విజయ్ 'రణబాలి'.. స్లాంగ్ మామూలుగా లేదుగా!
ఇందులో విజయ్ దేవరకొండ రణబాలి పాత్రలో కనిపిస్తుండగా, రష్మిక జయమ్మగా పవర్ ఫుల్ రోల్ లో యాక్ట్ చేస్తున్నారు.
By: M Prashanth | 2 April 2026 3:36 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ లీడ్ రోల్ లో దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఏపీలోని అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో జరుగుతున్న ఆ సినిమా షూటింగ్ నుంచి తాజాగా ఓ చిన్న యాక్షన్ వీడియో లీక్ కావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
లీక్ అయిన వీడియోలో విజయ్ దేవరకొండ పూర్తిగా కొత్త అవతార్ లో కనిపించారు. తెల్లటి సంప్రదాయ దుస్తులు ధరించి, చేతిలో రక్తంతో తడిసిన కొడవలి పట్టుకుని గుర్రంపై వేగంగా దూసుకొస్తూ ఆయన ఇచ్చిన ఎంట్రీ ఆకట్టుకుంటోంది. ఒక పల్లెటూరి వీధిలో జనాలు భయంతో పరుగులు తీస్తుండగా, విజయ్ గంభీర స్వరంతో డైలాగ్స్ చెప్పిన తీరు సినిమాలోని ఇంటెన్సిటీని స్పష్టంగా చూపిస్తోంది.
ముఖ్యంగా రాయలసీమ యాసలో ఆయన చెప్పిన మాస్ డైలాగ్స్ థియేటర్లలో విజిల్స్ పండించేలా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లీకైన వీడియో చూస్తుంటే సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్సులకు దర్శకుడు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. చుట్టూ యుద్ధ వాతావరణం, రక్తపాతం, గాయాలతో పడిపోయిన మనుషులు వంటి విజువల్స్ కథలోని ఇంటెన్సిటీ చూపిస్తున్నాయి.
విజయ్ కళ్ళలో కనిపించే కసి, ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఆ సినిమా ఆయన కెరీర్ లో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. వీడియో అదిరిపోయిందని, విజయ్ స్లాంగ్ సూపర్ అని చెబుతున్నారు. అయితే సినిమాలో విజయ్ సరసన రష్మిక నటిస్తున్నారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల తర్వాత మూడోసారి కలిసి నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇందులో విజయ్ దేవరకొండ రణబాలి పాత్రలో కనిపిస్తుండగా, రష్మిక జయమ్మగా పవర్ ఫుల్ రోల్ లో యాక్ట్ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. రణబాలి కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాకుండా, చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వలస పాలనలో భారతీయులు ఎదుర్కొన్న అణచివేత, కష్టాల ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్నారట.
ముఖ్యంగా 1854-1878 మధ్య జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా కథ రూపొందించినట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఆ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన లుక్స్, పాటలకు మంచి స్పందన రావడంతో సినిమాపై హైప్ పెరిగింది. సెప్టెంబర్ 11వ తేదీన సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా లీక్ అయిన వీడియో మాత్రం అభిమానుల్లో కొత్త జోష్ ను నింపిందని చెప్పాలి. విజయ్ దేవరకొండ కెరీర్ లో మరో భారీ హిట్ గా రణబాలి నిలుస్తుందా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.
