూపర్‌స్టార్‌గా రణ్‌బీర్ స్థానం మరింత బలపడుతుంది. అదే సమయంలో భారీ ఫ్రాంచైజీలు, పాన్ ఇండియా వ్యూహాలపై బాలీవుడ్ భవిష్యత్తు ఎలా రూపుదిద్దుకోబోతోందో కూడా ఈ ప్రాజెక్టుల ఫలితాలే నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
