విజ్ఞప్తి చేస్తూనే వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో..!
రణబీర్ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 28న భారీ ఎత్తున అభిమానులు ఆయన ఇంటి వరకు చేరుకున్నారు.
By: Ramesh Palla | 30 Sept 2025 5:00 AM ISTబాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో పాటు, మీడియా వారు పెద్ద ఎత్తున ఆయన రెసిడెన్సీ వద్ద గుమ్మిగూడారు. ఆయన అభిమానుల కంటే మీడియా వారి ఉత్సాహం ఎక్కువ అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మీడియా వారి అత్యుత్సాహంపై రణబీర్ కపూర్ తీవ్రంగా అసహనం వ్యక్తం చేశాడని కూడా ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. మీడియా వారు తన రెసిడెన్సీలో హద్దులు దాటి ముందుకు వచ్చారని, అలా రావడం వల్ల అందరికీ చాలా ఇబ్బందిగా ఉంటుందని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలా రావడం కరెక్ట్ కాదని వార్నింగ్ ఇచ్చాడు. అంతే కాకుండా వారిని వెనక్కి వెళ్లి పోవాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్లుగా రణబీర్ కపూర్ మాట్లాడినట్లు చెబుతున్నారు. రణబీర్ కపూర్ తీరును కొందరు మీడియా వారు తప్పుబట్టారని కూడా సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది.
పుట్టిన రోజు సందర్భంగా గొడవ
రణబీర్ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 28న భారీ ఎత్తున అభిమానులు ఆయన ఇంటి వరకు చేరుకున్నారు. అభిమానులకు అభివాదం చేసేందుకు, అభిమానుల శుభాకాంక్షలు స్వీకరించేందుకు ఖచ్చితంగా రణబీర్ బయటకు వస్తాడని గ్రహించిన మీడియా వారు, ముఖ్యంగా ఫోటోగ్రాఫర్లు హద్దులు మీరి ముందుకు వెళ్లడం వల్ల అసలు సమస్య వచ్చింది. రణబీర్ కపూర్ ఉంటున్న రెసిడెన్సీ ఏరియాలో ఉంటున్న ఇతరులు తీవ్రంగా అభ్యంతరం చెప్పారని సమాచారం అందుతోంది. ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ఏమీ ఉండకూడదు అనుకునే రణబీర్ కపూర్ మీడియా వారిపై ముఖ్యంగా ఫోటోగ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో మీడియా వారు సెలబ్రిటీలను ఫోటోల పేరుతో ఇబ్బంది పెట్టడం చాలా కామన్ విషయం అయిందని, వారి ఆగడాలు ఆగాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
రణబీర్ కపూర్ అభిమానులు, మీడియా వారి అత్యుత్సాహం
తన పుట్టిన రోజు సందర్భంగా భార్య ఆలియా భట్ తో పాటు కూతురుతో కలిసి రణబీర్ కపూర్ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈసారి రణబీర్ కపూర్ వరుస సినిమాలు చేస్తున్న కారణంగా ఆయన సినిమాల నుంచి సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటాయా అని అంతా ఆశించారు. కానీ రణబీర్ కపూర్ సింపుల్‌గా తన పుట్టిన రోజును పూర్తి చేసుకున్నాడు. ముఖ్యంగా రామాయణం సినిమాకు సంబంధించి ఏమైనా అప్‌డేట్ ఇవ్వడం ద్వారా రణబీర్ కపూర్ ఫ్యాన్స్‌కి పెద్ద పుట్టిన రోజు కానుక ఇచ్చినట్లు అయ్యేది అనేది కొందరి మాట. కానీ రామాయణ మేకర్స్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేకుండా, కేవలం టైటిల్ రివీల్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెల్సిందే. సినిమాను వెయ్యి కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రామాయణంలో సీతదేవి పాత్రలో సాయి పల్లవి
రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తూ ఉండగా, సీత పాత్రకు గాను సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవిని తీసుకున్నారు. ఆమె ఇప్పటికే సీతలో ఎలా ఉందో సోషల్ మీడియాలో లీక్ అయిన ఫోటోలను చూస్తే అర్థం అవుతుంది. రాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవి పాత్రకు సాయి పల్లవి నూటికి నూరు శాతం న్యాయం చేస్తారు అంటూ దర్శకుడు చాలా నమ్మకంగా ఉన్నాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం రామాయణం గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్ సినిమాకు సీక్వెల్‌గా యానిమల్ పార్క్ అనే సినిమాను రణబీర్ కపూర్ చేయాల్సి ఉంది. అందులో విలన్ పాత్రను సైతం రణబీర్ కపూర్ చేస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై సందీప్ వంగ క్లారిటీ ఇవ్వాలి. స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్ ను లైన్‌లోకి తీసుకుంటాను అంటూ సందీప్ వంగ గతంలో చెప్పుకొచ్చాడు.
