విజయ్ 'మిడిల్ క్లాస్' స్ట్రాటజీ.. ఇదే కదా కావాల్సింది!
సినిమా తీయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఆ డబ్బులు తిరిగి రాబట్టుకోవడానికి టికెట్ రేట్లు పెంచుతున్నారు.
By: M Prashanth | 10 Oct 2026 10:57 PM ISTసినిమా తీయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఆ డబ్బులు తిరిగి రాబట్టుకోవడానికి టికెట్ రేట్లు పెంచుతున్నారు. కానీ పెరిగిన రేట్లతో అనేక మంది ఆడియన్స్ థియేటర్ కు రావాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో హీరో విజయ్ దేవరకొండ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. తన సినిమాలకు టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం లేదని ఆయన చెప్పడం వెనుక సరైన స్ట్రాటజీ ఉంది.
సినిమా ఎక్కువ మందికి చేరాలంటే ముందుగా సామాన్యుడికి అందుబాటులో ఉండాలన్నదే విజయ్ ఆలోచన. ఆయన నటించిన రణబాలి ఈ నెల 16న విడుదల కానుండగా, ఆ ప్రమోషన్స్ లో టికెట్ రేట్లపై చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. తన సినిమాలకు టికెట్ రేట్లు పెంచవద్దని నిర్మాతలకు చెబుతుంటానని రివీల్ చేశారు. తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో సినిమా చూడటానికి డబ్బులు దాచుకునేవాడినని, అప్పట్లో రేట్ ఒక్కసారిగా పెరగడంతో బాధపడ్డానని చెప్పారు.
ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు తన సినిమాల విషయంలో ఆ నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణంగా తెలుస్తోంది. నిజానికి సినిమా టికెట్ రేట్ అనేది చిన్న విషయం కాదు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ థియేటర్ కు వెళ్లాలంటే టికెట్లతో పాటు జర్నీ, ఫుడ్ ఐటమ్స్ ఖర్చులను కూడా లెక్కలోకి తీసుకుంటాయి. కుటుంబం మొత్తం కలిసి సినిమా చూడాలంటే ఖర్చు మరింత పెరుగుతుంది. టికెట్ ధరలు ఎక్కువగా ఉంటే సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ ఉన్నా కొందరు ఆగుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో రేట్లు కంట్రోల్ లో ఉంచితే ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ విజయ్ ఆలోచనలో మరో యాంగిల్ కూడా ఉంది. పెద్ద సినిమాలకు టికెట్ ధరలు పెంచడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ వసూళ్లు సాధించాలని నిర్మాతలు భావిస్తుంటారు. కానీ టికెట్ ధర అందుబాటులో ఉంటే ఒకసారి సినిమా చూసే ప్రేక్షకుడు మరోసారి చూసేందుకు ఇంట్రెస్ట్ చూపవచ్చు. అయితే ధరలు తగ్గించినంత మాత్రాన వసూళ్లు పెరుగుతాయని చెప్పలేం.
సినిమాపై ఇంట్రెస్ట్, ప్రేక్షకుల రెస్పాన్స్ కూడా మెయినే. అందుకే విజయ్ కామెంట్స్ కేవలం వ్యక్తిగత అభిప్రాయంగా చూడలేం. సినిమా ప్రేక్షకుడికి అందుబాటులో ఉండాలనే ఆలోచనగా కూడా చూడాలి. అయితే స్టార్ హీరోల సినిమాలకు భారీ బడ్జెట్లు, బిజినెస్ లెక్కలు ఉంటాయి. అందువల్ల ప్రతి మూవీకి కూడా ఒకే లాంటి రేట్ల డెసిషన్ పాజిబుల్ కాకపోవచ్చు.
అయినప్పటికీ సామాన్య ప్రేక్షకుడిపై భారం కాకుండా టికెట్ రేట్లు నిర్ణయించాలనే ఆలోచన ఇండస్ట్రీలో ఇప్పుడు ఆలోచించాల్సిన విషయమే. రాజమౌళితో సినిమా చేస్తే తప్ప తన చిత్రాలకు టికెట్ ధరలు పెంచాల్సిన అవసరం లేదని విజయ్ చెప్పడం ఆయన ఆలోచనను మరింత స్పష్టం చేస్తోంది. సినిమా ఎంత పెద్దదైనా ప్రేక్షకుడే మెయిన్. ఆ ప్రేక్షకుడికి సినిమా చూడటం భారంగా మారకుండా ఉంటేనే థియేటర్లతో రిలేషన్ కంటిన్యూ అవుతుంది. సినీ ఇండస్ట్రీకి ఇప్పుడు కావాల్సింది కూడా ఇదే.
