పక్కా స్కెచ్.. పక్కా స్క్రిప్ట్: ఇవి రెండే సందీప్ వంగాను రేసులో నిలబెట్టేది!
సినిమా రంగంలో స్టార్ హీరోల డేట్స్ సంపాదించడం ఒక ఎత్తు అయితే..అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేసి విడుదల చేయడం మరో ఎత్తు.
By: Sivaji Kontham | 22 April 2026 9:45 AM ISTసినిమా రంగంలో స్టార్ హీరోల డేట్స్ సంపాదించడం ఒక ఎత్తు అయితే..అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేసి విడుదల చేయడం మరో ఎత్తు. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వినిపిస్తున్న ప్రధాన విమర్శ ఏమిటంటే.. చాలా మంది దర్శకులు సెట్స్ పైకి వెళ్ళిన తర్వాత కూడా స్క్రిప్టులో మార్పులు చేర్పులు చేస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారని. కానీ సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులు ఈ విషయంలో భిన్నంగా కనిపిస్తారు. ప్రీ-ప్రొడక్షన్ దశలోనే వంద శాతం బౌండ్ స్క్రిప్ట్‌తో సిద్ధమై.. సెట్స్ పై కేవలం ఎగ్జిక్యూషన్‌కే ప్రాధాన్యత ఇచ్చే పద్ధతి నేటి తరం మేకర్స్‌కు అత్యవసరం.
ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ కెరీర్ గ్రాఫ్ ఒక ఆసక్తికరమైన మలుపులో ఉంది. `యానిమల్` సినిమాతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన ఈ కాంబో ఇప్పుడు `యానిమల్ పార్క్` కోసం సిద్ధమవ్వాల్సి ఉంది. అయితే ఈ భారీ సీక్వెల్ ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది ఇప్పుడు పెద్ద సందిగ్ధంగా మారింది. దీనికి ప్రధాన కారణం దర్శకుడు సందీప్ వంగా .. హీరో రణబీర్ ఇద్దరూ తమ తమ ఇతర ప్రాజెక్టులతో విపరీతమైన బిజీగా ఉండటమే.
సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో `స్పిరిట్` చిత్రాన్ని తెరకెక్కించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే తప్ప అతడు రణబీర్ కోసం పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేరు. మరోవైపు రణబీర్ కపూర్ ఇప్పటికే రామాయణం, లవ్ అండ్ వార్ చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. వీటి తర్వాత ఆయన ముందు `ధూమ్ 4`, `బ్రహ్మాస్త్ర 2` వంటి భారీ ఆఫర్లు ఉన్నాయి. ఈ రేసులో ఏ దర్శకుడు ముందుగా పక్కా స్క్రిప్ట్‌తో వస్తారనే దానిపైనే రణబీర్ తదుపరి అడుగు ఆధారపడి ఉంటుంది.
నిజానికి స్టార్ హీరోలు ఒకేసారి రెండు మూడు సినిమాల షెడ్యూల్స్‌ను మేనేజ్ చేయగలరు కానీ అందుకు దర్శకుల వద్ద స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉండాలి. ఒకవేళ సందీప్ వంగా `స్పిరిట్` చిత్రాన్ని వేగంగా పూర్తి చేసి, `యానిమల్ పార్క్` కోసం బౌండ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తే రణబీర్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు మాత్రమే రణబీర్ తన ఇతర ప్రాజెక్టులైన ధూమ్ 4, బ్రహ్మాస్త్ర 2లపై కూడా సమాంతరంగా దృష్టి సారించడానికి వీలవుతుంది.
ప్రస్తుతానికి ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో ఈ ఏడాది చివరి వరకు స్పష్టత వచ్చేలా లేదు. అయాన్ ముఖర్జీ, యష్ రాజ్ ఫిలింస్ , సందీప్ వంగా.. ఈ ముగ్గురిలో రణబీర్ కపూర్‌ను ముందుగా మెప్పించే బౌండ్ స్క్రిప్ట్ ఎవరి నుంచి వస్తుందో చూడాలి. ఎవరైతే పక్కా స్క్రిప్ట్‌తో సిద్ధంగా ఉంటారో వారికే రణబీర్ వంటి స్టార్ హీరో కాల్షీట్లు దక్కే అవకాశం మెండుగా ఉంది. రణబీర్ ప్రస్తుతం రామాయణం, లవ్ అండ్ వార్ చిత్రాల షూటింగుల్ని వేగంగా ముగించాలని ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో వంగాతో యానిమల్ పార్క్ లో నటించాలనే తపన అతడికి ఉంది. అందువల్ల చాలా వరకూ సందీప్ వంగా ప్రణాళికలపైనే ఈ ప్రాజెక్ట్ ఆధారపడి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
