శక్తిమాన్‌గా రణ్‌వీర్.. శ్రీరాముడిగా రణబీర్ పనికి రారు!
రణబీర్ యానిమల్ లో క్రూరుడిగా విషపూరితమైన పాత్రలో నటించాడు. అందువల్ల ఆదర్శ పురుషుడైన శ్రీరాముడిగా నటించడానికి అనర్హుడు!
By: Sivaji Kontham | 15 Aug 2025 2:00 PM ISTబాలీవుడ్ అగ్ర కథానాయకులు రణ్ వీర్ సింగ్, రణబీర్ కపూర్ తమ పాత్రల ఎంపికల విషయంలో చాలా మందికి వ్యతిరేకులుగా మారారు. రణ్‌వీర్ సింగ్ గతంలో శక్తిమాన్ పాత్రలో నటించాలని కలలు కన్నాడు. కానీ ఈ సూపర్‌హీరో పాత్రను క్రియేట్ చేసి నటించిన ముఖేష్ ఖన్నా దీనికి ససేమిరా అన్నాడు. రణ్ వీర్ సింగ్ ఈ పాత్రకు సరిపోడని వ్యక్తిగతంగా తాను భావిస్తున్నట్టు తెలిపాడు. రణ్ వీర్ గొప్ప నటుడే కానీ, ఈ అవకాశం ఇవ్వలేనని అన్నాడు. అతడు రణ్ వీర్ వ్యక్తిగతంగా ఎలా ఉంటాడో కూడా వర్ణించి చెప్పాడు. రణ్ వీర్ గంటల కొద్దీ సమయం తనతో గడిపాక కూడా అతడు దిగి రాలేదు.
ఇప్పుడు రణబీర్ కపూర్ `రామాయణం`లో శ్రీరాముడిగా నటించడానికి సరైనవాడు కాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీరాముడిగా రణబీర్ నటించడాన్ని వ్యతిరేకిస్తూ ఉదయ్ మహూర్కర్ అనే నాయకుడు భారత ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాయడం హాట్ టాపిగ్గా మారింది. రణబీర్ ని రాముడి పాత్ర నుంచి తప్పించాలని ఈ లేఖలో ఆయన డిమాండ్ చేసారు. ఇక రాజకీయాలు- సినిమాలు- మతం .. ఈ మూడింటితో ముడిపడిన వ్యవహారాలకు చిక్కుముడులు విప్పడం అంత సులువేమీ కాదు. ముఖ్యంగా కళను రాజకీయం చేయడం ఇప్పుడు దేశంలో మరీ ఎక్కువైంది.
రణబీర్ యానిమల్ లో క్రూరుడిగా విషపూరితమైన పాత్రలో నటించాడు. అందువల్ల ఆదర్శ పురుషుడైన శ్రీరాముడిగా నటించడానికి అనర్హుడు! అని ఉదయ్ ముహూర్కర్ తాను రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే అతడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఎవరైనా కళాకారుడు తెరపై కేవలం ఏదో ఒక పాత్రకు మాత్రమే అంకితం కాలేరు. వైవిధ్యమైన పాత్రల్లో నటించాల్సి ఉంటుంది. యానిమల్‌లో రణ్ విజయ్ గా నటించిన రణ్ వీర్ ఇప్పుడు శ్రీరాముడి పాత్రకు షిఫ్టయ్యాడు. ఆ తర్వాత గ్యాంగ్ స్టర్ గా నటిస్తాడేమో! ఇలా ప్రతి ఆర్టిస్టు విభిన్నమైన పాత్రలు పోషించాల్సి ఉంటుంది. దీనిని రాజకీయం చేయడం సరికాదని నెటిజనులు విమర్శిస్తున్నారు.
1987లో వచ్చిన `రామాయణం` సిరీస్‌లో శ్రీరాముడి పాత్రను పోషించిన అరుణ్ గోవిల్ `బిస్టార్` అనే చిత్రంలో ఘాటైన రొమాంటిక్ పాత్రలో నటించాడు. అతడి విషయంలో లేని విమర్శలు ఇప్పుడు దేనికి? ప్రతిదీ రాజకీయం చేయాలనుకుంటున్నారా? అని కొందరు నిలదీస్తున్నారు. అసలు నటుడి వ్యక్తిగత జీవితంతో సంబంధం లేనిది తెర జీవితం. అతడు తెరపై ఎంపిక చేసుకున్న పాత్రకు ఎంత బాగా కుదిరాడు.. ఎలా నటించాడు? అన్నదే ముఖ్యం. అయితే భక్తుడు లేదా దేవుడి పాత్రలు పోషించేప్పుడు ఆయా పాత్రలు ఎలాంటి అలవాట్లు, ఆహార్యం, వేషధారణ కలిగి ఉన్నాయి? అన్నది చూడాల్సి ఉంటుంది.
