Begin typing your search above and press return to search.

విజయ్ వెనక్కి వెళ్లినా.. పోటీ మాత్రం పెద్దదే

రణబాలి సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 16కి షిఫ్ట్ అయ్యింది. అయితే పెద్ద సినిమా వాయిదా పడితే కొత్త డేట్ దగ్గర పోటీ తక్కువగా ఉండేలా చూసుకుంటారు.

By:  M Prashanth   |   27 Aug 2026 12:17 PM IST
విజయ్ వెనక్కి వెళ్లినా.. పోటీ మాత్రం పెద్దదే
X

రణబాలి సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 16కి షిఫ్ట్ అయ్యింది. అయితే పెద్ద సినిమా వాయిదా పడితే కొత్త డేట్ దగ్గర పోటీ తక్కువగా ఉండేలా చూసుకుంటారు. కానీ విజయ్ దేవరకొండ సినిమా మాత్రం అలా చేయలేదు. అక్టోబర్ 15న రజినీకాంత్ జైలర్ 2 వస్తోంది. అక్టోబర్ 16నే ధనుష్ ఓం కూడా రిలీజ్ కానుంది. అంటే సెప్టెంబర్ వదిలి మరో నెల టైమ్ తీసుకున్న రణబాలి, చివరకు ఇంకా పెద్ద పోటీ మధ్యలోకి వెళ్లింది.





అయితే ఈ నెల రోజుల గ్యాప్ సినిమాకు మాత్రం ఉపయోగపడొచ్చు. జూన్ మొదటి వారానికే రణబాలి 100 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. అప్పటికి దాదాపు 90 శాతం షూటింగ్ అయిపోయిందని మేకర్స్ చెప్పారు. గండికోట షెడ్యూల్ కూడా పూర్తయింది. అంటే సినిమా పూర్తిగా మొదటి దశలో ఉండి వాయిదా పడలేదు. మిగిలిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ఐదు భాషల ప్రమోషన్స్‌కు ఇంకాస్త టైమ్ దొరికినట్లే. వాయిదాకు కారణం ఏంటన్నది మాత్రం టీమ్ అధికారికంగా చెప్పలేదు.

రణబాలి కూడా చిన్న స్థాయిలో చేస్తున్న సినిమా కాదు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలన నేపథ్యంలో కథ నడుస్తోంది. విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న జయమ్మ పాత్రలో కనిపిస్తోంది. ది మమ్మీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆర్నాల్డ్ వోస్లూ విలన్ సర్ థియోడర్ హెక్టర్‌గా చేస్తున్నాడు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో ఒకేసారి తీసుకెళ్లే ప్లాన్ ఉంది. అందుకే రిలీజ్ ముందు పూర్తి స్థాయిలో రెడీ కావడానికి ఈ సమయం పనికొస్తుంది.

కానీ అక్టోబర్ 16 దగ్గర అసలు సమస్య స్క్రీన్స్. జైలర్ 2 షూటింగ్ కూడా పూర్తయింది. మొదటి భాగం భారీ హిట్ కావడంతో సౌత్‌లో సీక్వెల్‌కు పెద్ద రిలీజ్ తప్పదు. పైగా ఒక రోజు తర్వాత రణబాలి వస్తోంది. అదే రోజు ధనుష్ ఓం కూడా ఉంది. అందులో మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల లాంటి పేర్లు ఉన్నాయి. అది కూడా తెలుగు సహా పలు భాషల్లో వస్తోంది.

ఇక్కడ విజయ్‌కు తెలుగు మార్కెట్ ఒక్కటే లెక్క కాదు. రణబాలిని పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్తున్నారు కాబట్టి తమిళంలో జైలర్ 2, ఓం నుంచి గట్టి పోటీ ఉంటుంది. కేరళలో మమ్ముట్టి పేరు ఓంకు ప్లస్ అవుతుంది. హిందీలో కూడా మూడు సినిమాలు తమకు కావాల్సిన షోలు తీసుకోవాలి. అంటే అక్టోబర్ డేట్ సినిమా పూర్తి చేసుకోవడానికి టైమ్ ఇచ్చినా, రిలీజ్ దగ్గర మాత్రం పని మరింత కష్టమైంది. అందుకే రణబాలికి న్యూ చాలెంజ్ తప్పదు. సినిమా మీద నమ్మకం లేకపోతే జైలర్ 2 పక్కన, ఓం ఉన్న రోజున డేట్ పెట్టడం కూడా ఈజీ కాదు. ఇప్పుడు రణబాలి ముందు ఉన్న టార్గెట్ ఒక్కటే. అదనంగా దొరికిన నెల రోజులను ప్రమోషన్స్ కు బాగా వాడుకుని, అక్టోబర్‌లో తనకంటూ సరిపడా స్పేస్ తెచ్చుకోవాలి.